మన్నించమ్మా.. గోదారమ్మా!
ABN , Publish Date - Jun 13 , 2026 | 04:28 AM
పశ్చిమ కనుమల్లోని నాసికాత్రయంబకంలో పుట్టి, మహారాష్ట్ర, తెలంగాణ, ఛత్తీస్‌గఢ్, ఆంధ్రప్రదేశ్ మీదుగా 1465 కి.మీ. ప్రయాణించి తూర్పున బంగాళాఖాతంలో సంగమిస్తుంది గోదావరి. దక్షిణ భారతంలో అతిపెద్ద నదిగా, దక్షిణ గంగగా పేరొందింది.
జీవనాడికి కాలుష్యం కాటు
రోజుకు 105 మిలియన్ లీటర్ల మురుగు నదిలోకి
ఎక్కువగా పేపరు మిల్లు నుంచే.. మునిసిపాలిటీలది కూడా ముఖ్య పాత్రే
తప్పుల తడకగా పీసీబీ నీటి లెక్కలు
పవన్ చేయించిన పరీక్షలతో వాస్తవాలు వెలుగులోకి
నీటి పరీక్షల్లో ఆందోళనకర ఫలితాలు
పరిమితికి మించి ఈకొలి, బయోకెమికల్ ఆక్సిజన్, నైట్రేట్లు
ఆక్సిజన్ తగ్గి జలచరాల మృత్యువాత
జీవనోపాధి పోతోందని మత్స్యకారుల ఆందోళన
ప్రక్షాళనకు డిప్యూటీ సీఎం ఆదేశాలు.. తక్షణం నిధులు
‘స్వచ్ఛ గోదావరి, పవిత్ర పుష్కరాలు’ దిశగా అడుగులు
ఉప్పొంగెలే గోదావరి, ఊగిందిలే చేలోవరి..
వెతలు తీర్చు మాదేవేరి.. వేదమంటి మా గోదారి
..అంటూ కవులు గోదావరి నది గురించి ఎంతో గొప్పగా అభివర్ణించారు. గోదారమ్మ తెలుగు వారి జీవితంలో ఓ ఆత్మీయ భాగం. రెండు తెలుగు రాష్ట్రాలకూ జీవనాడి. అలాంటి గోదావరి నేడు కాలుష్యంతో విలవిల్లాడుతోంది. గతంలో దోసిలితో నీళ్లు పట్టుకుని తాగే స్వచ్ఛమైన ప్రవాహం నుంచి నేడు కనీసం కాళ్లు తడుపుకొనేందుకు కూడా భయపడే పరిస్థితికి చేరింది. దీనికి నదిని ఆనుకుని ఉన్న పరిశ్రమలు ప్రధాన కారణం కాగా, పట్టణాలు, నగరాల నుంచి వస్తున్న మురుగును యథాతథంగా నదిలో కలిపేయడం మరో కారణం. ఇటీవల ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ రాజమహేంద్రవరంలో పర్యటించిన తర్వాత రాష్ట్రంలో గోదావరి ప్రక్షాళనకు అడుగులు పడుతున్నాయి.
