CM Chandrababu Naidu: అందరి ఆనందమే లక్ష్యం
ABN , Publish Date - Jan 17 , 2026 | 03:15 AM
రాష్ట్రంలో అన్ని వర్గాలూ ఆనందంగా ఉండాలనేదే కూటమి ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టంచేశారు.
2027 నాటికి భూసమస్యలుండవు: సీఎం
అదే ఇప్పుడు నాకు సవాల్.. బాధ్యత కూడా
జేసీలకు ఈ ఏడాదంతా ఇదే పని
గత ఏడాది ప్రజల అవసరాలు తీర్చాం
ఈ సంవత్సరం వారి ఆకాంక్షలు తీర్చేలా పనిచేద్దాం
సంక్షేమం.. అభివృద్ధితో సుపరిపాలన
ట్రూడౌన్‌తో విద్యుత్ చార్జీల భారం ఇప్పటికే తగ్గించాం
గ్రామాల్లో ప్రతి ఇంటిపైనా సోలార్ రూఫ్‌టాప్ పెట్టేలా చర్యలు
ప్రకృతి సాగుకు ప్రోత్సాహం
పీ-4లో 10 లక్షల కుటుంబాల దత్తత
ఈ ఏడాది వాటిపై దృష్టి పెడతాం: సీఎం
మన మూలాలను మరచిపోరాదు. మన పెద్దలను స్మరించుకోవడం మానరాదు. లేకపోతే జంతువుకూ, మనిషికీ తేడా ఉండదు.
- సీఎం చంద్రబాబు
అమరావతి/తిరుపతి, జనవరి 16 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో అన్ని వర్గాలూ ఆనందంగా ఉండాలనేదే కూటమి ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టంచేశారు.గత ప్రభుత్వం భూములను 22(ఏ) నిషేధిత జాబితాలో పెట్టి చాలా గందరగోళం సృష్టించిందని విమర్శించారు. పట్టాదార్ పాస్ పుస్తకాలపై అప్పటి సీఎం తన సొంత ఫొటో పెట్టుకుని భూముల రికార్డులను గందరగోళంగా మార్చారన్నారు. సర్వే చేసి రాజముద్రతో తిరిగి పట్టాదార్ పాస్‌పుస్తకాలు ఇస్తున్నామని.. వాటిపై క్యూఆర్ కోడ్ కూడా ముద్రిస్తున్నామని తెలిపారు. 2027 నాటికి రాష్ట్రంలో భూ సమస్యలు లేకుండా పరిష్కరిస్తామన్నారు. అదే ఇప్పుడు తనకు సవాల్‌గానూ, పెద్ద బాధ్యత గానూ మారిందని చెప్పారు. జాయింట్ కలెక్టర్లు ఈ ఏడాదంతా దీనిపైనే దృష్టి పెట్టి పనిచేయాలని ఆదేశించామన్నారు. అయినా ఫిర్యాదులు వస్తే తానే స్వయంగా వెళ్లి విచారిస్తానన్నారు. సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆయన గురువారం తన స్వగ్రామం నారావారిపల్లెలోని నివాసంలో మీడియాతో మాట్లాడారు. పార్టీ నేతలు, కార్యకర్తలతో టెలికాన్ఫరెన్సు నిర్వహించారు. 2025లో ప్రజల అవసరాలను తీర్చామని, 2026లో వారి ఆకాంక్షలను నెరవేర్చేలా పనిచేయాలని టీడీపీ శ్రేణులకు పిలుపిచ్చారు.
సంక్షేమం, అభివృద్ధితో సుపరిపాలనకు నాంది పలికామన్నారు. పండుగకు పల్లెలకు వచ్చినవారికి గతంలో మాదిరి గుంతలు పడిన రోడ్లు కనిపించలేదన్నారు. గ్రామాల అభివృద్ధికి ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్తున్నామని చెప్పారు. గ్రీన్ ఎనర్జీ పాలసీతో గ్రామాల్లో ప్రతి ఇంటిపైనా సోలార్ రూఫ్‌టా్‌పలు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ప్రకృతి సాగును ప్రోత్సహిస్తున్నామని, పరిశుద్ధమైన, ప్రశాంతమైన గ్రామాలను తీర్చిదిద్దడానికి కృషి చేస్తున్నామన్నారు. స్పీడ్ ఆఫ్ డూ యింగ్ బిజినె్‌సతోపాటు స్పీడ్ ఆఫ్ గవర్నెన్స్ డె లివరింగ్ విధానం వైపు వెళ్తున్నామని తెలిపారు. కూటమి ప్రభుత్వం రాగానే మెగా డీఎస్సీ, పోలీ సు రిక్రూట్‌మెంట్, తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ, స్త్రీశక్తి, ఎన్టీఆర్ భరోసా, అన్న క్యాంటీన్ వంటి పథకాలను అమలు చేశామని గుర్తుచేశారు. ధాన్యం సేకరించిన 48 గంటల్లోనే రైతులకు డబ్బులు చెల్లిస్తున్నామని, ఈ ఏడాది 42 లక్షల టన్నులు కొనుగోలు చేసి.. రూ.10వేల కోట్లు వారికి అందజేశామన్నారు. విద్యుత్ చార్జీల భారం తగ్గించామని, ట్రూడౌన్ విధానంతో యూనిట్‌కు 13పైసలు తగ్గించామని.. ఈ ఏడాది మరింత తగ్గించేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. సాయంత్రం 4గంటలకు ఆయన హెలికాప్టర్లో ఉండవల్లి బయల్దేరారు. ఆయా సందర్భాల్లో సీఎం ఇంకా ఏం చెప్పారంటే..
