Minister Gottipati Ravikumar: విద్యుత్ శాఖను వెంటాడుతున్న జగన్ పాపాలు
ABN , Publish Date - Jan 02 , 2026 | 05:56 AM
జగన్ నేతృత్వంలోని వైసీపీ ప్రభుత్వం చేసిన పాపాలు గత ఐదేళ్లుగా విద్యుత్ శాఖను, రాష్ట్ర ప్రజలను వెంటాడుతున్నాయని ఇంధనశాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ పేర్కొన్నారు.
ట్రూ అప్ పేరుతో రూ.32,166 కోట్ల భారం మోపిన వైసీపీ
కొనుగోళ్ల నియంత్రణతో ప్రజలపై భారం తగ్గిస్తున్నాం: గొట్టిపాటి
అమరావతి, జనవరి 1(ఆంధ్రజ్యోతి): జగన్ నేతృత్వంలోని వైసీపీ ప్రభుత్వం చేసిన పాపాలు గత ఐదేళ్లుగా విద్యుత్ శాఖను, రాష్ట్ర ప్రజలను వెంటాడుతున్నాయని ఇంధనశాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ పేర్కొన్నారు. రాష్ట్రంలో అందుబాటులో ఉన్న వనరులను వినియోగించుకోకుండా కమీషన్ల కోసం కక్కుర్తిపడి అడ్డగోలుగా విద్యుత్ కొనుగోలు చేశారని గురువారం ఓ ప్రకటనలో విమర్శించారు. ఐదేళ్లలో ట్రూ అప్ పేరుతో రూ.32,166 కోట్ల భారాన్ని ప్రజలపై మోపారన్నారు. 2019 వరకు మిగులు విద్యుత్ రాష్ట్రంగా ఉన్న ఏపీని వైసీపీ హయాంలో అంధకారంలోకి నెట్టేశార విమర్శించారు. చంద్రబాబు మళ్లీ అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యుత్ కొనుగోళ్ల నియంత్రణతో ప్రజలపై భారాన్ని తగ్గిస్తున్నారని తెలిపారు. 1999లో ఏపీఈఆర్‌సీ ఏర్పడిన నాటి నుంచి తొలిసారిగా ట్రూడౌన్ అమలు చేసిన ఘనత కూటమి సర్కార్‌కు దక్కుతుందన్నారు. విద్యుత్ చార్జీలను తగ్గించాలనే లక్ష్యంతో ప్రభుత్వం అడుగులు వేస్తోందని పేర్కొన్నారు.