Share News

విశాఖకు డేటా పవర్‌!

ABN , Publish Date - Apr 28 , 2026 | 04:02 AM

విశాఖ నగర కీర్తి కిరీటంలో మరో మణి వచ్చి చేరేందుకు సర్వం సిద్ధమైంది. దేశమే కాదు... ప్రపంచమే ఇటువైపు తిరిగి చూసే రోజు రానే వచ్చింది. ఐటీ దిగ్గజ సంస్థ గూగుల్‌ రూ. 1.35 లక్షల కోట్లతో వేయి మెగావాట్ల సామర్థ్యంతో...

విశాఖకు డేటా పవర్‌!

  • డేటా సెంటర్ల హబ్‌గా సాగర నగరం

  • నేడు గూగుల్‌ డేటా సెంటర్‌కు శంకుస్థాపన

  • రూ.1.35 లక్షల కోట్ల భారీ పెట్టుబడితో ఏర్పాటు

  • శంకుస్థాపనకు సీఎం చంద్రబాబు,

  • కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్‌, మంత్రి లోకేశ్‌

  • డేటా సెంటర్ల ఏర్పాటుకు మరిన్ని దిగ్గజ సంస్థలు

  • టీసీఎస్‌, సిఫీకి కూడా భూములు

  • టెక్‌ కంపెనీల రాకతో ఐటీ ఎకో సిస్టం

  • పెట్టుబడులకు వెంచర్‌ క్యాపిటలిస్ట్‌ల ఆసక్తి

ఒకప్పుడు అదొక చిన్న మత్స్యకార గ్రామం! ఇంతింతై అని ఎదిగింది! ఇప్పుడది... సాగర నగరం... ఉక్కు నగరం! నవ్యాంధ్రకు ఆర్థిక రాజధాని! ఐటీ రాజధాని! అక్కడే స్థిరపడాలని ఎంతో మంది భావించే సిటీ ఆఫ్‌ డెస్టినీ! ఈ ‘పోర్ట్‌ సిటీ’ ఇక డేటా సిటీగానూ రూపాంతరం చెందనుంది. విశాఖ నగర ప్రస్థానంలో మరో కొత్త అధ్యాయం మొదలవుతోంది. ప్రఖ్యాత గూగుల్‌ డేటా సెంటర్‌ ఏర్పాటుకు నేడు శంకుస్థాపన జరుగుతోంది.

(విశాఖపట్నం/అమరావతి - ఆంధ్రజ్యోతి)

విశాఖ నగర కీర్తి కిరీటంలో మరో మణి వచ్చి చేరేందుకు సర్వం సిద్ధమైంది. దేశమే కాదు... ప్రపంచమే ఇటువైపు తిరిగి చూసే రోజు రానే వచ్చింది. ఐటీ దిగ్గజ సంస్థ గూగుల్‌ రూ. 1.35 లక్షల కోట్లతో వేయి మెగావాట్ల సామర్థ్యంతో ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌ (ఏఐ) డేటా సెంటర్‌ ఏర్పాటుకు మంగళవారం శంకుస్థాపన జరగనుంది. విశాఖ సమీపంలోని ఆనందపురం మండలం తర్లువాడలోని 266 ఎకరాల్లో ఈ డేటా సెంటర్‌ ఏర్పాటు కానుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఐటీ శాఖ మంత్రి లోకేశ్‌తో పాటు కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్‌, గూగుల్‌ ప్రతినిధులు ఈ కార్యక్రమానికి హాజరవుతున్నారు. ఈ డేటా సెంటర్‌ నిర్మాణంలో అదానీ కనెక్ట్స్‌, ఎయిర్‌టెల్‌ నెక్స్‌ట్రా భాగస్వాములుగా ఉన్నాయి. గూగుల్‌ ఇప్పటివరకు అమెరికా బయట రూ.లక్ష కోట్లకు మించి పెట్టుబడి పెట్టలేదు. భారతదేశంలో ఆ స్థాయి విదేశీ పెట్టుబడి ఏ రాష్ట్రానికీ రాలేదు. ఇక విశాఖలో డేటా సెంటర్‌ ఏర్పాటుకు అదానీ గ్రూపు గతంలోనే ఒప్పందం చేసింది.


