పట్టణ స్థానిక సంస్థల్లో ‘డీలిమిటేషన్’
ABN , Publish Date - Mar 25 , 2026 | 05:35 AM
రాష్ట్రంలోని మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో ఎన్నికైన సభ్యుల సంఖ్యను జనాభా ఆధారంగా సవరిస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
సవరణ ఉత్తర్వులు జారీచేసిన మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ
అమరావతి, మార్చి 24(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో ఎన్నికైన సభ్యుల సంఖ్యను జనాభా ఆధారంగా సవరిస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ మంగళవారం వేర్వేరు జీవోలు జారీ చేసింది. ప్రస్తుతం అమల్లో ఉన్న 2004 మున్సిపాలిటీ నియమాలు, 2005 మున్సిపల్ కార్పొరేషన్ నియమాల్లో సవరణ ప్రతిపాదనలను ఆమోదించింది. తాజా సవరణల ప్రకారం... మున్సిపల్ కార్పొరేషన్లలో జనాభా 2లక్షల వరకూ ఉంటే 60మంది కార్పొరేటర్లు, 2లక్షల నుంచి 3లక్షల మంది ఉన్నచోట 62మంది, 3లక్షల నుంచి 4లక్షల మంది ఉంటే 66మంది, 4లక్షల నుంచి 5లక్షల మంది మధ్య ఉంటే 68మంది, 5లక్షల నుంచి 6లక్షల మంది ఉంటే 72మంది, 6లక్షల నుంచి 10లక్షల మంది ఉంటే 76మంది, 10లక్షల నుంచి 15లక్షల మంది ఉంటే 86మంది, 15లక్షలకు పైగా జనాభా ఉన్న కార్పొరేషన్లలో 120మంది కార్పొరేటర్లను నియమించుకోవచ్చని పేర్కొన్నారు. అదేవిధంగా మున్సిపాలిటీల్లో 30వేల మంది జనాభా ఉన్నచోట 23మంది వార్డు సభ్యులు, 30వేల నుంచి 40వేల మంది ఉంటే 28మంది, 40వేల నుంచి 50వేల మంది ఉంటే 32మంది, 50 వేల నుంచి 60వేల మంది ఉంటే 36మంది, 60వేల నుంచి 80వేల మంది ఉంటే 40మంది, 80వేల నుంచి లక్ష మంది ఉంటే 44మంది, లక్ష నుంచి 1.5లక్షల మంది ఉంటే ఉంటే 48మంది, 1.50లక్షల మందికి పైగా జనాభా ఉంటే 52మంది వార్డు సభ్యులు ఉండవచ్చని పేర్కొన్నారు. ఒకసారి నిర్ణయించిన వార్డు సభ్యులు, కార్పొరేటర్ల సంఖ్యను తదుపరి జనగణన వివరాలు వెలువడే వరకు మార్చకూడదని తాజా ఉత్తర్వుల్లో ప్రభుత్వం సూచించింది. అయితే మున్సిపల్ స్థానిక సంస్థల పరిధిలో మార్పులు, కొత్తగా ఏర్పాటు లేదా అప్‌గ్రెడేషన్ జరిగిన సందర్భాల్లో మాత్రం మార్పులు చేయవచ్చని తెలిపింది.