గూగుల్ డేటా సెంటర్‌పై ముందడుగు
ABN , Publish Date - Apr 11 , 2026 | 03:35 AM
ఉమ్మడి విశాఖ జిల్లాలో గూగుల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) డేటా సెంటర్లనిర్మాణ పనులు పట్టాలెక్కుతున్నాయి. విశాఖపట్నం సమీపాన ఆనందపురం మండలం తర్లువాడలో ‘వైజాగ్ మెగా డేటా పార్క్’ నిర్మాణానికి ఈ నెల 28న శంకుస్థాపన జరగనుంది. దీనికి అవసరమైన పర్యావరణ అనుమతుల కోసం ....
నిర్మాణానికి పర్యావరణ అనుమతులు కోరుతూ దరఖాస్తు
ఆమోదం లభించగానే రాంబిల్లి సెంటర్‌కు శంకుస్థాపన
విశాఖపట్నం, ఏప్రిల్ 10 (ఆంధ్రజ్యోతి): ఉమ్మడి విశాఖ జిల్లాలో గూగుల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) డేటా సెంటర్లనిర్మాణ పనులు పట్టాలెక్కుతున్నాయి. విశాఖపట్నం సమీపాన ఆనందపురం మండలం తర్లువాడలో ‘వైజాగ్ మెగా డేటా పార్క్’ నిర్మాణానికి ఈ నెల 28న శంకుస్థాపన జరగనుంది. దీనికి అవసరమైన పర్యావరణ అనుమతుల కోసం ఇప్పటికే ఆ సంస్థ రాష్ట్ర ప్రభుత్వానికి దరఖాస్తు చేసింది. ఉమ్మడి విశాఖలోని మూడు ప్రాంతాల్లో గూగుల్ సంస్థ డేటా సెంటర్లను ఏర్పాటు చేయనుంది. వీటికోసం రాష్ట్ర ప్రభుత్వం 601.4 ఎకరాలు కేటాయించిన సంగతి తెలిసిందే. తర్లువాడలో 266.60 ఎకరాలు, ముడసర్లోవ (అడవివరం)లో 160 ఎకరాలు, అనకాపల్లి జిల్లా రాంబిల్లిలో 174.8 ఎకరాలు ఇచ్చింది. గూగుల్ ఇక్కడి వ్యవహారాల కోసం రైడెన్ ఇన్‌ఫోటెక్ ఇండియా లిమిటెడ్ పేరుతో ఒక సంస్థను ఏర్పాటు చేసింది. అదానీ ఇన్‌ఫ్రాను నిర్మాణ భాగస్వామిగా చేర్చుకొని వాటి బాధ్యతలు అప్పగించింది. ఆ తర్వాత మూడు స్పెషల్ పర్పస్ వెహికల్స్ (ఎస్‌పీవీ)ను ఏర్పాటు చేసింది. అందులో మొదటిది ‘వైజాగ్ మెగా డేటా సెంటర్’. ఇది తర్లువాడలో వస్తుంది. రెండోది ‘వైజాగ్ రాంబిల్లి డేటా సెంటర్’. దీన్ని రాంబిల్లిలో నిర్మిస్తారు. దీనికి అవసరమైన పర్యావరణ అనుమతుల కోసం తాజాగా భవన నిర్మాణ ప్లాన్‌ను ప్రభుత్వానికి సమర్పించారు. రాంబిల్లిలోని ఏపీఐఐసీ ఇండస్ట్రియల్ పార్క్‌లో సర్వే నంబర్లు 37 నుంచి 61 వరకు కేటాయించిన 174.80 ఎకరాలకు ప్లాన్ రూపొందించారు. మొత్తం విస్తీర్ణంలో ప్లాటెడ్ ఏరియా 4,49,808 చదరపు మీటర్లు. అందులో 1,37,624 చ.మీ.లో భవనం, 56,888 చ.మీ.లలో గ్రీనరీ, 54,972 చ.మీ.లో రహదారులు, 6,400 చ.మీ.లో పార్కింగ్ ఏరియా (450 కార్లు, 300 బైక్‌లు/స్కూటర్లు), 3,123 చ.మీ.లో వర్షపు నీరు నిల్వకు చెరువు నిర్మాస్తామన్నారు. ఈ ప్లాన్‌కు ఆమోదం రాగానే ఈ డేటా సెంటర్‌కు కూడా శంకుస్థాపన చేసి నిర్మాణ పనులు ప్రారంభిస్తారని ఏపీఐఐసీ వర్గాలు తెలిపాయి.