వేగంగా పూర్తిచేయండి: గొట్టిపాటి
ABN , Publish Date - Mar 25 , 2026 | 04:19 AM
రాష్ట్రంలో పునరుత్పాదక విద్యుత్తు రంగంలో ప్రాజెక్టులను శరవేగంగా పూర్తి చేయాలని విద్యుత్తు శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ పెట్టుబడిదారులను, అధికారులను కోరారు.
అమరావతి, మార్చి 24(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో పునరుత్పాదక విద్యుత్తు రంగంలో ప్రాజెక్టులను శరవేగంగా పూర్తి చేయాలని విద్యుత్తు శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ పెట్టుబడిదారులను, అధికారులను కోరారు. ఈ రంగంలో పెట్టుబడులు పెట్టిన పారిశ్రామికవేత్తలు, అధికారులతో మంగళవారం ఆయన సమీక్ష నిర్వహించారు. సమావేశంలో బ్రూక్ ఫీల్డ్ యాక్సిస్ ప్రతినిధులు, నెడ్‌క్యాప్ అధికారులు పాల్గొన్నారు. ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తిచేసి కమిషన్ చేసే దిశగా పెట్టుబడిదారులు చర్యలు తీసుకోవాలన్నారు. ప్రాజెక్టుల పూర్తికి ఎదురయ్యే సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలన్నారు.
ఏపీ క్లీన్ ఎనర్జీ పాలసీకి కీలక సవరణలు
ఏపీ ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీ మార్గదర్శకాల్లో ప్రభుత్వం కీలక సవరణలు చేసింది. ఇంధన రంగంలో పెట్టుబడులను ప్రోత్సహించడం, ప్రాజెక్టుల అమలును సులభతరం చేయడం ఈ సవరణల లక్ష్యమని ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ తెలిపారు. సోలార్, విండ్, హైబ్రిడ్ ప్రాజెక్టుల పూర్తికి గతంలో 24 నెలలు సమయం ఇవ్వగా, దానిని 30 నెలలకు పెంచారు. పంప్డ్ స్టోరేజీ ప్రాజెక్టుల కాలవ్యవధిని 48 నుంచి 72 నెలలకు పెంచారు.