Share News

స్వచ్ఛతకు మంగళం!

ABN , Publish Date - Mar 27 , 2026 | 12:53 AM

పరిసరాల పరిశుభ్రతపై అవగాహన కల్పించటం, కాలుష్య కాసారాలుగా మారిపోతున్న గ్రామాల్లో ఆరోగ్యకరమైన పరిస్థితులు తిరిగి తీసుకురావటం, వృథాగా పోతున్న వ్యర్థాల నుంచి సంపద సృష్టించటం లక్ష్యంగా స్వచ్ఛ కృష్ణా కార్యక్రమానికి కలెక్టర్‌ బాలాజీ రూపకల్పన చేశారు. ప్రతీ గ్రామంలో స్వచ్ఛత కార్యక్రమాలను నిర్వహించేలా గ్రామం పేరుతో స్వచ్ఛ గ్రామ బోర్డును ఏర్పాటు చేయించారు. మండలానికి ఒక స్వచ్ఛ రథాన్ని సమకూర్చి గ్రామాల్లో పునర్వినియోగానికి వీలుండే వ్యర్థాలను సేకరించాలని సంకల్పించారు. బోర్డులను ఏర్పాటు చేయటం, మండలాలకు స్వచ్ఛ రథాలను పంపించటం వరకు కార్యక్రమం సజావుగా సాగింది గాని అతి ముఖ్యమైన ప్రజల్లో అవగాహన కల్పించే కార్యక్రమాలను అధికారులు విస్మరించారు. దీంతో స్వచ్ఛత కార్యక్రమాలు బోర్డులకే పరిమితం అయ్యాయి.

స్వచ్ఛతకు మంగళం!

- జిల్లాలో నిలిచిపోయిన సంపద సృష్టి కేంద్రాలు

- రోడ్ల వెంబడి పెరిగిపోతున్న చెత్త కుప్పలు

- కాలుష్య కాసారాలుగా డంపింగ్‌ యార్డులు

- బోర్డులకే పరిమితమవుతున్న స్వచ్ఛతా స్ఫూర్తి

పరిసరాల పరిశుభ్రతపై అవగాహన కల్పించటం, కాలుష్య కాసారాలుగా మారిపోతున్న గ్రామాల్లో ఆరోగ్యకరమైన పరిస్థితులు తిరిగి తీసుకురావటం, వృథాగా పోతున్న వ్యర్థాల నుంచి సంపద సృష్టించటం లక్ష్యంగా స్వచ్ఛ కృష్ణా కార్యక్రమానికి కలెక్టర్‌ బాలాజీ రూపకల్పన చేశారు. ప్రతీ గ్రామంలో స్వచ్ఛత కార్యక్రమాలను నిర్వహించేలా గ్రామం పేరుతో స్వచ్ఛ గ్రామ బోర్డును ఏర్పాటు చేయించారు. మండలానికి ఒక స్వచ్ఛ రథాన్ని సమకూర్చి గ్రామాల్లో పునర్వినియోగానికి వీలుండే వ్యర్థాలను సేకరించాలని సంకల్పించారు. బోర్డులను ఏర్పాటు చేయటం, మండలాలకు స్వచ్ఛ రథాలను పంపించటం వరకు కార్యక్రమం సజావుగా సాగింది గాని అతి ముఖ్యమైన ప్రజల్లో అవగాహన కల్పించే కార్యక్రమాలను అధికారులు విస్మరించారు. దీంతో స్వచ్ఛత కార్యక్రమాలు బోర్డులకే పరిమితం అయ్యాయి.

