Share News

ఆక్వా రైతుల సబ్సిడీకి తిలోదకాలు ఇచ్చిందే జగన్‌: మంత్రి గొట్టిపాటి

ABN , Publish Date - Jul 17 , 2026 | 04:52 AM

అధికారంలో ఉన్నప్పుడు ఆక్వా రైతుల విద్యుత్తు సబ్సిడీ విధానాన్ని నిర్వీర్యం చేసిన జగన్‌ ఇప్పుడు వారి గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందని మంత్రి గొట్టిపాటి రవికుమార్‌ విమర్శించారు.

ఆక్వా రైతుల సబ్సిడీకి తిలోదకాలు ఇచ్చిందే జగన్‌: మంత్రి గొట్టిపాటి

అమరావతి, జూలై 16(ఆంధ్రజ్యోతి): అధికారంలో ఉన్నప్పుడు ఆక్వా రైతుల విద్యుత్తు సబ్సిడీ విధానాన్ని నిర్వీర్యం చేసిన జగన్‌ ఇప్పుడు వారి గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందని మంత్రి గొట్టిపాటి రవికుమార్‌ విమర్శించారు. జగన్‌ హయాంలోనే ఆక్వా ప్రాంతాన్ని ఆక్వా, నాన్‌ ఆక్వా జోన్‌లుగా విభజించి వేలాది మంది రైతులను విద్యుత్తు సబ్సిడీకి దూరం చేశారని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే అర్హులైన ఆక్వా రైతులందరికీ విద్యుత్తు సబ్సిడీ అందేలా చర్యలు తీసుకుందన్నారు. అర్హులైన ఆక్వా రైతులందరికీ యూనిట్‌ రూ.1.50కే విద్యుత్తు అందిస్తున్నామన్నారు. అధికారంలో ఉన్న ఐదేళ్లు విద్యుత్తు రంగంతోపాటు ఆక్వా రంగాన్ని, ఇతర కీలక వ్యవస్థలను వైసీపీ ప్రభుత్వం దెబ్బతీసిందని, ఇప్పుడు ప్రజలను తప్పుదోవ పట్టించేలా అసత్య ప్రచారం చేస్తూ జగన్‌ వ్యాఖ్యలు చేస్తున్నారని గొట్టిపాటి విమర్శించారు. ఇదే అంశంపై టీడీపీ సీనియర్‌ నేత యనమల రామకృష్ణుడు ఓ ప్రకటన చేస్తూ.. ‘ఆర్థిక వ్యవస్థకు కీలకమైన ఆక్వా రంగాన్ని సర్వనాశనం చేయాలన్నదే జగన్‌ లక్ష్యం. జగన్‌ చేసిన వ్యాఖ్యలు ఆయన అవగాహన లేమికి అద్దం పడుతున్నాయి. రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి జగన్‌ పెద్ద అవరోధంగా మారారు’ అని విమర్శించారు.

Updated Date - Jul 17 , 2026 | 04:53 AM