Share News

డేటా కేరాఫ్‌గా వైజాగ్

ABN , Publish Date - Apr 29 , 2026 | 04:02 AM

విశాఖ గూగుల్‌ క్లౌడ్‌ ఏఐ హబ్‌ దేశానికి గ్రోత్‌ ఇంజన్‌ కానుందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ‘‘ప్రపంచం కొత్త అంశం తెలుసుకోవాలనుకుంటే, గూగుల్‌ను వెతుకుతుంది.

డేటా కేరాఫ్‌గా వైజాగ్

  • గూగుల్‌ డేటా సెంటర్‌కు శంకుస్థాపన

  • మన గడపలోకి గూగులమ్మ

  • ఏపీని వెతుక్కొంటూ వచ్చిన సెర్చ్‌ ఇంజన్‌

  • గూగుల్‌ క్లౌడ్‌ ఏఐ హబ్‌ దేశానికి గ్రోత్‌ ఇంజన్‌

  • 2028 సెప్టెంబరు 28 నాటికి డేటా సెంటర్‌

  • అదానీ, భారతీ టెల్‌, గూగుల్‌ కలిస్తే సాధ్యమే

  • ప్రాజెక్టును 8 నెలల్లోనే లోకేశ్‌ సాధించారు

  • ఏఐ సేవకుడితోనూ మంత్రి పోటీ పడగలరు

  • ఉత్తరాంధ్రలో ఇక రివర్స్‌ వలసలు చూస్తాం

  • ఉద్యోగాల కోసం అందరూ ఇక్కడికే వస్తారు

  • గూగుల్‌ డేటా సెంటర్‌ భూమిపూజలో సీఎం

గూగుల్‌ డేటా సెంటర్‌తో విశాఖ ప్రపంచం దృష్టిని తనవైపు తిప్పుకొంది. 1 గిగావాట్‌ డేటా సామర్థ్యంతో తలపెట్టిన సెంటరుకు శంకుస్థాపన జరిగింది. మరోవైపు గూగుల్‌ను మించిన సామర్థ్యంతో డేటా సెంటరు ఏర్పాటుకు మరో దిగ్గజ కంపెనీ రిలయన్స్‌ ముందుకొచ్చింది. 1.5 గిగావాట్ల క్లస్టర్‌ ఏర్పాటుకు ఆ సంస్థ చేసిన ప్రతిపాదనకు పెట్టుబడుల ప్రోత్సాహక కమిటీ ఓకే చెప్పింది. దీంతో డేటాకు తిరుగులేని కేరాఫ్‌గా విశాఖ కొత్త అధ్యాయం ప్రారంభించినట్లయింది.

‘‘ఇప్పటివరకు ఉత్తరాంధ్ర నుంచి వలసలు ఉండేవి. ఇకపై ఈ పరిస్థితి తొలగిపోతుంది. పైగా ఉత్తరాంధ్రకు ఉద్యోగాల కోసం తరలి రావడం పెరుగుతుంది. ఇక్కడి ప్రజలు మంచివారు. రాష్ట్రాభివృద్ధి కోసం భూములుకోరితే కాదనకుండా సహకరించే మనసున్నవారు. గూగుల్‌ డేటా సెంటర్‌ స్థాపనతో సాంకేతిక విద్య అభ్యసించిన స్థానిక యువత ఎక్కడికో వెళ్లాల్సిన పని లేకుండా ఇక్కడే ఉద్యోగాలు లభిస్తాయి.’’

- సీఎం చంద్రబాబు

అమరావతి, ఏప్రిల్‌ 28 (ఆంద్రజ్యోతి) : విశాఖ గూగుల్‌ క్లౌడ్‌ ఏఐ హబ్‌ దేశానికి గ్రోత్‌ ఇంజన్‌ కానుందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ‘‘ప్రపంచం కొత్త అంశం తెలుసుకోవాలనుకుంటే, గూగుల్‌ను వెతుకుతుంది. కానీ, గూగుల్‌ తన డేటా సెంటర్‌ను ఏర్పాటు చేసేందుకు విశాఖను వెతుక్కుంటూ వచ్చింది.’’ అని సీఎం వ్యాఖ్యానించారు. అదానీ, భారతీటెల్‌, గూగుల్‌ కలిస్తే సెప్టెంబరు 28, 2028 నాటికే డేటా సెంటర్‌ పూర్తవుతుందన్న నమ్మకం తనకుందని చంద్రబాబు అన్నారు. విశాఖ తుర్లవాడలో గూగుల్‌ డేటా సెంటర్‌కు కేంద్రమంత్రులు అశ్వినీ వైష్ణవ్‌, శ్రీనివాస వర్మ, పెమ్మసాని చంద్రశేఖర్‌, కింజరాపు రామ్మోహననాయుడు, గూగుల్‌ గ్లోబల్‌ ఇన్‌ఫ్రా క్లౌడ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ బికాస్‌ కొలే, ఐటీ శాఖమంత్రి లోకేశ్‌తో కలిసి చంద్రబాబు మంగళవారం భూమిపూజ చేశారు. గూగుల్‌ డేటా సెంటర్‌ ఏర్పాటులో ప్రధాని మోదీ సంపూర్ణ సహకారం అందించారని, ఇప్పుడే ఈ వేదిక నుంచే ఆయనను సెంటరు ప్రారంభోత్సవానికి ఆహ్వానిస్తున్నానని సీఎం అన్నారు. వచ్చే ఏడాది గోదావరి పుష్కరాల్లోపు పోలవరం పూర్తవుతుందని, ఆ ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి మోదీని ఆహ్వానిస్తానని తెలిపారు. 60 రోజుల్లో అనకాపల్లికి గోదావరి జలాలు అందిస్తామని హామీ ఇచ్చారు. ఇంకా ఆయన ఏమన్నారంటే..


