Share News

గుడ్డుకు గడ్డుకాలం!

ABN , Publish Date - Feb 06 , 2026 | 02:58 AM

గుడ్డుకు గడ్డుకాలం వచ్చింది. గోదావరి నెక్‌ గుడ్డు ధర నెల రోజుల నుంచి నేల చూపులు చూస్తోంది. ప్రస్తుతం ఒక గుడ్డుపై కోళ్ల రైతుకు చెల్లిస్తున్న రేటు రూ.4.80 . గోదావరి గుడ్లకు ప్రధాన మార్కెట్‌ కోల్‌కతా.

గుడ్డుకు గడ్డుకాలం!

  • సంక్రాంతి తర్వాత తగ్గిన డిమాండ్‌

  • ఒక గుడ్డుపై రైతుకు రూ.4.80 చెల్లింపు

  • కోల్‌కతా మార్కెట్‌లో డిమాండ్‌ లేదంటూరూ.4.37 కే అడుగుతున్న ట్రేడర్లు

  • గిట్టుబాటు కాదంటున్న రైతులు

  • ఫారాల వద్ద పేరుకుపోతున్న నిల్వలు

(అనపర్తి, ఆంధ్రజ్యోతి)

గుడ్డుకు గడ్డుకాలం వచ్చింది. గోదావరి నెక్‌ గుడ్డు ధర నెల రోజుల నుంచి నేల చూపులు చూస్తోంది. ప్రస్తుతం ఒక గుడ్డుపై కోళ్ల రైతుకు చెల్లిస్తున్న రేటు రూ.4.80 . గోదావరి గుడ్లకు ప్రధాన మార్కెట్‌ కోల్‌కతా. అయితే, అక్కడి మార్కెట్‌లో డిమాండ్‌ లేదంటూ ట్రేడర్లు మరీ తగ్గించి అడుగుతున్నారు. ట్రేడర్లు రూ.4.37 పైసలకు బేరం ఆడుతున్నారు. ఆ రేటుకైతే కోల్‌కతాకు ప్యాకింగ్‌ చేస్తామని చెబుతున్నారు. దీంతో నాలుగు రోజులుగా ప్యాకింగ్‌లు నిలిచిపోయి ఫారాల వద్ద గుడ్లు పేరుకుపోతున్నాయి. దీనిపై రైతులు ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం ఒక గుడ్డు ఉత్పత్తికి రూ.5.50 పైసల వరకు ఖర్చు అవుతోందని, ట్రేడర్లు అడిగిన రేటుకు ఇస్తే తమకు గుడ్డుకు 1.13పైసలు నష్టం వస్తుందని వాపోతున్నారు. పైగా, దీనిపై ట్రేడరుకు రెండు శాతం కమీషన్‌ కూడా ఇవ్వాల్సి ఉంటుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దేశంలోని మిగిలిన మార్కెట్లకు డిమాండ్‌ బాగానే ఉంది. గోదావరి నెక్‌లో కూడా జనవరి వరకు మంచి రేటే పలికింది. డిసెంబరు 22 నాటికి ఒక గుడ్డుకు రైతుకు చెల్లించే ధర రూ.6.95పైసలకు చేరుకుని రికార్డు నెలకొల్పింది. ఆ తర్వాతే కోళ్ల రైతులకు కష్టాలు మొదలయ్యాయి. కోల్‌కతా మార్కెట్‌కు వివిధ రాష్ట్రాల నుంచి గుడ్లు అధికంగా రావడంతో, అక్కడి ట్రేడర్లు ధరను తగ్గిస్తున్నారని ఇక్కడి ట్రేడర్లు వివరణ ఇస్తున్నారు. ఇప్పుడే పరిస్థితి ఇలా ఉండగా, సహజంగా డిమాండ్‌ తక్కువ ఉండే వేసవిలో తమ పరిస్థితిని ఊహించుకుని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - Feb 06 , 2026 | 02:58 AM