మధురవాడ హిల్‌ నంబరు 4లో కేటాయించిన 170 ఎకరాల్లో రూ. 14,634 కోట్ల పెట్టుబడితో ఇంటిగ్రేటెడ్‌ డేటా సెంటర్‌ ఏర్పాటు చేస్తామని అప్పట్లో ప్రకటించింది. మొదట 200 మెగావాట్లు, ఆ తరువాత మరో 100 మెగావాట్లతో డేటా సెంటర్లు నిర్మిస్తామని పేర్కొంది. ఇక దేశంలో 14కు పైగా డేటా సెంటర్లను నిర్వహిస్తున్న సిఫీ ఇన్ఫినిటీ స్పేసెస్‌ లిమిటెడ్‌ విశాఖలో 550 మెగావాట్ల సామర్థ్యంలో డేటా సెంటర్‌ నిర్మాణానికి ఒప్పందం చేసింది. గతేడాది డిసెంబరులో మంత్రి లోకేశ్‌ దీనికి శంకుస్థాపన చేశారు. ఆ సంస్థకు రెండు ప్రాంతాల్లో 28.6 ఎకరాలను ప్రభుత్వం కేటాయించింది. ఇక్కడ రూ. 15,266 కోట్లు పెట్టుబడికి, అక్టోబరు 2027 నాటికి డేటా సెంటర్‌ ఆపరేషన్‌లోకి తీసుకు రావడానికి సిఫీ అంగీకరించింది. మరో ప్రసిద్ధ ఐటీ సంస్థ ఆర్‌ఎంజెడ్‌ రూ. 83 వేల కోట్ల పెట్టుబడితో విశాఖలో ఒక గిగావాట్‌ సామర్థ్యం కలిగిన డేటా సెంటర్‌ ఏర్పాటు చేస్తామని దావోస్‌లోనే ఒప్పందం చేసింది. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌ (టీసీఎస్‌) కూడా డేటా సెంటర్‌ ఏర్పాటు చేస్తామని ముందుకువస్తే రాష్ట్ర ప్రభుత్వం రుషికొండ ఐటీ పార్క్‌ హిల్‌ నంబరు 3పై 21.16 ఎకరాలు కేటాయించింది. అందులో రూ. 1,370 కోట్ల పెట్టుబడితో పనులు చేపతామని టీసీఎస్‌ ప్రకటించింది. ఇలా ఒక దాని వెంట మరొకటి విశాఖలో డేటా సెంటర్ల ఏర్పాటుకు బడా కంపెనీలు ముందుకు వస్తున్నాయి. వీటికి అవసరమైన సబ్‌సీ కేబుల్‌ ల్యాండింగ్‌ సెంటర్లు కూడా పెట్టడానికి పెద్ద పెద్ద సంస్థలు ఆసక్తి చూపుతున్నాయి. గూగుల్‌ సంస్థ ‘బ్లూరామన్‌’ పేరుతో సబ్‌సీ కేబుళ్లను విశాఖపట్నం తీసుకువస్తోంది. వీటిని డేటా సెంటర్‌తో అనుసంధానం చేయడానికి సిఫీ టెక్నాలజీస్‌తో ఒప్పందం చేసుకుంది. భారత్‌లో ముంబై, విశాఖ నగరాలను ల్యాండింగ్‌ సెంటర్లుగా ఎంపిక చేసుకున్న మెటా సంస్థ కూడా సబ్‌మెరైన్‌ కేబుళ్లను విశాఖపట్నం తీసుకువచ్చి డేటా సెంటర్లకు అనుసంధానం చేసే బాధ్యతను సిఫీకే అప్పగించింది.


