కంపుకొడుతు‘న్నది’
ABN , Publish Date - Jul 07 , 2026 | 04:59 AM
రాజమహేంద్రవరంలో గోదావరి నీటి కలుషితం ఆగట్లేదు. రాష్ట్ర జీవనాడికి కాలుష్యం కాటు తప్పటంలేదు. నీటిని కలుషితం చేయడంలో పేపర్ మిల్లు, నల్లా చానెల్‌దే ప్రధాన పాత్రం...
రాత్రి వేళల్లో గోదారిలోకి నేరుగా మురుగు
గుట్టుచప్పుడు కాకుండా నల్లా చానెల్, పేపర్ మిల్లు నుంచి వదిలేస్తున్న వైనం
కాలుష్యంతో రాజమండ్రి ఘాట్లలో దుర్వాసన
స్నానానికి పనికిరాకుండా నీరు
డిప్యూటీ సీఎం చెప్పినా మారని దుస్థితి
(రాజమహేంద్రవరం-ఆంధ్రజ్యోతి)
రాజమహేంద్రవరంలో గోదావరి నీటి కలుషితం ఆగట్లేదు. రాష్ట్ర జీవనాడికి కాలుష్యం కాటు తప్పటంలేదు. నీటిని కలుషితం చేయడంలో పేపర్ మిల్లు, నల్లా చానెల్‌దే ప్రధాన పాత్రం. పేపర్‌మిల్లు కలుషితం చేసిన తర్వాత.. నల్లా చానెల్ మరింత దారుణంగా నదీ జలాలను మార్చేస్తోంది. రాత్రి వేళల్లో వ్యర్థాలతో పాటు మురుగునీటిని గుట్టు చప్పుడు కాకుండా నదిలోకి వదిలేస్తున్నారు. ఆ మురుగు నీరు కలిసే చోట, పరిసర తీరంలో పెద్ద ఎత్తున వ్యర్థాలు పేరుకుపోతున్నాయి. దీంతో నల్లా చానెల్ ఎగువన ఉన్న కోటిలింగాల ఘాట్ నుంచి దిగువన పుష్కర, మార్కండేయ తదితర ఘాట్లలో నీరు దుర్వాసన వస్తోంది. నల్లా చానెల్ సమీపంలో ఉన్న ఘాట్లలో అయితే ప్లాస్టిక్ ఇతర వ్యర్థాలు ఒడ్డున తెట్టులా పేరుకుపోయి.. నీటిలో కాలు పెట్టడానికి కూడా వీల్లేకుండా పోయింది. ఈ నిర్లక్ష్యంపై రాజమహేంద్రవరం మునిసిపల్ కార్పొరేషన్‌కి నోటీసులు జారీ చేయాలని ఇటీవల డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆదేశించిన తర్వాత కూడా మురుగు, వ్యర్థాలతో నదీ జలాలను కలుషితం చేయడం ఏ మాత్రమూ తగ్గలేదు. శుద్ధి చేయని మురుగు నీటిని ధవళేశ్వరం సాయిబాబా గుడి దిగువన గోదావరిలో కలిపేస్తున్నారు. మురుగునీరు కలవడం వల్ల గోదావరి పూర్తిగా రంగు మారిపోతోంది. కాలుష్యం వల్ల నీటిలో ఆక్సిజన్ శాతం తగ్గిపోయి జలచరాలు మృత్యువాత పడుతున్నాయి. ఇటీవల డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేయించిన నీటి పరీక్షల్లో బయటపడిన ఫలితాలు దిగ్ర్భాంతి కల్పించేవిగా ఉన్నాయి. ఇక్కడి గోదావరి నీరు స్నానాలు చేయడానికి, గృహావసరాలకు అసలు పనికిరావని, ఈ నీటి వల్ల కలరా, టైఫాయిడ్, విరేచనాలు, చర్మవ్యాధులు వచ్చే అవకాశం ఉందని ఆ ల్యాబ్ రిపోర్టులు తేల్చేశాయి. ఇంత దారుణంగా పరిస్థితి ఉన్నా, నదిలో కాలుష్యాన్ని తగ్గించడానికి ప్రయత్నాలు ఇంకా జరగకపోవడం జనాలను విస్మయానికి గురిచేస్తోంది.