(రాజమహేంద్రవరం- ఆంధ్రజ్యోతి)
పశ్చిమ కనుమల్లోని నాసికాత్రయంబకంలో పుట్టి, మహారాష్ట్ర, తెలంగాణ, ఛత్తీస్‌గఢ్, ఆంధ్రప్రదేశ్ మీదుగా 1465 కి.మీ. ప్రయాణించి తూర్పున బంగాళాఖాతంలో సంగమిస్తుంది గోదావరి. దక్షిణ భారతంలో అతిపెద్ద నదిగా, దక్షిణ గంగగా పేరొందింది. ఇలాంటి పవిత్ర నదిలో పుష్కరాల సమయంలో స్నానం చేసి తరించాలని కోట్లాది మంది భక్తులు భావిస్తారు. అయితే పుష్కర స్నానం చేస్తే పుణ్యంతో పాటు వ్యాధులు కూడా వచ్చే ప్రమాదం ఉందని ప్రస్తుతం ఆ నదిలో నీటిని చూస్తే అర్థమవుతుంది. దీనికి నదిని ఆనుకుని ఉన్న నగరాల నుంచి వచ్చే మురుగు, కాలుష్య కారక పరిశ్రమలు, ప్లాస్టిక్ వ్యర్థాలు కారణం. ఇటీవల డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ రాజమహేంద్రవరం పర్యటనకు వచ్చిన సందర్భంగా మురుగునీటి నిర్వహణ, గోదావరి కాలుష్యాన్ని కళ్లారా చూసి ఆశ్చర్యపోయారు. కెమికల్ నీటిలో పుష్కర స్నానం చేయిస్తారా అంటూ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గోదావరి ప్రక్షాళనకు నిధులు ఇస్తామని ప్రకటించి.. వెంటనే కాలుష్య నివారణ పనులు చేపట్టాలని ఆదేశించారు. కాలుష్యాన్ని చూసీచూడనట్లుగా ఎందుకు వదిలేస్తున్నారని కాలుష్య నియంత్రణ మండలిని నిలదీశారు. పుష్కరాలకు కేంద్ర బిందువైన రాజమహేంద్రవరంలోని గోదావరి జలాలు ఎంత ప్రమాదకర స్థాయిలో ఉన్నాయో ల్యాబ్ పరీక్షల్లో వెలుగు చూశాయి. పవన్ రాకతో అప్పటివరకూ ఉన్న పుష్కర ఏర్పాట్ల ముఖచిత్రం పూర్తిగా మారిపోయింది. ‘స్వచ్ఛ గోదావరి.. పవిత్ర పుష్కరాలు’ దిశగా పరుగు మొదలైంది. గోదావరి శుద్ధికి ప్రాథమికంగా నిధులను కూడా విడుదల చేశారు.
కాలుష్యానికి కారణాలెన్నో..
రాష్ట్రంలోని గోదావరి పరీవాహక ప్రాంతాల్లోని ఆరు జిల్లా పరిధిలో 262 పంచాయతీల్లో పుష్కర ఏర్పాట్లు చేస్తున్నారు. పుష్కరాల నాటికి ఇక్కడెక్కడా మురుగు లేకుండా ఘాట్లను తీర్చిదిద్దాల్సి ఉంది. అయితే ప్రతి రోజూ గోదావరిలో గ్రామీణ ప్రాంతాల నుంచి 8.38 మిలియన్ లీటర్ల మురుగు కలుస్తోంది. పారిశ్రామిక వ్యర్థాలతో పాటు ఆయా గ్రామాల్లో వ్యర్థాలను కూడా పెద్దఎత్తున నదిలో కలిపేస్తున్నారు. ఇందులో రాజమహేంద్రవరంలోని ఆంధ్రా పేపర్ మిల్స్ లిమిటెడ్ మొదటి స్థానంలో ఉంటుంది. రాజమహేంద్రవరం మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలో రోజుకు 80 మిలియన్ లీటర్ల మురుగునీరు ఉత్పత్తి అవుతోంది. అయితే చాలా ఏళ్ల నుంచి 40 మిలియన్ లీటర్ల శుద్ధి సామర్థ్యం ఉన్న సీవేజీ ట్రీట్‌మెంట్ ప్లాంటు (ఎస్టీపీ) మాత్రమే మనుగడలో ఉండేది. తర్వాత అది కాస్తా పడకేసింది. సుమారు మూడేళ్ల నుంచీ శుద్ధి చేయని మురుగు నీటిని ధవళేశ్వరం సాయిబాబా గుడి ప్రాంతంలోని దిగువలో గోదావరిలో కలిపేస్తున్నారు. పశ్చిమ గోదావరిలో తణుకు మునిసిపాలిటీ నుంచి రోజుకు 11.1, భీమవరం 14, నరసాపురం 8.5, కొవ్వూరు నుంచి 6 మిలియన్ లీటర్ల వ్యర్థ జలాలు యనమదుర్రు, గోస్తనీ తదితర డ్రెయిన్ల ద్వారా గోదావరిలోకి వెళ్లిపోతున్నాయి. అలాగే తూర్పు గోదావరి, కోనసీమలోని ఇతర పట్టణాల నుంచి కూడా గోదావరిలోకి మురుగు చేరుతోంది. నిత్యం గోదావరిలో కలిసే 13.24 మిలియన్ లీటర్ల ఆక్వా కాలుష్యం వీటికి అదనంగా ఉంది. మొత్తానికి జీవనదిని రోజూ 105 మిలియన్ లీటర్ల మురుగు నీరు కలుషితం చేస్తోంది.