ఎకో సిస్టంతో పెట్టుబడులు

ఎవరైనా కొత్త ఆలోచనతో ముందుకు వస్తే హామీలు లేకుండా 90 శాతం వరకు పెట్టుబడి పెట్టే ‘వెంచర్‌ కేపిటలిస్టు’లు భారతదేశంలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లో చాలా తక్కువ. ఇప్పుడు గూగుల్‌, అదానీ, సిఫీ, టీసీఎస్‌ వంటి డేటా సెంటర్లతో పాటు కాగ్నిజెంట్‌, కాండ్యుయెంట్‌, ఇన్ఫోసిస్‌ వంటి ఐటీ కంపెనీలు కూడా విశాఖకు వస్తుండటంతో ఐటీ ఎకో సిస్టమ్‌ అభివృద్ధి చెందుతోంది. అమరావతిలో క్వాంటమ్‌ ల్యాబ్‌ కూడా దీనికి అండగా నిలుస్తోంది. పరిశోధన, అభివృద్ధి రంగాలు విస్తృతవుతాయి. ఈ రంగాల్లో పెట్టుబడి పెట్టడానికి దేశవిదేశీ వెంచర్‌ కేపిటలిస్టులు ముందుకు వస్తారని ఐటీ వర్గాలు చెబుతున్నాయి. డేటా సెంటర్లు, సబ్‌మెరైన్‌ ల్యాండింగ్‌ సెంటర్లు, ఐటీ కంపెనీలు, సెమీ కండక్టర్‌ కంపెనీల వల్ల విశాఖలో ఏఐ, డేటా, క్లౌడ్‌ ఎకో సిస్టమ్‌ అభివృద్ధి చెందుతుందని, వెంచర్‌ కేపిటలిస్టుల ద్వారా ఫండింగ్‌ వస్తుందని రుషికొండ ఐటీ పార్క్‌ ఉపాధ్యక్షుడు ఓ.నరేశ్‌కుమార్‌ అన్నారు. దీంతో భవిష్యత్తులో ఇక్కడి నుంచి ప్రపంచ స్థాయి సంస్థలు రూపుదిద్దుకుంటాయని ఆశాభావం వ్యక్తం చేశారు.


ఈ నెలలో రెండు గ్లోబల్‌ సెలబ్రేషన్లు

పక్షం రోజుల వ్యవధిలోనే రెండు గ్లోబల్‌ సెలబ్రేషన్లతో ఆంధ్రప్రదేశ్‌ ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. పూర్తి స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన రెండు క్వాంటమ్‌ రిఫరెన్స్‌ ఫెసిలిటీ సెంటర్లను ఈనెల 14న సీఎం చంద్రబాబు జాతికి అంకితం ఇచ్చారు. ఆ టెస్ట్‌ బెడ్స్‌లో ఒకటి అమరావతిలోని ఎస్‌ఆర్‌ఎం వర్సిటీలో, మరొకటి గన్నవరంలోని మేధా టవర్స్‌లో ఏర్పాటు చేశారు. దీంతో అమరావతి క్వాంటమ్‌ వ్యాలీ సత్తా ప్రపంచానికి తెలిసింది. ఇక విశాఖలో భారీ పెట్టుబడితో గూగుల్‌ సంస్థ ఏర్పాటు చేస్తున్న ఏఐ డేటా సెంటర్‌కు ముఖ్యమంత్రి చంద్రబాబు మంగళవారం శంకుస్థాపన చేయనున్నారు. ఒక గిగావాట్‌ సామర్థ్యంతో కూడిన ఈ డేటా సెంటర్‌తో గ్లోబల్‌ స్థాయిలో విశాఖపేరు మారుమోగిపోనుంది. యాక్సిలరేటెడ్‌ ఏఐతో డీప్‌ లెర్నింగ్‌, వేగవంతమైన మోడల్‌ ట్రైనింగ్‌ ఈ డేటా సెంటర్‌ ఉపయోగపడుతుంది. గూగుల్‌ క్లౌడ్‌ సర్వీసెస్‌, ఏఐ ఇన్నోవేషన్‌తో వివిధ సేవలు వేగవంతంగా నిర్వహించేందకు వీలవుతుంది. రీజియనల్‌ ఏఐ ఎకో సిస్టమ్‌ను సృష్టిస్తుంది. గూగుల్‌ డేటా సెంటర్‌ రాయలసీమ ప్రాంతంలోని గ్రీన్‌ ఎనర్జీని వినియోగించుకుంటుంది. నిరంతరాయంగా విద్యుత్‌ సరఫరాకు ప్రత్యేక డిస్కం ఏర్పాటుకు ప్రభుత్వం అవకాశం కల్పించింది.

Updated Date - Apr 28 , 2026 | 04:04 AM