గోదావరి పుష్కరాలకు సిద్ధం కండి
ABN , Publish Date - Jun 03 , 2026 | 04:51 AM
రాష్ట్ర సాంస్కృతిక, చారిత్రక వైభవం ఉట్టిపడేలా గోదావరి పుష్కరాలు నిర్వహించాలని అధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు.
జూన్ 24 నుంచి కౌంట్‌డౌన్ ప్రారంభం
పటిష్ఠమైన కార్యాచరణ ప్రణాళికతో రండి
పుష్కరాలకు ముందే పోలవరం జాతికి అంకితం
పుష్కర ఏర్పాట్లపై మంత్రుల కమిటీ, అధికారులతో సీఎం చంద్రబాబు సమీక్ష
అమరావతి, జూన్ 2(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర సాంస్కృతిక, చారిత్రక వైభవం ఉట్టిపడేలా గోదావరి పుష్కరాలు నిర్వహించాలని అధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు. జూన్ 24 నుంచి పుష్కరాలకు కౌంట్‌డౌన్ ప్రారంభమవుతుందని., ఆ రోజు పటిష్ఠమైన కార్యాచరణ ప్రణాళికతో రావాలని స్పష్టం చేశారు. గోదావరి పుష్కరాల నిర్వహణపై మంత్రుల కమిటీ, వివిధ శాఖల అధికారులతో సచివాలయంలో మంగళవారం ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా అఖండ గోదావరి అభివృద్ధి ప్రాజెక్టుపై సమగ్రంగా చర్చించారు. పుష్కరాలను అభివృద్ధికి అద్భుతమైన అవకాశంగా చూడాలని నిర్దేశించారు. గోదావరి నదీతీరంలో ఎన్నో ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలు ఉన్నందున ఆధ్యాత్మిక పర్యాటకానికి అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. పుష్కరాలకు వచ్చే భక్తులతో ఆర్థిక కార్యకలాపాలు పెరగాలని అన్నారు. అత్యంత ప్రతిష్టాత్మకంగా పుష్కరాలు నిర్వహించేందుకు అన్ని శాఖలూ సమన్వయంతో పని చేయాలని సూచించారు. గోదావరి పుష్కరాల కంటే ముందే పోలవరం ప్రాజెక్టును పూర్తిచేసి జాతికి అంకితం చేస్తామని సీఎం తెలిపారు. దీంతో ఈ ప్రాజెక్టును తిలకించడానికి కూడా సందర్శకులు వచ్చే అవకాశం ఉంటుందని చెప్పారు. ధవళేశ్వరం నుంచి పోలవరం ప్రాజెక్టు వరకూ రహదారిని అఖండ గోదావరిగా అభివృద్ధి చేయాలని ఆదేశించారు. కేవలం పుష్కరాలనే దృష్టిలో పెట్టుకుని పనులు పరిమితం చేయకుండా, ఇప్పుడు చేసే అభివృద్ధి కార్యక్రమాలు, మౌలిక వసతుల కల్పన గోదావరి పరీవాహక ప్రాంతానికి ఆస్తిగా మారాలని స్పష్టం చేశారు. పుష్కరాల నిర్వహణతో రాజమహేంద్రవరం మహానగరంగా అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు.
'హైవే ట్రాఫిక్ మేనేజ్‌మెంట్, రైల్వే ట్రాఫిక్, గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చే వాహనాల రద్దీపైనా దృష్టి పెట్టాలి. భక్తుల సౌకర్యార్థం, ఎలాంటి గందరగోళం లేకుండా పుష్కర ఘాట్లకు నంబరింగ్ ఇవ్వాలి. జాతీయ, రాష్ట్ర రహదారుల అనుసంధానం, విశాఖ నుంచి విజయవాడ వరకూ రైలు సర్వీసులు పెంచాలి. ప్రత్యేక రైళ్ల గురించి కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్‌కు లేఖ రాయడంతో పాటు పుష్కరాలకు కేంద్రం నుంచి ప్రత్యేక ఆర్థిక సాయం కోరాలి. పర్యాటకుల సౌకర్యం కోసం కుంభమేళా తరహాలో టెంట్ సిటీలు, హోం స్టేలు ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలించాలి. పుష్కర పనుల పరిశీలనకు ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఇటీవల క్షేత్రస్థాయిలో పర్యటించిన సమయంలో చేసిన సూచనలు పరిగణనలోకి తీసుకోవాలి. పోలవరం ప్రాజెక్టుకు ఇరువైపులా రహదారులు నిర్మించడంతో పాటు, గోదావరి గట్టు సుందరీకరణ చేయాలి. రాజమహేంద్రవరంలోని కందుకూరి వీరేశలింగం పంతులు ఇంటిని కూడా తీర్చిదిద్దాలి. పీఠాధిపతులు, ఆధ్యాత్మిక గురువులు, రాజకీయవేత్తలు, సినీ ప్రముఖులను పుష్కరాలకు ఆహ్వానించాలి. ఏపీ స్పేస్ అప్లికేషన్ సెంటర్, ఆర్టీజీఎస్, టీటీడీ సంయుక్తంగా రద్దీ నిర్వహణ ప్రక్రియను చేపట్టాలి. అఖండ గోదావరి పుష్కరాలు- 2027 వెబ్‌సైట్‌ను ప్రారంభించాలి. గోదావరికి అఖండ హారతి, కృష్ణానదికి పవిత్ర హారతి రెండూ నిరాటకంగా కొనసాగాలి’’ అని చంద్రబాబు ఆదేశించారు.
ఆరు జిల్లాల్లో 525 ఘాట్లు
గోదావరి పుష్కరాల కోసం పోలవరం, ఏలూరు, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కోనసీమ, కాకినాడ జిల్లాల్లో 525 ఘాట్లను సిద్ధం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతం ఉన్న 288 ఘాట్లతో సహా కొత్తగా 237 ఘాట్ల నిర్మాణానికి అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ప్రస్తుతం 4.5 కిలోమీటర్ల మేర ఉన్న ఘాట్లను 9.9 కిలోమీటర్ల వరకూ పెంచాలని నిర్ణయించారు. పోలవరం జిల్లా గుండాలలో మొదటి ఘాట్ నిర్మించనున్నారు. పుష్కరాల్లో పుణ్యస్నానాల కోసం దాదాపు 9.95 కోట్ల మంది భక్తులు వస్తారని అంచనా వేస్తున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో 1991లో జరిగిన పుష్కరాల్లో 1.2 కోట్ల మంది, 2003లో 5 కోట్ల మంది, 2015లో నవ్యాంధ్రప్రదేశ్‌లో 4.86 కోట్ల మంది పుష్కర స్నానాలు చేశారు. గత పుష్కరాల్లో ఒక్కరోజులో అత్యధికంగా 58.26 లక్షల మంది స్నానం చేయగా, ఈసారి వీరిసంఖ్య కోటి దాటుతుందని భావిస్తున్నారు. ఇప్పటికే రూ.211.97 కోట్ల విలువైన 132 పనులకు ప్రభుత్వం అనుమతులు మంజూరు చేసిందని అధికారులు సీఎంకు వివరించారు. ఈ సమీక్షలో పలువురు మంత్రులు, డీజీపీ హరీశ్‌కుమార్ గుప్తా, వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.