పేపర్ మిల్లు మడుల నుంచి నదిలోకి..
రాజమహేంద్రవరంలోని పేపరు మిల్లు రసాయన వ్యర్థాల కాలుష్యాన్ని పాలకులు ఎందరు మారినా అరికట్టలేకపోయారు. ఈ పేపరు మిల్లు నుంచి రోజుకు 26 వేల మిలియన్ లీటర్ల రసాయన/వ్యర్థ జలాలను గోదావరి లంకల్లో ఒకటైన తూర్పు లంకలోని సుమారు 10 పెద్ద పెద్ద మడుల్లోకి పంపిస్తారు. ఆ కాలుష్య నీరు ఒక మడి నుంచి మరొక మడిలోకి వెళుతూ ఉంటే హానికర పదార్థాలు కొంత భూమిలోకి, మరి కొంత ఆవిరి రూపంలో గాలిలోకి వెళుతున్నాయి. ఈ మడుల్లో పేరుకునే కాలుష్యం వరద సమయంలో గోదావరిలో కలిసిపోతుంటుంది. 1965 నాటి అనుమతులను చూపుతూ పేపరు మిల్లు కాలుష్యాన్ని కొనసాగిస్తోంది. కొత్త పద్ధతులు వచ్చినా కూడా పట్టించుకోవడంలేదు. మిల్లులో ఉన్న ఎఫ్లూయెంట్ ప్లాంటు ఎప్పుడు పని చేస్తుందో ఎప్పుడు పని చేయదో పీసీబీ (కాలుష్య నియంత్రణ మండలి) అధికారులకే తెలియాలి. గోదావరి మధ్యలోని మడుల్లో పీసీబీ పరీక్షలు నిర్వహించకపోవడం ప్రశ్నార్థకంగా మిగిలిపోతోంది.
మునిసిపల్ అధికారులదీ అదే తీరు
రాజమహేంద్రవరం మునిసిపల్ అధికారుల తీరు కూడా పేపరు మిల్లులాగే ఉంది. నగరంలో నల్లా చానెల్ అని మురుగు నీటి పంపింగ్ కేంద్రం ఉంది. ఇది రెండు విధాలుగా ఉపయోగిస్తారు. వర్షాలు వచ్చినప్పుడు లోతట్టు ప్రాంతాల్లోని ముంపు నీటిని గోదావరిలోకి ఎత్తిపోయడానికి, మురుగునీటిలో వ్యర్థాలు వేరు చేయడానికి వినియోగిస్తారు. నల్లా చానెల్ వద్ద వ్యర్థాలను వేరు చేసిన తర్వాత మురుగు నీరు సుమారు 5 కిలోమీటర్ల దూరంలోని ఎస్టీపీకి వెళుతుంది. అయితే రాత్రి వేళల్లో మురుగునీటిని నేరుగా గోదావరిలోకి పెద్ద గొట్టాల ద్వారా వదిలేస్తుంటారు.
పీసీబీ లెక్కలు ఒకలా.. నిజాలు మరోలా..
