దేవరకు వెళ్లి వస్తూ.. అనంతలోకాలకు
ABN , Publish Date - Jan 07 , 2026 | 11:20 PM
బంధువుల గ్రామంలో దేవర ఉండగా వెళ్లి తిరిగి వస్తున్న సమయంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తల్లీకుమారుడు దుర్మరణం చెందారు.
బైక్‌ను ఢీకొట్టిన ఆటో
తల్లీకుమారుడి దుర్మరణం
కౌతాళం, జనవరి 7(ఆంధ్రజ్యోతి): బంధువుల గ్రామంలో దేవర ఉండగా వెళ్లి తిరిగి వస్తున్న సమయంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తల్లీకుమారుడు దుర్మరణం చెందారు. ఈ ఘటన మండలంలోని ఎరిగేరి మజరా గ్రామం లక్ష్మినగర్ క్యాంపు వద్ద బుధవారం సాయంత్రం చోటుచేసుకున్నట్లు సీఐ అశోక్‌కుమార్ తెలిపారు. వివరాలు.. మండల కేంద్రమైన కౌతాళంలోని మాసగేరికి చెందిన మహదేవి(48), నాగిరెడ్డి(28) తల్లీకొడుకులు. ఇద్దరు మండలంలోని ఎరిగేరిలో జరిగిన బంగారమ్మవ్వ దేవర కోసం తమ బంధువుల ఇంటికెళ్లారు. దేవర ముగిశాక భోజనం చేసుకొని స్వగ్రామం కౌతాళంకు తిరుగు ప్రయాణంలో నాగిరెడ్డి తన బైక్‌లో తల్లి మహదేవి పెద్ద కుమారుడు అభిరామ్‌నుతో కలిసి వస్తున్నాడు. కౌతాళం నుంచి ఎరిగేరికి ఆటో ఎదురుగా వచ్చి బైక్‌ను ఢీకొట్టింది. ఈప్రమాదంలో తల్లీకొడుకులు మృతిచెందారు. అభిరామ్ గాలిలో ఎగిరి పక్కన ఉన్న వరి పొలంలో పడిపోయాడు. బాలుడికి ఎలాంటి గాయాలు కాలేదు. అటుగా వస్తున్న ప్రజలు ప్రమాదంను గుర్తించి ఆటో నడుపుతున్న డ్రైవర్ మద్యం మత్తులో ఉండటంతో అతన్ని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. ప్రమాద ఘటనను తెలుసుకున్న సీఐ అశోక్ కు మార్ తమ సిబ్బందితో కలిసి ఘటనాస్థలికి చేరుకున్నారు. మృతుడు నాగిరెడ్డికి అభిరామ్, తారక్ అను ఇద్దరు కుమారులు, మమతా ఒక కుమార్తె సంతానం ఉంది. మృతదేహలను పోస్టుమార్టం కోసం ఆదోని ఏరియా ఆస్పత్రికి తరలించారు. మృతుడి భార్య శాంతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు.