Share News

గోదావరి వరద జలాలపై ఏపీకే సంపూర్ణ హక్కులు

ABN , Publish Date - Jun 14 , 2026 | 05:36 AM

గోదావరి నదిపై వరద జలాల ఆధారంగా ప్రాజెక్టులను నిర్మించుకునే సంపూర్ణ స్వేచ్ఛ రాష్ట్రానికి ఉందని రాష్ట్ర జల వనరుల శాఖ రిటైర్డ్‌ ఇంజనీరింగ్‌ అధికారుల సంఘం పేర్కొంది.

గోదావరి వరద జలాలపై ఏపీకే సంపూర్ణ హక్కులు

  • దిగువ రాష్ట్రంగా వినియోగించుకోవచ్చని 1978లోనే ట్రైబ్యునల్‌ తీర్పు చెప్పింది

  • గోదావరి-బనకచర్ల నిర్మించుకోవచ్చు

  • కేంద్రం సహా ఎగువ రాష్ట్రాలేవీ అభ్యంతరం చెప్పేందుకు అధికారం లేదు

  • ఈ పథకంలో కరువు ప్రాంతాలకు ప్రయోజనం

  • సీఎం చంద్రబాబుకు రిటైర్డ్‌ ఇంజనీర్ల సంఘం లేఖ

అమరావతి, జూన్‌ 13 (ఆంధ్రజ్యోతి): గోదావరి నదిపై వరద జలాల ఆధారంగా ప్రాజెక్టులను నిర్మించుకునే సంపూర్ణ స్వేచ్ఛ రాష్ట్రానికి ఉందని రాష్ట్ర జల వనరుల శాఖ రిటైర్డ్‌ ఇంజనీరింగ్‌ అధికారుల సంఘం పేర్కొంది. దిగువ రాష్ట్రంగా గోదావరి వరద జలాలు వినియోగించుకునేందుకు ఆంధ్రప్రదేశ్‌కు సంపూర్ణ హక్కులు ఉంటాయని గోదావరి నదీ జలాల వివాద ట్రైబ్యునల్‌ (డీడబ్లూడీటీ) తేల్చి చెప్పాక కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖకు జోక్యం చేసుకునే అధికారం ఎక్కడిదని ప్రశ్నించింది. దిగువ రాష్ట్రంగా గోదావరి నదిపై 75 శాతం మిగులు జలాల ఆధారంగా గోదావరి-బనకచర్ల అనుసంధాన పథకాన్ని నిర్మించుకోవచ్చని అభిప్రాయపడింది. ఈ పథకంపై కేంద్రం సహా ఎగువ రాష్ట్రాలేవీ అభ్యంతరం చెప్పేందుకు అధికారం లేనేలేదని స్పష్టం చేసింది. ముఖ్యమంత్రి చంద్రబాబుకు శనివారం జల వనరుల శాఖ రిటైర్డ్‌ ఇంజనీరింగ్‌ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు ఎం.విశ్వేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి నరసింహమూర్తి ఈ మేరకు లేఖ రాశారు. ఎగువ రాష్ట్రాలకు ప్రాజెక్టుల వారీగా టీఎంసీల వంతున నీటి కేటాయింపులను ట్రైబ్యునల్‌ జరిపాక.. దిగువకు వదిలేసిన జలాలన్నింటిపైనా చివరి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్‌కు వాడుకునే హక్కు ఉంటుందని గోదావరి నదీ జలాల వివాద ట్రైబ్యునల్‌ స్పష్టం చేసిందని ఇంజనీరింగ్‌ అధికారులు స్పష్టం చేశారు. ట్రైబ్యునల్‌ ఆదేశాలపై సుప్రీం కోర్టు సహా కేంద్రం జోక్యం చేసుకోలేదని పేర్కొన్నారు. గోదావరి-బనకచర్ల అనుసంధాన పథకం వెనుకబడిన, కరువు ప్రాంతాలైన కర్నూలు, కడప, ప్రకాశం జిల్లాలోని ఎగువ ప్రాంతాల వ్యవసాయం, తాగునీటి సమస్యను పరిష్కరిస్తుందన్నారు. రాయలసీమ సహా కోస్తా ప్రాంతాల్లో ఆర్థిక సుస్థిరతకు ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. గోదావరి-బనకచర్ల అనుసంధాన పథకంలో భాగంగా బొల్లాపల్లి వద్ద రిజర్వాయరులో భారీగా గోదావరి జలాలను నిల్వ చేయడం వల్ల 75 శాతానికి పైగా నీటి లభ్యత అందుబాటులోకి వస్తుందని వెల్లడించారు.


1978లోనే ట్రైబ్యునల్‌ ఆదేశాలు

గోదావరి నదీ జలాలపై 1978 ఆగస్టు 4న, 7న, అదే ఏడాది డిసెంబరు 15న ట్రైబ్యునల్‌ ఆదేశాలు ఇచ్చిందని రిటైర్డ్‌ ఇంజనీరింగ్‌ అధికారుల సంఘం గుర్తు చేసింది. ఎగువ రాష్ట్రాలు వాడుకొని కిందకు వదిలేసిన నదీ జలాలన్నీ దిగువ రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్‌కే చెందుతాయని, ఎగువ రాష్ట్రాలకు ఎలాంటి హక్కూ ఉండదని ట్రైబ్యునల్‌ స్పష్టమైన ఆదేశాలు ఇచ్చిందని వెల్లడించింది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్‌కు న్యాయపరమైన రక్షణను ట్రైబ్యునల్‌ కల్పించిందని తెలిపింది. అంతర్రాష్ట్ర జలవివాద చట్టం 1956లోని సెక్షన్‌ 6లోనూ వరద జలాలపై ఆంధ్రప్రదేశ్‌కు చట్టపరమైన, న్యాయపరమైన హక్కులను కల్పించిన విషయాన్ని సీఎంకు రాసిన లేఖలో గుర్తు చేసింది.

Updated Date - Jun 14 , 2026 | 05:37 AM