Share News

గోదారికి భారీ వరద!

ABN , Publish Date - Sep 28 , 2026 | 05:23 AM

అల్పపీడన ప్రభావంతో ఎగువన కురిసిన భారీ వర్షాలకు గోదావరి ఉపనదులు మంజీర, ప్రాణహిత, ప్రవర, సీలేరు, శబరి ఉప్పొంగుతున్నాయి. దీంతో భారీ వరద ప్రవాహం పోలవరం ప్రాజెక్టు వద్ద పోటెత్తింది.

గోదారికి భారీ వరద!
GODARI

  • పోలవరం స్పిల్‌వే నుంచి దిగువకు

8.75 లక్షల క్యూసెక్కులు విడుదల

  • ఈ వరదంతా సముద్రంలోకే

  • వేలేరుపాడు, కుక్కునూరు మండలాల్లో

24 గ్రామాలకు రాకపోకలు బంద్‌

  • నీటమునిగిన మిర్చి, అపరాలు

పోలవరం/కుక్కునూరు/వేలేరుపాడు/రాజమహేంద్రవరం, సెప్టెంబరు 27 (ఆంధ్రజ్యోతి): అల్పపీడన ప్రభావంతో ఎగువన కురిసిన భారీ వర్షాలకు గోదావరి ఉపనదులు మంజీర, ప్రాణహిత, ప్రవర, సీలేరు, శబరి ఉప్పొంగుతున్నాయి. దీంతో భారీ వరద ప్రవాహం పోలవరం ప్రాజెక్టు వద్ద పోటెత్తింది. దీంతో స్పిల్‌వే నుంచి 8,75,512 క్యూసెక్కులను దిగువకు విడుదల చేసినట్లు ప్రాజెక్టు స్పిల్‌వే డీఈ వెంకటేశ్వరరావు తెలిపారు. ఈ మొత్తాన్ని ధవళేశ్వరం బ్యారేజీ నుంచి సముద్రంలోకి వదిలేస్తున్నారు. పోలవరం ఎగువ కాఫర్‌ డ్యాంకు ఎగువన 32.650 మీటర్లు, స్పిల్‌వే ఎగువన 32.550 మీటర్ల నీటిమట్టం నమోదైంది. తెలంగాణలోని భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం 42.70 అడుగులకు చేరుకుంది. పోలవరం వద్ద గోదావరి నీటిమట్టం పెరగడంతో పట్టిసీమ శివక్షేత్రాన్ని వరద చుట్టుముట్టింది. ఆలయానికి రాకపోకలు నిలిపివేశారు. మరోవైపు గోదావరి వరద కారణంగా కుక్కునూరు మండలంలో 100 ఎకరాల్లో మిర్చితోటలు నీటమునిగాయి. వేలేరుపాడు మండలంలో వేలేరుపాడు-కోయిదా ఆర్‌అండ్‌బీ ప్రధాన రహదారిపై వరదనీరు చేరుకోవడంతో 20 గ్రామాలకు.. వేలేరుపాడు-రుద్రమ్మకోట మధ్య రహదారిపై వరద చేరుకోవడంతో 4 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. మండలంలో సుమారు 500 ఎకరాల్లో మిరప, మరో 500 ఎకరాల్లో అపరాల పంటలు నీటమునిగాయి. ఇంకోవైపు.. కృష్ణా డెల్టా, ఉమ్మడి పశ్చిమ డెల్టాల సాగునీటి అవసరాల కోసం పట్టిసీమ ఎత్తిపోతల పథకం నుంచి పోలవరం ప్రాజెక్టు కుడి కాలువకు 7,788 క్యూసెక్కులు విడుదల చేశారు. ధవళేశ్వరం బ్యారేజీ వద్ద సాధారణ నీటిమట్టం 10.9 అడుగులు కాగా.. ప్రస్తుతం 9.80 అడుగులుగా ఉంది. సోమవారం ఉదయానికి మరో 2 లక్షల క్యూసెక్కుల వరద చేరుకుంటుందని అంచనా వేస్తున్నారు.

Updated Date - Sep 28 , 2026 | 05:23 AM