గూగుల్ @ ఏపీ
ABN , Publish Date - Apr 27 , 2026 | 03:59 AM
ప్రఖ్యాత గూగుల్ ఏఐ డేటా సెంటర్‌కు రాష్ట్రం వేదిక అవుతోంది. విశాఖపట్నంలో 15 బిలియన్ డాలర్ల(దాదాపు రూ.లక్షా 35 వేల కోట్లు) పెట్టుబడితో గూగుల్ ఏఐ డేటా కేంద్రం ఏర్పాటు చేయనున్నారు.
రేపు విశాఖపట్నంలో ప్రతిష్ఠాత్మక గూగుల్ ఏఐ డేటా సెంటర్‌కు శంకుస్థాపన
తర్లువాడలో సీఎం చంద్రబాబు భూమిపూజ
గూగుల్ రాకతో విశాఖకు విశ్వఖ్యాతి
వైజాగ్‌లో సాఫ్ట్‌వేర్.. అమరావతిలో క్వాంటం
సమాచార, సాంకేతికతకు వేదికకానున్న రాష్ట్రం
భారత్ ఏఐ కేంద్రంగా.. వైజాగ్: చంద్రబాబు
అమరావతి/విశాఖపట్నం, ఏప్రిల్ 26 (ఆంధ్రజ్యోతి): ప్రఖ్యాత గూగుల్ ఏఐ డేటా సెంటర్‌కు రాష్ట్రం వేదిక అవుతోంది. విశాఖపట్నంలో 15 బిలియన్ డాలర్ల(దాదాపు రూ.లక్షా 35 వేల కోట్లు) పెట్టుబడితో గూగుల్ ఏఐ డేటా కేంద్రం ఏర్పాటు చేయనున్నారు. ఈ డేటా కేంద్రం నిర్మాణానికి మంగళవారం సీఎం చంద్రబాబు శంకుస్థాపన చేయనున్నారు. ఒక గిగావాట్‌కు పైగా సామర్థ్యంతో ఈ డేటా కేంద్రం ఏర్పాటుకానుంది. తర్లువాడలో 26.6 ఎకరాలు, అడవివరంలో 160 ఎకరాలు, అనకాపల్లి జిల్లా రాంబిల్లి వద్ద 174.8 ఎకరాల్లో ప్రభుత్వం భూమిని కేటాయించింది. ఈ కేంద్రాలు 2028 నాటికి పూర్తి సామర్థ్యంతో అందుబాటులోకి వస్తాయని.. ప్రభుత్వానికి గూగుల్ సంస్థ అధికారికంగా సమ్మతి పత్రాన్ని అందించింది. ఈ డేటా సెంటర్ కార్యకలాపాలు ప్రారంభమైతే సీ-కేబుల్ ద్వారా డేటా క్షణాల్లో గమ్యానికి చేరుతుంది. ఇప్పటికే కాంతివేగాన్ని అందుకున్న సమాచార సాంకేతిక వ్యవస్థ ఈ డేటా సెంటర్ల ఏర్పాటుతో మరింత వేగంతో పనిచేస్తుంది.
తొలి ప్రైవేట్ డిస్కమ్‌గా
రాష్ట్ర ప్రభుత్వ అధీనంలో తూర్పు(విశాఖ), కేంద్ర(విజయవాడ), దక్షిణ ప్రాంత(తిరుపతి) విద్యుత్తు డిస్ట్రిబ్యూషన్ కంపెనీలు పని చేస్తున్నాయి. తొలిసారి గూగుల్ ఏఐ డేటా సెంటర్‌కు విద్యుత్తు కొనుగోళ్లు, వినియోగం కోసం డీమ్డ్ డిస్ట్రిబ్యూటరీ కంపెనీ హోదాను ప్రభుత్వం కల్పించింది. రాష్ట్రంలో స్వతంత్ర యాజమాన్య నిర్వహణ లైసెన్సు పొందిన తొలి ప్రైవేట్ డిస్కమ్‌గా గూగల్ ఏఐ డేటా సెంటర్ నిలిచింది. ఒక గిగావాట్ విద్యుత్తు సామర్థ్యంతో డేటా సెంటర్‌కు స్వేచ్ఛాయుత విద్యుత్తు కొనుగోళ్లు, వినియోగంతో కూడిన లైసెన్సును ప్రభుత్వం జారీ చేసింది. భవిష్యత్తులో సౌర, పవన, పంప్డ్ స్టోరేజీతో కూడిన గ్రీన్ కారిడార్‌గా మారనున్న రాయలసీమ నుంచి ప్రత్యేక ట్రాన్స్‌మిషన్ గ్రిడ్ ద్వారా గూగుల్ సంస్థ విద్యుత్తును సమీకరించుకుంటుంది.
