Share News

సేవ ముసుగులో చేతివాటం

ABN , Publish Date - Mar 12 , 2026 | 03:35 AM

ఏలూరు జిల్లా ద్వారకాతిరుమల వేంకటేశ్వర స్వామి (చిన వెంకన్న) ఆలయంలో సేవ పేరిట హుండీల లెక్కింపునకు వచ్చి చేతివాటం ప్రదర్శించాడో ప్రబుద్ధుడు.

సేవ ముసుగులో చేతివాటం

  • వెంకన్న హుండీలో 59.700గ్రా. బంగారు ఆభరణాల తస్కరణ

  • 4 డాలర్‌ నోట్లు కూడా.. ఫ్లష్‌ ట్యాంక్‌లో దాచిన ప్రబుద్ధుడు

  • పోలీసుల అదుపులో నిందితుడు.. ‘ద్వారకా తిరుమల’లో ఘటన

ద్వారకాతిరుమల, మార్చి 11(ఆంధ్రజ్యోతి): ఏలూరు జిల్లా ద్వారకాతిరుమల వేంకటేశ్వర స్వామి (చిన వెంకన్న) ఆలయంలో సేవ పేరిట హుండీల లెక్కింపునకు వచ్చి చేతివాటం ప్రదర్శించాడో ప్రబుద్ధుడు. స్వామికి హుండీల్లో భక్తులు సమర్పించిన 59.700 గ్రాముల బంగారు ఆభరణాలను, నాలుగు డాలర్‌ నోట్లను తస్కరించాడు. మరో భక్తుడు గమనించి అతడి గుట్టును రట్టు చేశాడు. వివరాలివీ.. ఆలయ ప్రమోద కల్యాణ మండప ఆవరణలో బుధవారం హుండీల లెక్కింపు చేపట్టారు. ఇందులో పశ్చిమ గోదావరి జిల్లా ఇరగవరం మండలం సూరంపూడికి చెందిన బొల్లా సురేశ్‌ పాల్గొన్నాడు. ఆటో నడుపుతూ జీవించే ఇతడు.. ఐదేళ్లుగా శ్రీవారి సేవ పేరుతో ద్వారకాతిరుమల ఆలయానికి వచ్చి హుండీల లెక్కింపులో పాల్గొంటున్నాడు. ఈ క్రమంలో బుధవారం జరిగిన లెక్కింపులోనూ బంగారం, నాణేలు, నోట్లు జల్లెడ పట్టే చోట పాల్గొన్నాడు. అయితే, కొంత బంగారాన్ని, కొన్ని నోట్లను లోదుస్తుల్లో దాచేసి, వాష్‌రూమ్‌కు వెళుతుండడాన్ని కోనసీమ జిల్లా అంబాజీపేట మండలం ముసుపల్లికు చెందిన మరో సేవకుడు పెమ్మ వెంకటేశ్వరరావు గమనించాడు. సురేశ్‌ను సెక్యూరిటీ సిబ్బంది అరకొరగా తనిఖీ చేసి పంపించి వేయడాన్ని దూరం నుంచి చూసిన అక్కడున్న అధికారులకు చెప్పాడు. వెంటనే అధికారులు సెక్యూరిటీని అప్రమత్తం చేసి వాష్‌రూమ్‌ను తనిఖీ చేయగా ఫ్లష్‌ ట్యాంక్‌లో బంగారం, డాలర్‌ నోట్లు కనిపించాయి. దీంతో సురేశ్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఆలయ ఈవో భద్రాజీ ఫిర్యాదు మేరకు భీమడోలు సీఐ పి. కృష్ణ ఘటనా స్థలానికి వచ్చి సీసీ ఫుటేజ్‌ను పరిశీలించి సురేశ్‌ చోరీకి పాల్పడినట్టు గుర్తించారు. బంగారం, డాలర్లను స్వాధీనం చేసుకుని సురేశ్‌పై కేసు నమోదు చేసి స్టేషన్‌కు తరలించారు. కాగా, ఇది పూర్తిగా భద్రతా వైఫల్యమేనని స్థానికులు, భక్తులు విమర్శిస్తున్నారు. మరోవైపు, సురేశ్‌ను అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా వాడపల్లి వేంకటేశ్వరస్వామి ఆలయంలో హుండీల లెక్కింపు సమయంలోనూ అనుమానించానని, ఇప్పుడు ఇక్కడ అది నిజమైందని సేవకుడు పెమ్మ వెంకటేశ్వరరావు చెబుతున్నారు. ఈ ఘటన నేపథ్యంలో సురేశ్‌ గతంలో ఇటువంటి పనులకు పాల్పడ్డాడా లేదా అన్నది విచారణలో తేలాల్సి ఉంది.

Updated Date - Mar 12 , 2026 | 03:35 AM