పాలనలో గూగుల్‌ సాయం తీసుకుంటాం

‘‘గూగుల్‌ డేటా సెంటర్‌ శంకుస్థాపనతో రాష్ట్రంలో టెక్నాలజీ రంగంలో కొత్త శకానికి శ్రీకారం చుట్టాం. రాష్ట్ర చరిత్రలో 2026 ఏప్రిల్‌ 28 సువర్ణాక్షరాలతో నిలిచిపోతుంది. 2025 సెప్టెంబరులో రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలంటూ గూగుల్‌ను మంత్రి లోకేశ్‌ కోరారు. ఆ వెంటనే గూగుల్‌ సమ్మతిని తెలిపింది. ఈ సమాచారాన్ని ప్రధాని నరేంద్రమోదీకి చెప్పిన వెంటనే, ఆయన తన సహకారం అందించడానికి ముందుకొచ్చారు. గూగుల్‌ ఇండియాకు వస్తానంటే, కావాల్సినంత సహకారాన్ని అందిద్దామని మోదీ హామీఇచ్చారు. ఈమేరకు కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ గూగుల్‌ డేటా సెంటర్‌కు అవసరమైన మార్గదర్శకాలన్నింటినీ సరళతరం చేశారు. లోకేశ్‌ తొలిసారి గూగుల్‌ను సందర్శించినప్పుడు విశాఖకు గూగుల్‌ వస్తుందని ఎవరూ ఊహించలేదు. కానీ, గత ఏడాది సెప్టెంబరులో సంప్రదింపులు మొదలు పెట్టిన ఎనిమిది నెలల్లోనే ఏకంగా డేటా సెంటర్‌కు శంకుస్థాపన జరిగింది. కార్యదక్షత, వేగాన్ని చూశాక, నాకు లోకేశ్‌పై విశ్వాసం కలిగింది. రాష్ట్రంలో 90 గిగావాట్ల గ్రీన్‌ ఎనర్జీ అందుబాటులో ఉంది. ఎనర్జీ, వైద్యం, భూగర్భ జలాలు, సాగునీటి వినియోగంపై గూగుల్‌ సహకారాన్ని కోరుతున్నాం.’’ అని సీఎం అన్నారు.


ఏఐకి దీటుగా లోకేశ్‌ నిలుస్తారు

‘‘సీఎంవోలోని నలుగురు కార్యదర్శులతోపాటు కొత్తగా ఏఐ అసిస్టెంట్‌ను నియమిస్తాం. అయితే, ఆ ఏఐ సేవకునికి దీటుగా మంత్రి లోకేశ్‌ పని చేస్తారన్న నమ్మకం నాకుంది. స్పీడ్‌ ఆఫ్‌ డెలివరింగ్‌ గవర్నెన్స్‌కు గూగుల్‌ క్లౌడ్‌ సహకారం తీసుకుంటాం. గూగుల్‌ రావడంతో విశాఖలో సాంకేతికవిద్య అభ్యసించిన వారికి స్థానికంగానే ఉద్యోగాలు లభించనున్నాయి.ఈ ఏడాది జూన్‌ ఒకటో తేదీన విశాఖ రైల్వేజోన్‌కు నోటిఫికేషన్‌ వస్తుంది.’’ అని చంద్రబాబు తెలిపారు. ఈ కార్యక్రమంలో హైదరాబాద్‌లోని యూఎస్‌ కాన్సులేట్‌ జనరల్‌ లారా విలియమ్స్‌, భారతీ ఎంటర్‌ప్రైజెస్‌ వైస్‌ చైర్మన్‌ రాకేశ్‌ భారతీ మిత్తల్‌, రాష్ట్ర మంత్రులు గుమ్మడి సంధ్యారాణి, వంగలపూడి అనిత తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Apr 29 , 2026 | 04:07 AM