Share News

Golimi Ramakrishna: ఉద్యోగుల ఆకాంక్షలకు అనుగుణంగా...

ABN , Publish Date - Jan 02 , 2026 | 05:53 AM

సచివాలయ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని ఆంధ్రప్రదేశ్‌ సచివాలయ సంఘం (అప్సా) అధ్యక్షుడు గొలిమి రామకృష్ణ అన్నారు.

Golimi Ramakrishna: ఉద్యోగుల ఆకాంక్షలకు అనుగుణంగా...

  • త్వరితగతిన సమస్యల పరిష్కారానికి కృషి

  • ‘అప్సా’ నూతన అధ్యక్షుడిగా రామకృష్ణ బాధ్యతలు

అమరావతి, జనవరి 1(ఆంధ్రజ్యోతి): సచివాలయ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని ఆంధ్రప్రదేశ్‌ సచివాలయ సంఘం (అప్సా) అధ్యక్షుడు గొలిమి రామకృష్ణ అన్నారు. గురువారం ఆయన అమరావతి సచివాలయంలో అప్సా నూతన అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు. ఆయనతో పాటు నూతనంగా ఎన్నికైన అప్సా కార్యవర్గ సభ్యులందరూ బాధ్యతలు స్వీకరించారు. అనంతరం రామకృష్ణ మీడియాతో మాట్లాడారు. ఉద్యోగులు అధిక మెజార్టీతో తనను గెలిపించి మరింత బాధ్యత పెంచారన్నారు. సచివాలయ ఉద్యోగుల ఆశయాలు, ఆకాంక్షలకు అనుగుణంగా అప్సా పని చేస్తుందని పేర్కొన్నారు. సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌, మంత్రి లోకేశ్‌ రాష్ట్రం కోసం ఎంతో కష్టపడుతున్నారని, వారికి చేదోడువాదోడుగా ఉంటామన్నారు. ఉద్యోగుల హక్కులను కాపాడుకోవడంతో పాటు ఉద్యోగులకు, ప్రభుత్వానికి మధ్య సంబంధం పాత రోజుల్లో ఉన్న విధంగా పునరుద్ధరిస్తామని పేర్కొన్నారు. ఎన్నికల వరకే పోటీ ఉంటుందని, తర్వాత అందరం ఉద్యోగుల కోసం కలిసి పనిచేస్తామని తెలిపారు. ఉద్యోగులందరూ కలసి పని చేయడానికి ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఉద్యోగుల సలహాలు, సూచనలు తీసుకొని.. సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామన్నారు. రాష్ట్రంలో ఉద్యోగుల ఫ్రెండ్లీ ప్రభుత్వం ఉందని, ఉద్యోగుల సమస్యలను పరిష్కరించడంలో సీఎం చంద్రబాబు ముందుంటారన్నారు. గురువారం సీపీఎస్‌ ఉద్యోగులకు గత ఐదేళ్లుగా పెండింగ్‌ పెట్టిన డీఏ బకాయిలను ప్రభుత్వం చెల్లించడంపై రామకృష్ణ సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు. అపరిషృత సమస్యలను సీఎం ఒక్కొక్కటిగా పరిష్కరిస్తారన్న నమ్మకం తమకు ఉందన్నారు.

అప్సా నూతన కార్యవర్గం ఇదే..: సచివాలయ సంఘం అధ్యక్షుడిగా జి.రామకృష్ణ, ఉపాధ్యక్షుడిగా పవన్‌ కుమార్‌, ప్రధాన కార్యదర్శిగా నాపా ప్రసాద్‌, ఉపాధ్యక్షురాలిగా లక్ష్మణకుమారి, సంయుక్త కార్యదర్శిగా (ఆర్గనైజింగ్‌) కేవీ రాజేంద్ర ప్రకాశ్‌, పి.సునీత (సంయుక్త మహిళా కార్యదర్శి), సంయుక్త కార్యదర్శి (స్పోర్ట్స్‌)గా మధుబాబు, ట్రెజరర్‌గా భాగ్యలక్ష్మి, అదనపు కార్యదర్శిగా లింగారెడ్డి బాధ్యతలు స్వీకరించారు.

Updated Date - Jan 02 , 2026 | 05:54 AM