ఉద్యోగులకు బకాయిలు చెల్లించాం..
ఉద్యోగులకు రూ.1,100కోట్లతో డీఏ ఎరియర్స్, సరెండర్ లీవులు చెల్లించాం. 60నెలలుగా చెల్లించని డీఏ ఎరియర్స్‌ను సీపీఎస్ ఉద్యోగులకు చెల్లించాం. 2019కి ముందు పనులు చేసిన నీరు-చెట్టు బిల్లులు కూడా క్లియర్ చేశాం. పార్టీపరంగా పార్లమెంటు నియోజకవర్గ స్థాయి వరకు పదవులు భర్తీ చేశాం.. త్వరలోనే రాష్ట్ర కమిటీ నియామకం చేపడతాం. రాష్ట్రంలోని ప్రతి పల్లె పండుగ శోభతో కళకళలాడింది. ఇచ్ఛాపురం నుంచి కుప్పం వరకు ఈ వాతావరణం కనబడింది. సంక్రాంతి సంప్రదాయాలను పునరుద్ధరించుకుందాం. కుటుంబంతో సంక్రాంతికి సొంత ఊరికి వెళదామని, మూలాలను మరచిపోకుండా పిల్లలకు వారసత్వం ఇవ్వాలని 15-16 ఏళ్ల కిందటే నా భార్య భువనేశ్వరి చెప్పింది. ముఖ్యమంత్రిగా, పార్టీ అధ్యక్షుడిగా కుటుంబంతో కలసి స్వగ్రామానికి వస్తే రాష్ట్ర ప్రజలందరికీ ఒక సందేశం ఇచ్చినట్లవుతుందనే క్రమం తప్పకుండా కుటుంబంతో వస్తున్నా. ఉన్నతస్థాయిలో ఉన్నవారు తమ జన్మ భూమిని మరచిపోవద్దు. ప్రభుత్వాల ప్రణాళికల వల్ల సంపన్నులు పెరుగుతున్నారు. అదేస్థాయిలో ఆర్థిక అసమానతలూ పెరుగుతున్నాయి. వాటిని తగ్గించాలన్న భావనలో నుంచి పుట్టుకొచ్చిందే పీ-4 కార్యక్రమం. దీనికింద 10లక్షల కుటుంబాలను దత్తత తీసుకున్నాం. ఈ ఏడాది ఆ కుటుంబాలపై దృష్టి పెడతాం. రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర అనారోగ్యంతో ఉంటున్న వారికి 3నెలలకోసారి వైద్యపరీక్షలు నిర్వహిస్తాం. ఏఐ, డాక్టర్, న్యూట్రిషనిస్ట్ సాయంతో వైద్య చికిత్స, హెల్త్ స్కోర్ నమోదు చేస్తాం. ‘సంజీవని’ కార్యక్రమం కింద బిల్‌గేట్స్ ఫౌండేషన్ ద్వారా కుప్పంలో చేపట్టిన కార్యక్రమం విజయవంతమైంది. ప్రస్తుతం చిత్తూరు జిల్లావ్యాప్తంగా, నారావారిపల్లెలోనూ అమలు చేస్తున్నాం. ఈ ఏడాది రాష్ట్రమంతా విస్తరింపజేస్తాం.
19న దావోస్‌కు సీఎం
సీఎం చంద్రబాబు దావోస్‌లో జరిగే ప్రపంచ ఆర్థిక సదస్సు (డబ్ల్యూఈఎఫ్) వార్షిక సమావేశానికి హాజరుకానున్నారు. ఆదివారం రాత్రి 8.30కి విజయవాడ నుంచి ఢిల్లీ వెళ్లి.. 19న తెల్లవారుజామున జూరిక్ చేరుకుంటారు. 19 నుంచి 23 వరకు దావో్‌సలో జరిగే సదస్సులో పాల్గొంటారు. ఆయన వెంట మంత్రులు లోకేశ్, టీజీ భరత్ తదితరులు వెళ్తున్నారు.