పవన్ రాజమహేంద్రవరం వచ్చినప్పుడు ఇవీ పరీక్షల ఫలితాలంటూ ఓ పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌ని ఆయన ముందు పీసీబీ ఉంచింది. ఈకొలి బ్యాక్టీరియా నుంచి పీహెచ్ వరకు అన్ని పారామీటర్లు సవ్యంగా ఉన్నాయని పీసీబీ అధికారులు చూపించారు. అయితే లెక్కల్లో పూర్తి మతలబు జరిగిందని ఈనెల 8న పవన్ సమీక్షలో తేలిపోయింది. పీసీబీ లెక్కల్లో వాస్తవాలు లేవని డిప్యూటీ సీఎం పవన్ నిరూపించారు. సాధారణంగా నదీ నీటిలో మనుషులు స్నానాలు చేయడానికి కోలిఫామ్ బ్యాక్టీరియా 500 ఎంపీఎన్/100ఎంల్ ఉండాలి. కానీ నల్లా చానల్ సమీపంలోని కోటిలింగాల ఘాట్ ప్రాంతంలో ఏకంగా 2,420 ఎంపీఎన్/100ఎంల్‌గా నమోదైంది. నీటిలో కాలుష్యాన్ని చూపే బయోకెమికల్ ఆక్సిజన్ డిమాండ్ పరిమితి 3ఎంజీ/ఎల్ కంటే తక్కువగా ఉండాలి. కానీ ఇక్కడ 5.2ఎంజీ/ఎల్‌గా ఉంది. అనుమతించిన ప్రమాణాలకంటే ఏకంగా 73 శాతం పెరుగుదల కనిపించింది. దీనివల్ల నీటిలో ఆక్సిజన్ శాతం తగ్గిపోయి జలచరాలు మృత్యువాత పడుతున్నాయి. నీటి స్వచ్ఛత గరిష్ఠంగా 5 ఎన్‌టీయూ వరకూ అనుమతిస్తారు. కానీ 8.4 నుంచి 14.2 ఎన్‌టీయూగా ఉంది. మురుగునీరు కలవడం వల్ల గోదావరి పూర్తిగా రంగు మారిపోతోంది. మురుగు కాలువల్లో కెమికల్ ఆక్సిజన్ డిమాండ్ పరిమితి 250/ఎల్ దాటకూడదు. కానీ 263 ఎంజీ/ఎల్‌గా నమోదైంది. నైట్రేట్ పరిమితి 45 వరకూ అనుమతిస్తారు. అయితే 119.6ఎంజీ/ఎల్ ఉంది. రసాయన ఎరువుల అవశేషాలు, ఫ్యాక్టరీల వ్యర్థాలు కలవడం వల్ల నైట్రేట్ల శాతం ఇంత విపరీతంగా పెరిగిపోయింది. ఈ ల్యాబ్ నివేదికల ప్రకారం ఇక్కడి గోదావరి నీరు స్నానాలు చేయడానికి, గృహ అవసరాలకు అస్సలు పనికిరాదు. ఈ నీటి వల్ల కలరా, టైఫాయిడ్, విరేచనాలు, చర్మవ్యాధులు వచ్చే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా నైట్రేట్లు ఎక్కువగా ఉండడం వల్ల చిన్న పిల్లలకు ఆక్సిజన్ పూర్తిగా అందకపోవడంతో బ్లూబేబీ సిండ్రోమ్ బారిన పడతారు.
