Share News

‘గూగుల్‌’ డేటా సెంటర్‌కు 28న శంకుస్థాపన

ABN , Publish Date - Apr 07 , 2026 | 05:13 AM

రాష్ట్రంలో ప్రతిష్టాత్మక గూగుల్‌ డేటా సెంటర్‌ నిర్మాణానికి ముహూర్తం ఖరారైంది. విశాఖపట్నం జిల్లాలో ఈ నెల 28వ తేదీన శంకుస్థాపన చేయనున్నారు.

‘గూగుల్‌’ డేటా సెంటర్‌కు 28న శంకుస్థాపన

  • హాజరుకానున్న సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్‌, కంపెనీ ప్రతినిధులు

  • 1.35 లక్షల కోట్లకు పైగా పెట్టుబడి

  • వెయ్యి మెగావాట్ల సామర్థ్యంతో ఆసియాలోనే అతిపెద్ద డేటా సెంటర్‌

  • 2028 చివరి నాటికి ప్రాజెక్టు అందుబాటులోకి వస్తుందని అంచనా

విశాఖపట్నం, ఏప్రిల్‌ 6 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ప్రతిష్టాత్మక గూగుల్‌ డేటా సెంటర్‌ నిర్మాణానికి ముహూర్తం ఖరారైంది. విశాఖపట్నం జిల్లాలో ఈ నెల 28వ తేదీన శంకుస్థాపన చేయనున్నారు. ఈ భూమి పూజ కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు, ఐటీ శాఖ మంత్రి లోకేశ్‌తో పాటు గూగుల్‌ సంస్థకు చెందిన ప్రముఖులు హాజరుకానున్నారు. అంతర్జాతీయ దిగ్గజ సంస్థ గూగుల్‌ అమెరికా వెలుపల అత్యధిక పెట్టుబడి 15 బిలియన్‌ డాలర్ల (రూ.1.35 లక్షల కోట్లకు పైగా) వ్యయంతో చేపడుతున్న మొదటి ప్రాజెక్టు ఇదే కావడం విశేషం. వెయ్యి మెగావాట్ల సామర్థ్యంతో ఆసియాలోనే అతిపెద్ద డేటా సెంటర్‌ను నిర్మించనున్నారు. 2028 చివరికి డేటా సెంటర్‌ పనులు పూర్తి చేసి, ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెబుతున్నారు. గూగుల్‌ డేటా సెంటర్‌కు మూడు చోట్ల మొత్తం 601.4 ఎకరాలు ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. విశాఖ జిల్లా ఆనందపురం తర్లువాడలో 266.6 ఎకరాలు, విశాఖ గ్రామీణ మండలం అడవివరంలో సింహాచలం దేవస్థానానికి చెందిన 160 ఎకరాలు, అనకాపల్లి జిల్లా రాంబిల్లిలో ఏపీఐఐసీకి చెందిన 174.8 ఎకరాలు కేటాయించారు. సింహాచలం దేవస్థాన భూములను లీజు ప్రాతిపదికన ఇవ్వాలని నిర్ణయించారు. దీనికి లీజు మొత్తం ఇంకా ఖరారు కాలే దు. ఆ భూమిలో మట్టి నమూనా పరీక్షలు జరుగుతున్నాయి. ఈ మూడు ప్రాం తాల్లో కలిపి మొత్త ం వెయ్యి మెగావాట్ల (ఒక గిగావాట్‌) సామర్థ్యం కలిగిన డేటా సెంటర్లు నిర్మిస్తారు. ఈ బాధ్యతను అదానీ కంపెనీకి అప్పగించారు. వీటి కోసం ఆ కంపెనీ వేర్వేరుగా మూడు సంస్థలను ఏర్పాటు చేసింది. తర్లువాడలో ఇప్పటికే భూమి చదును పనులు ప్రారంభమయ్యాయి. ఇటీవల పరిశ్రమల శాఖ కార్యదర్శి యువరాజ్‌ వచ్చి, జిల్లా అధికారులకు పలు సూచనలు చేశారు.

Updated Date - Apr 07 , 2026 | 05:13 AM