ప్రపంచ పటంలో విశాఖ
విశాఖ, అనకాపల్లి జిల్లాల్లో ఏర్పాటు చేయనున్న గూగుల్ డేటా సెంటర్ల ద్వారా ప్రపంచ పటంలో విశాఖకు ప్రత్యేక స్థానం లభించనుంది. సాఫ్ట్‌వేర్ రంగంలో మూడు దశాబ్దాలకు పైగా ప్రపంచ శ్రేణి సంస్థలకు స్థావరంగా మారిన హైదరాబాద్‌కు దక్కిన గౌరవం ఏపీకి పుష్కర కాలంలోనే గూగుల్ డేటా సెంటర్‌తో దక్కింది. సాఫ్ట్‌వేర్ రంగానికి ఏపీని హబ్‌గా మార్చేలా గూగుల్ డేటా సెంటర్ అడుగులు వేస్తోంది. 2014లో రాష్ట్ర విభజన జరిగాక.. విశాఖను సాఫ్ట్‌వేర్ కేంద్రంగా చేయాలని సీఎం చంద్రబాబు భావించారు. ఈ దిశగా అడుగులు వేశారు. 2024లో చంద్రబాబు నేతృత్వంలో కూటమి ప్రభుత్వం వచ్చాక.. సాఫ్ట్‌వేర్ రంగంలో కదలిక వచ్చింది. గూగుల్ డేటా సెంటర్ స్థాపనపై రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్నాక.. ఈ డేటా సెంటర్ నిర్మాణ బాధ్యత అదానీకి దక్కింది. ఈ నెల 28న ఈ డేటా సెంటర్‌కు ముఖ్యమంత్రి శంకుస్థాపన చేయనున్నారు. పనులు శరవేగంగా పూర్తి చేసి 2028 నాటికి ఒక గిగావాట్ డేటా సామర్థ్యంతో గూగుల్ కేంద్రం అందుబాటులోకి రానుంది.
చెన్నై తర్వాత
దేశంలోని తూర్పుతీరంలో చెన్నై తర్వాత సీ-కేబుల్స్ ఏర్పాటుకానున్నది విశాఖలోనే కావడం గమనార్హం. ప్రస్తుత ప్రభుత్వం పెద్ద ఎత్తున స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానం అమలుచేస్తుండంతో గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటుకు అడుగులు పడ్డాయని పలువురు ఐటీ నిపుణులు చెబుతున్నారు. సముద్ర కేబుళ్ల వ్యవస్థ ఏర్పాటు ద్వారా విశాఖకు వివిధ దేశాలతో నేరుగా అనుసంధానం ఏర్పడనుంది. ఈ సెంటర్ ద్వారా ఏఐ క్లౌడ్ ఇన్‌ఫ్రా అందుబాటులోనికి రానున్నది.
పోర్టు సిటీ నుంచి డేటా సిటీగా..