పేపర్ మిల్లు మడుల్లోనూ ప్రమాదకర ఫలితాలు
ఆంధ్రా పేపరు మిల్లు మడుల వద్ద సేకరించిన గోదావరి నీటి నమూనాల్లో కూడా ఆందోళనకరమైన ఫలితాలు వెలుగు చూశాయి. సల్ఫైడ్, డీవోబీ, ఫాస్పేట్లు పరిమితికి మించి ఉన్నట్టు వెల్లడైంది. బయోకెమికల్ ఆక్సిజన్ డిమాండ్ పరిమితి 20 శాతం అధికంగా నమోదైంది. పారిశ్రామిక వ్యర్థాల శుద్ధిలో లోపం వల్ల నీటిలో ఆక్సిజన్ తగ్గి జల చరాలు చనిపోతున్నాయి. ఈ విషయాన్ని స్థానిక మత్స్యకారులు కూడా పవన్ దృష్టికి తెచ్చారు. తమ జీవనోపాధి కోల్పోతున్నామని గగ్గోలు పెట్టారు. నీటిలో ఫాస్ఫేట్ 5కి బదులు 5.3 ఎంజీ/ఎల్‌గా, సల్ఫైడ్ 2కి బదులుగా 3.4 ఎంజీ/ఎల్ ఉంది. ఈ నీటి వల్ల ప్రాణాలకు కూడా ముప్పు వాటిల్లే ప్రమాదం ఉంది.
తక్షణ కర్తవ్యం ఏమిటి?
డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ రాజమహేంద్రవరం వచ్చి వెళ్లిన మరుసటి రోజునే ఎన్విరాన్‌మెంట్ స్పెషల్ టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేస్తూ జీవో విడుదలైంది. ఈ ఫోర్స్ ఇంకా రంగంలోకి దిగాల్సి ఉంది. కాలుష్య నియంత్రణ మండలి ద్వారా రూ.100 కోట్ల నిధులను మంజూరు చేశారు. గ్రామీణ, పట్టణాల్లో మురుగునీటి నిర్వహణతో పాటు పారిశ్రామిక కాలుష్య పర్యవేక్షణకు ఆర్టీజీఎస్ తరహాలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేస్తా రు. పర్యవేక్షణ బాధ్యతను టాస్క్‌ఫోర్స్‌కి అప్పగిస్తారు. అవసరమైతే వీబీ జీ రాం జీ, స్వచ్ఛాంధ్ర, పీసీబీ నిధులను వినియోగిస్తారు. గృహ వినియోగ మురుగునీటి నియంత్రణ, నిర్వహణ కోసం వీబీ జీ రాం జీ పథకం కింద మ్యాజిక్ డ్రెయిన్లను నిర్మిస్తారు. బ్లాక్ వాటర్ నిర్వహణకు సామాజిక ఇంకుడు గుంతల తరహా నిర్మాణాలు, ఇళ్లలో ట్విన్ పిట్స్ ఏర్పాటు చేస్తారు. కాలువలు, డ్రెయిన్ల నుంచి నేరుగా గోదావరిలోకి మురుగు నీరు వెళ్లకుండా స్థానిక సంస్థల ఆధ్వర్యంలో పర్యవేక్షణ బృందాలను ఏర్పాటు చేస్తారు. ముఖ్యంగా రాజమహేంద్రవరంతోపాటు ఇతర మునిసిపాలిటీల్లో కూడా మినీ ఎస్టీపీ ప్లాంట్లను యుద్ధ ప్రాతిపదికన నిర్మించాలి. రాజమహేంద్రవరంలోని మురుగునీరు ఎస్టీపీలో శుద్ధి అనంతరం సముద్రంలోకి వెళ్లే విధంగా 30 ఏళ్ల క్రితం ప్రతిపాదించారు. అయితే నిధుల లేమి కారణంతో అది మూలన పడింది. ఇప్పుడు దానిని మనుగడలోకి తీసుకొచ్చి కేంద్రం నుంచి నిధులు సాధిస్తే చా లా మటుకు గోదావరి కాలుష్యాన్ని శాశ్వత ప్రాతిపదికన అరికట్టవచ్చు. అలాగే గోదావరి తీరం వెంబడి ఉన్న పరిశ్రమలు, శ్మశానాలపై కూడా నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఎన్ని చేసినా, అధికారుల్లో సమన్వయ లోపం మాత్రం ఎప్పటి మాదిరిగానే తాండవిస్తోంది.