Share News

ఆంధ్ర కశ్మీర్‌ లంబసింగిలో గోల్డెన్‌ బెర్రీ

ABN , Publish Date - Mar 05 , 2026 | 04:02 AM

మధ్యప్రదేశ్‌, మహారాష్ట్ర సహా చల్లని వాతావరణం ఉండే కొండ ప్రాంతాల్లో కనిపించే గోల్డెన్‌ బెర్రీ (రాస్‌భేరి) పంట.. అల్లూరి జిల్లా ఏజెన్సీలోనూ సాగవుతోంది. ఏజెన్సీలోని చింతపల్లి మండలం లంబసింగి ప్రాంతంలో గోల్డెన్‌ బెర్రీ......

ఆంధ్ర కశ్మీర్‌ లంబసింగిలో గోల్డెన్‌ బెర్రీ

  • ప్రయోగాత్మక సాగు.. విజయవంతం

  • ఆశాజనకంగా దిగుబడులు

  • పండ్లలో పోషక విలువలు మెండు

(ఆంధ్రజ్యోతి-చింతపల్లి)

మధ్యప్రదేశ్‌, మహారాష్ట్ర సహా చల్లని వాతావరణం ఉండే కొండ ప్రాంతాల్లో కనిపించే గోల్డెన్‌ బెర్రీ (రాస్‌భేరి) పంట.. అల్లూరి జిల్లా ఏజెన్సీలోనూ సాగవుతోంది. ఏజెన్సీలోని చింతపల్లి మండలం లంబసింగి ప్రాంతంలో గోల్డెన్‌ బెర్రీ పంటను ఓ అభ్యుదయ రైతు సాగుచేస్తున్నారు. అత్యంత శీతల ప్రాంతమైన లంబసింగి పరిసర ప్రాంతాల్లో రైతులు ఇప్పటికే అరుదైన స్ట్రాబెర్రీ, డ్రాగన్‌ ఫ్రూట్‌, ఆవకాడో వంటివి పండిస్తున్నారు. తాజాగా ఈ జాబితాలోకి గోల్డెన్‌ బెర్రీ చేరింది. పశ్చిమ గోదావరి జిల్లా తణుకు మండలం ఖండవిల్లి గ్రామానికి చెందిన సాగిరాజు ఉదయభాస్కరరాజు లంబసింగి సమీపంలోని రాజుపాకలు గ్రామంలో పది ఎకరాలు లీజుకు తీసుకుని ఆరేళ్లుగా స్ట్రాబెర్రీ సాగు చేస్తున్నారు. 2022లో ప్రయోగాత్మకంగా మహారాష్ట్రలోని మహాబలేశ్వర్‌ నుంచి కొన్ని గోల్డెన్‌ బెర్రీ మొక్కలను తెచ్చి నాటారు. మంచి దిగుబడులు వచ్చినప్పటికీ మార్కెట్‌ సదుపాయం లేకపోవడంతో.. మరుసటి ఏడాది సాగు నిలిపివేశారు. ఈ ఏడాది మళ్లీ 25 సెంట్లలో గోల్డెన్‌ బెర్రీ సాగు చేశారు. దిగుబడులు ఆశాజనకంగా ఉన్నట్టు రైతు తెలిపారు. ఒక్కో మొక్క నుంచి 500 నుంచి 750 గ్రాముల దిగుబడి వస్తోందన్నారు. ఈ సీజన్‌లో లంబసింగి వచ్చిన పర్యాటకులు స్ట్రాబెర్రీలతోపాటు గోల్డెన్‌ బెర్రీలను కొనుగోలు చేసినట్టు చెప్పారు. 200 గ్రాముల గోల్డెన్‌ బెర్రీలను రూ.80కు విక్రయిస్తున్నామన్నారు.

4.jpg

రోగనిరోధక శక్తిని పెంచుతుంది

గోల్డెన్‌ బెర్రీ రోగ నిరోధక శక్తిని పెంపొందిస్తుంది. ఈ పండ్లు చూడడానికి నారింజ రంగులో పెద్ద ద్రాక్ష పండ్ల పరిమాణంలో గుండ్రంగా ఉంటాయి. ఈ పండ్లలో విటమిన్‌ ఏ, సీ, యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. మధుమేహాన్ని నియంత్రిస్తుంది. దృష్టి లోపాన్ని మెరుగు పరుస్తుంది. ఆయుర్వేద వైద్యంలోనూ ఈ పండ్లకు ప్రత్యేక స్థానం ఉంది.

- సింగంపల్లి మీనాక్షి, గృహ విజ్ఞాన శాస్త్రవేత్త, బీసీటీ-కేవీకే, హరిపురం

Updated Date - Mar 05 , 2026 | 04:02 AM