ఓడరేవు నగరం విశాఖ అంతర్జాతీయంగా ఎంతో పేరు సంపాదించింది. ఇప్పుడు గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటుతో విశాఖ పేరు డేటా సిటీగా మారుతుందని పలువురు చమత్కరిస్తున్నారు. సముద్రతీరంలో ఉండడంతో సీకేబుల్స్ ల్యాండింగ్ స్టేషన్ ఏర్పాటుకు విశాఖ అనుకూలం. రాష్ట్ట్రవ్యాప్తంగా 6.5 గిగావాట్ల సామర్థ్యంతో మల్టీ గిగావాట్ డిజిటల్ హబ్‌ను నిర్మించాలన్నదే ప్రభుత్వ లక్ష్యం. ఇదే సమయంలో డేటా సెంటర్ ఏర్పాటుతో రాష్ట్రంలో అనుబంధ రంగాల నుంచి పెట్టుబడులు వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. పవర్ సిస్టమ్స్, కూలింగ్ టెక్నాలజీ, సర్వర్ల తయారీ, నెట్ వర్కింగ్ వంటి రంగాల్లో స్థానికంగా ఉత్పత్తి యూనిట్లతో ఏఐ ఏకో సిస్టమ్ ఏర్పాటుకానుంది. డేటా సెంటర్ల ద్వారా వచ్చే ఆదాయం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తుందని భావిస్తున్నారు.
క్వాంటం కేంద్రంగా అమరావతి
ఉమ్మడి ఏపీలో గడచిన 25 ఏళ్లుగా హైదరాబాద్ సాఫ్ట్‌వేర్ రంగానికి ప్రాధాన్యం ఇచ్చింది. రాష్ట్ర విభజన తర్వాత మరో పదేళ్లు కూడా హైదరాబాద్ సాఫ్ట్‌వేర్ రంగం వైపే దృష్టి సారించింది. హార్డ్‌వేర్‌లో అత్యంత కీలకమైన సెమీ కండక్టర్ రంగంలో గ్లోబల్ లీడర్ కావడంపై ఏపీ దృష్టి సారించింది. కంప్యూటర్లు, సెల్‌ఫోన్ల తయారీతో సహా ఇతర సాంకేతిక అంశాల్లో సెమీ కండక్లర్లు, చిప్స్ కీలక భూమిక పోషిస్తున్నాయి. ఇప్పుడు.. క్వాంటం రాకతో ఏపీ హార్డ్‌వేర్ రంగంలో గ్లోబల్ హెడ్‌గా మారేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. రెండు క్వాంటం టెస్టింగ్ బెడ్స్‌ను ప్రయోగాత్మంగా స్థాపించిన నేపథ్యంలో.. అమరావతి క్వాంటం హబ్‌ను హార్డ్‌వేర్‌కు కేంద్రంగా మార్చాలని ప్రభుత్వం యోచిస్తోంది.
మైలురాయిగా నిలుస్తుంది: సీఎం
భారత కృత్రిమ మేథ(ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్-ఏఐ) భవిష్యత్తు కేంద్రంగా విశాఖపట్నం నిలుస్తుందని సీఎం చంద్రబాబు తెలిపారు. మంగళవారం విశాఖలో గూగుల్ డేటా సెంటర్‌కు శంకుస్థాపన చేయనున్న నేపథ్యంలో సీఎం ఆదివారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఈ డేటా సెంటర్ దేశానికి భవిష్యత్తుగా మారుతుందని, ఒక మైలురాయిగా నిలుస్తుందని పేర్కొన్నారు. ఒక గిగావాట్ ఏఐ గూగుల్ సెంటర్ ప్రపంచ స్థాయిలో వైజాగ్‌ను ముందువరుసలో నిలుపుతుందని తెలిపారు. గూగుల్ క్లౌడ్, అదానీ కనెక్స్ వంటి వ్యాపార దిగ్గజ సంస్థల రాకతో వైజాగ్ శక్తిమంతమైన కేంద్రంగా మారుతుందని పేర్కొన్నారు. మంత్రి లోకేశ్ స్పం దిస్తూ.. గూగుల్ ఏఐ డేటా సెంటర్ దేశానికి గర్వకారణమని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఉద్యోగ కల్పనకు కీలక భూమిక పోషిస్తుందని తెలిపారు.