Share News

కుంభమేళా తరహాలో గోదారి పుష్కరాలు

ABN , Publish Date - Feb 27 , 2026 | 03:00 AM

మహాకుంభమేళా తరహాలో గోదావరి పుష్కరాలు నిర్వహించాలని మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయం తీసుకుంది. గురువారం సచివాలయంలో దేవదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి అధ్యక్షతన...

కుంభమేళా తరహాలో గోదారి పుష్కరాలు

  • ముందస్తు ఏర్పాట్లకు బడ్జెట్‌లో రూ.60 కోట్లు కేటాయింపు

  • భక్తుల వసతికి టెంట్‌ సిటీలు, హోమ్‌ స్టేలు

  • మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయం

అమరావతి, ఫిబ్రవరి 26(ఆంధ్రజ్యోతి): మహాకుంభమేళా తరహాలో గోదావరి పుష్కరాలు నిర్వహించాలని మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయం తీసుకుంది. గురువారం సచివాలయంలో దేవదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి అధ్యక్షతన గోదావరి పుష్కరాలపై మంత్రివర్గ ఉపసంఘం భేటీ అయ్యి, ప్రధానంగా ఐదు అంశాలపై సుదీర్ఘ చర్చ జరిపింది. పుష్కరాల ఏర్పాట్లపై ఆయా జిల్లాల కలెక్టర్లు, శాఖలు రూపొందించిన పీపీటీలు, మంత్రుల సలహాలు, సూచనలు తదితరాలపై చర్చించి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. పుష్కరాలకు ఈసారి 10 కోట్లకుపైగా భక్తులు వస్తారని అంచనా వేశారు. 2027 జూన్‌ 26వ తేదీ నుంచి జూలై 7వ తేదీ వరకూ గోదావరి పుష్కరాలను ఆరు జిల్లాల్లో ఘనంగా నిర్వహించాలని నిర్ణయించారు. తూర్పుగోదావరిలో 102, పశ్చిమగోదావరిలో 40, కోనసీమలో 175, ఏలూరులో 36, కాకినాడలో 5, పోలవరం జిల్లాలో 11 స్నానాల ఘాట్లను నిర్వహించాలని, మొత్తంగా 369 ఘాట్లను భక్తులకు అందుబాటులో ఉంచాలని నిర్ణయించారు. పుష్కరాలకు వచ్చే భక్తులు రెండు, మూడు రోజులు అక్కడే ఉండేలా టెంట్‌ సిటీలు, హోమ్‌ స్టేలు ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. రాజమండ్రి, కొవ్వూరు ఘాట్లకు ఎక్కువ మంది వస్తారని మంత్రి రాంనారాయణ రెడ్డి అభిప్రాయపడ్డారు. పుష్కరాలకు వచ్చే భక్తులు దైవదర్శనాలు చేసుకుంటారని, 391 ఆలయాల్లో మైనర్‌ రిపేర్లతో పాటు 43 ఆలయాల్లో నవీకరణ పనులు చేస్తున్నామని వివరించారు. పుష్కరాలకు తగినంత సమయం ఉన్నందున ముందుగానే ఘాట్ల మరమ్మతులు, నిర్మాణాలు పూర్తి చేయాలని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఆదేశించారు.


మహిళా భక్తులకు కల్పించే సౌకర్యాలు, వసతులపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. పుష్కరాల ముందస్తు ఏర్పాట్లకు బడ్జెట్‌లో రూ.60 కోట్లు కేటాయించామని మంత్రి దుర్గేశ్‌ తెలిపారు. పుష్కరాలు జరిగే ప్రాంతాల్లో 4800 రూవ్‌ లు అందుబాటులో ఉన్నాయని, పర్యాటక సర్క్యూట్‌లు ఏర్పాటు చేయాలని నిర్ణయించామన్నారు. ఏ ఘాట్‌లో స్నానం చేసినా ఒకటే పుణ్యఫలం వస్తుందని ప్రభుత్వ సలహాదారు చాగంటి కోటేశ్వరరావుతో ప్రజలకు అవగాహన కల్పిస్తే బాగుంటుందని మంత్రులు అభిప్రాయం వ్యక్తం చేశారు. సమావేశంలో మంత్రులు గొట్టిపాటి రవికుమార్‌, సత్యకుమార్‌ యాదవ్‌తో పాటు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Updated Date - Feb 27 , 2026 | 03:02 AM