Share News

‘గోదావరి-కావేరి’కి ఎంత ఖర్చైనా సిద్ధమే

ABN , Publish Date - Jun 06 , 2026 | 05:05 AM

హిమాలయన్‌-మహానది-గోదావరి-పెన్నా నదుల అనుసంధాన ప్రక్రియలో భాగంగా గోదావరి-కావేరి అనుసంధానానికి ఎంత ఖర్చుకైనా సిద్ధమేనని ఆంధ్రప్రదేశ్‌కు...

‘గోదావరి-కావేరి’కి ఎంత ఖర్చైనా సిద్ధమే

  • రాష్ట్రానికి ఎన్‌డబ్ల్యుడీఏ స్పష్టీకరణ

అమరావతి, జూన్‌ 5(ఆంధ్రజ్యోతి): హిమాలయన్‌-మహానది-గోదావరి-పెన్నా నదుల అనుసంధాన ప్రక్రియలో భాగంగా గోదావరి-కావేరి అనుసంధానానికి ఎంత ఖర్చుకైనా సిద్ధమేనని ఆంధ్రప్రదేశ్‌కు నేషనల్‌ వాటర్‌ డెవల్‌పమెంట్‌ అథారిటీ(ఎన్‌డబ్ల్యూడీఏ) స్పష్టం చేసింది. మార్గమధ్యంలో ఎన్ని కిలోమీటర్ల పొడవైనా టన్నెళ్లు తవ్వేందుకు సిద్ధంగా ఉన్నామని వెల్లడించింది. తాము రూపొందించిన అలైన్‌మెంట్లకు అభ్యంతరం తెలిపినందున పది రోజుల్లో కొత్త డిజైన్లతో కూడిన అలైన్‌మెంట్లను సమర్పించాలని ఆదేశించింది. ఏపీ రూపొందించే అలైన్‌మెంట్‌ మేరకే గోదావరి-కావేరి అనుసంధానాన్ని అమలు చేస్తామని స్పష్టం చేసింది. హిమాలయన్‌-మహానది-గోదావరి-పెన్నా నదుల అనుసంధాన పథకంలో భాగంగా మహానది-గోదావరి అనుసంధాన ప్రక్రియ కోసం ఎన్‌డబ్ల్యూడీఏ ప్రతిపాదించిన అలైన్‌మెంట్‌తో రాష్ట్రానికి నష్టమని ఏపీ తేల్చిచెప్పింది. శుక్రవారం హైదరాబాద్‌లో మహానది-గోదావరి నదుల అనుసంధాన అలైన్‌మెంట్లపై రాష్ట్ర అభిప్రాయాలను సేకరించేందుకు ఎన్‌డబ్ల్యూడీఏ డైరెక్టర్‌ దేవేందర్‌రావు అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ సమావేశానికి అంతర్రాష్ట్ర జలవిభాగం చీఫ్‌ ఇంజనీర్‌ సుగుణాకరరావు, ఎస్‌ఈ గిరిధర్‌, ఈఈ రాజగోపాల్‌ హాజరయ్యారు. మహానది-గోదావరి అనుసంధానంలో రాష్ట్రానికి ఎలాంటి ప్రయోజనం చేకూర్చని విధంగా నదీ పరివాహక ప్రాంతం నుంచి జలాలు తరలించేలా ఎన్‌డబ్ల్యూడీఏ.. అలైన్‌మెంట్‌ను రూపొందించడంపై ఏపీ అసంతృప్తి వ్యక్తంచేసింది. దీనిని అమలుచేస్తే ఎకరా రూ.కోటి చొప్పున భూమి కొనుగోలుకు రూ.వేల కోట్లు వ్యయం చేయాల్సి ఉంటుందని స్పష్టంచేసింది. అయినా ఆయకట్టు తక్కువగానే ఉంటుందని తెలిపింది. గొట్టా బ్యారేజీకి దిగువ నుంచి మహానది జలాలు తరలించేలా డిజైన్‌ చేయడం వల్ల రాష్ట్రానికి ఏ ప్రయోజనమూ ఉండదని స్పష్టం చేసింది. మహానది జలాలను గొట్టా బ్యారేజీ ద్వారా వంశధారలోకి ఎత్తిపోయడం వల్ల భూసేకరణ చేపట్టకుండానే గోదావరి జలాలతో కలుపవచ్చని పేర్కొంది. గొట్టాబ్యారేజీ, హిరమండలం బ్యారేజీలతో మహానది జలాలను అనుసంధానం చేయడం వల్ల ఆయకట్టుకు నీరందుతుందని పేర్కొంది. మహేంద్రతనయ నుంచి పోలవరం దాకా మహానది జలాలను తరలించడం వల్ల నదుల అనుసంధాన ప్రక్రియను సమర్థవంతంగా చేపట్టినట్లు అవుతుందని వివరించింది. గొట్టా బ్యారేజీ ఎత్తిపోతల పథకం, మహేంద్రతనయ, హిరమండలం రిజర్వాయర్లను ప్రధాన కేంద్రంగా చేసుకుని మడ్డువలస రిజర్వాయర్‌, తారకరామతీర్థసాగరం, యేలేశ్వరం రిజర్వాయర్లలో ముందుగా మహానది జలాలను ఎత్తిపోయాలని ఏపీ సూచించింది. ఆ తర్వాత పోలవరం వద్ద గోదావరి జలాల్లోకి మహానది జలాలను తరలించాలని స్పష్టం చేసింది. దీనివల్ల మహానది-గోదావరి అనుసంధానం ప్రస్తుత ప్రవాహ విధానాన్ని విధ్వంసం చేయకుండా సాఫీగా పథకం పూర్తి చేసేందుకు వీలు కలుగుతుందని వివరించింది. ఏపీ చేసిన సూచనలతో ఎన్‌డబ్ల్యూడీఏ డైరెక్టర్‌ దేవేందర్‌రావు ఏకీభవించారు. పది రోజుల్లోగా డిజైన్లు సమర్పించాలని సూచించారు.

Updated Date - Jun 06 , 2026 | 05:05 AM