ఆంధ్రజ్యోతి-అవనిగడ్డ:

పరిశుభ్ర గ్రామాలే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం చేపట్టిన స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమం అమలు జిల్లాలో అటకెక్కింది. గ్రామాల్లో తడి, పొడి చెత్తను సేకరించేందుకు స్వచ్ఛ కృష్ణా కార్యక్రమంలో తగిన ఏర్పాట్లు చేసినప్పటికీ వేర్వేరుగా సేకరించే ఆ వ్యర్థాలన్నింటిని తిరిగి ఒక చోట చేర్చి గ్రామాల్లో డంపింగ్‌ యార్డులకు తరలిస్తుండటంతో కార్యక్రమ ఉద్దేశ్యం పూర్తిగా మరుగున పడిపోతోంది. గతంలో వలే మేజర్‌ పంచాయతీల్లో సేకరించే టన్నుల కొద్ది చెత్తను గ్రామ వెలుపల ఉన్న డంపింగ్‌ యార్డులకు తరలించటం, అక్కడ చెత్త పెరిగిపోవటంతో దానికి నిప్పు పెట్టడంతో ప్లాస్టిక్‌ వ్యర్థాలు ఆ మంటల్లో కలిసి ప్రమాదకరమైన విషవాయువులను వెదజల్లుతూ ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. అవనిగడ్డ నియోజకవర్గంలోని మండల కేంద్రాలైన అవనిగడ్డ, నాగాయలంక, కోడూరు, మోపిదేవి, ఘంటసాల మండలాల్లో ఏ డంపింగ్‌ యార్డులో చూసినా ప్రతి నిత్యం రావణ కాష్టంలా తగలబడుతున్న డంపింగ్‌ యార్డులు దర్శనమిస్తున్నాయి. రోజుల తరబడి పేరుకుపోయిన చెత్తను ప్రాసెస్‌ చేసి చెత్త నుంచి వ్యర్థాలను సేకరించే వ్యవస్థను రూపొందించకపోవడంతోనే నేడు గ్రామాల్లో డంపింగ్‌ యార్డులు ప్రమాదకరమైన విషవాయువులు వెదజల్లే కాలుష్య కాసారాలుగా మారిపోతున్నాయి. మచిలీపట్నంలో మాదిరి ఏళ్ల తరబడి పేరుకుపోయిన చెత్తను ప్రాసెస్‌ చేసి వ్యర్థాల నుంచి సంపదను సృష్టించే ఓ వ్యవస్థను రూపొందిస్తే గాని స్వచ్ఛ కృష్ణా జిల్లా కార్యక్రమానికి పరమార్థం చేకూరదని పలువురు అంటున్నారు.

నిరుపయోగంగా సంపద సృష్టి కే ంద్రాలు

జిల్లాలోని 497 పంచాయతీల్లోనూ 2014 నుంచి 2019 నడుమ జాతీయ ఉపాధి హామీ పథకం కింద సంపద సృష్టి కేంద్రాలను కోట్లాది రూపాయలు వెచ్చించి నిర్మించారు. ఇళ్ల నుంచి సేకరించే కూరగాయల వ్యర్థాలు, మిగిలిపోయిన ఆహారం తదితర తడి చెత్తను పంట పొలాలకు మేలు చేసే వర్మీ కంపోస్టు ఎరువుగా మార్చి గ్రామాల్లో అదనపు ఆదాయం సృష్టించాలన్నది సంపద కేంద్రాల లక్ష్యం. ప్రస్తుతం ఆ సంపద కేంద్రాలు పూర్తిగా లక్ష్యానికి దూరంగా జరిగాయి. రూ.కోట్లు వెచ్చించి ఏర్పాటు చేసిన యంత్రాలను అధికారులు గాలికొదిలేశారు. మైనర్‌ పంచాయతీల్లో ఆర్థిక ఇబ్బందుల కారణంగా సంపద కేంద్రాలు నిరుపయోగంగా ఉన్నాయి అంటే ఓ అర్థం ఉంటుంది. కాని రూ.50 లక్షల ఆదాయం ఉన్న పంచాయతీల్లో సంపద సృష్టి కేంద్రాలను గాలికొదిలేయటం చూస్తుంటే ప్రభుత్వ లక్ష్యం పట్ల అధికారులు ఏ మేరకు చిత్తశుద్ధితో పని చేస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. కృష్ణాజిల్లా అవనిగడ్డ, మోపిదేవి, ఘంటసాల, కోడూరు పంచాయతీల్లోని సంపద కేంద్రాల పరిస్థితి పరిశీలిస్తే అక్కడ కనీస మాత్రంగా కూడా వ్యర్థాల నుంచి సంపద సృష్టించటం లేదన్నది కళ్లకు కనపడుతుంది. వ్యర్థాలను చిన్న చిన్న ముక్కలుగా కత్తిరించేందుకు ఏర్పాటు చేసిన భారీ ఎలక్ర్టికల్‌ కట్టర్లను లక్షలాది రూపాయలు వెచ్చించి అన్ని ఫ్రధాన పంచాయతీలకు పంపించగా, నేడు ఆ కట్టర్లు తుప్పు పట్టి నిరుపయోగంగా మారాయి.

ప్రజల్లో రాని చైతన్యం

గ్రామాలను పరిశుభ్రంగా ఉంచాలనే లక్ష్యంతో ప్రధాని మోదీ 2014లో స్వచ్ఛ భారత కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. 2014 నుంచి 2019 వరకు జిల్లా వ్యాప్తంగా కొన్ని పంచాయతీలు స్వచ్ఛత కార్యక్రమాల్లో ముందుకు సాగి గ్రామాలను పరిశుభ్రంగా ఉంచుకు నేందుకు తమ వంతు ప్రయత్నాన్ని చేశాయి. అయితే అధికారులు మాత్రం నిబంధనల ప్రకారం అలాంటి గ్రామాలకు స్వచ్ఛత అవార్డులు ఇవ్వకుండా కేవలం కొన్ని పారా మీటర్లను కాగితాల్లో మాత్రమే అందిపుచ్చుకున్న పంచాయతీలకు స్వచ్ఛత అవార్డులు ఇవ్వడంతో గ్రామాల్లో అప్పుడప్పుడే వెల్లివిరిసిన స్వచ్ఛత స్ఫూర్తి మొగ్గలోనే రాలిపోయింది. గడిచిన సంవత్సర కాలంగా స్వచ్ఛత కార్యక్రమాలపై ప్రభుత్వం దృష్టి పెట్టినప్పటికీ అధికారులు ఆ దిశగా ఎలాంటి ప్రచారాన్ని నిర్వహించకపోవటం, అధికారిక కార్యక్రమాల్లోనే ప్లాస్టిక్‌, పర్యావరణ అనుకూలం కాని ఫ్లెక్సీలను పెద్ద ఎత్తున ఏర్పాటు చేస్తూ స్వచ్ఛత స్ఫూర్తికి వారే తూట్లు పొడుస్తున్నారు. దీంతో ఇప్పటికీ జిల్లా వ్యాప్తంగా ఏ గ్రామంలో చూసినా రోడ్డు పక్కనే తాగి పడేసిన కొబ్బరి బొండాలు, ప్లాస్టిక్‌ గ్లాసులు, వాడిపడేసిన వ్యర్థాలు పేరుకుపోయి బోర్డులకే పరిమితమైన స్వచ్ఛతా స్ఫూర్తి డొల్లతనాన్ని ఎత్తి చూపుతున్నాయి.

చల్లపల్లి కావాలి ఆదర్శం

ప్రధాని మోదీ స్వచ్ఛభారత ప్రకటన చేసిన వెంటనే ఆ కార్యక్రమ స్ఫూర్తిని అందిపుచ్చుకుని నిర్విరామంగా గ్రామంలో స్వచ్ఛత కార్యక్రమాలు నిర్వహిస్తూ చల్లపల్లి గ్రామస్థులు చూపిస్తున్న చొరవ ఇతర గ్రామాలకు ఆదర్శంగా నిలిచింది. జిల్లాలో వ్యర్థాల నుంచి సంపదను సృష్టించే వ్యవస్థ ఎక్కడైనా బలంగా పని చేస్తుంది అంటే అది కేవలం చల్లపల్లిలో మాత్రమే. ప్రజల్లో చైతన్యాన్ని పెంపొందించటం ద్వారా మాత్రమే స్వచ్ఛత కార్యక్రమాలు విజయవంతం అవుతాయి అనడానికి ఈ గ్రామమే నిదర్శనం.

Updated Date - Mar 27 , 2026 | 12:53 AM