పెరుగుతున్న గోదావరి నీటిమట్టం
ABN , Publish Date - Jul 08 , 2026 | 05:33 AM
ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న వర్షాలకు గోదావరి నీటిమట్టం క్రమక్రమంగా పెరుగుతూ వస్తోంది. మహారాష్ట్ర, ఒడిసా, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో కురిసిన వర్షాలకు..
పోలవరం స్పిల్ వే 48 గేట్ల నుంచి నీరు విడుదల
పోలవరం/ధవళేశ్వరం, జూలై 7 (ఆంధ్రజ్యోతి): ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న వర్షాలకు గోదావరి నీటిమట్టం క్రమక్రమంగా పెరుగుతూ వస్తోంది. మహారాష్ట్ర, ఒడిసా, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో కురిసిన వర్షాలకు ఉపనదులు మంజీర, ప్రవర, ప్రాణహిత జలాలు గోదావరిలో కలుస్తుండడంతో మంగళవారం నాటికి నీటిమట్టం పెరిగింది. లక్ష క్యూసెక్కుల నీరు ప్రవహిస్తోంది. దీంతో జలవనరుల శాఖ అధికారులు స్పిల్‌వేలో 48 గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. స్పిల్‌వే నుంచి వేగంగా ప్రవహిస్తున్న వరద తాకిడికి స్పిల్ చానల్ మధ్య 902 హిల్ నుంచి మహానందీశ్వరస్వామి ఆలయం వరకూ మటి,్ట రాతిని తరలించే వాహనాల రాకపోకల కోసం నిర్మించిన కాజ్‌వేకు గండిపడింది. ధవళేశ్వరం వద్ద సోమవారం ఉదయం 8.20 అడుగులుగా ఉన్న నీటిమట్టం సాయంత్రానికి 9.65 అడుగులకు చేరుకుంది. నీటిమట్టం 10.90 అడుగులకు చేరే వరకు వచ్చిన నీటిని నిల్వ చేస్తారు. ఆపై కాటన్ బ్యారేజ్ గేట్ల పైనుంచి దిగువకు ప్రవహించి సముద్రంలో కలిసిపోతుంది.