Share News

గోదావరి డెల్టా ఆధునికీకరణకు సమగ్ర ప్రణాళిక

ABN , Publish Date - Oct 08 , 2026 | 05:23 AM

‘గోదావరి డెల్టాలో ముంపు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతూ, సాగునీటి పారుదల వ్యవస్థను మరింత సమర్థంగా తీర్చిదిద్దేలా సమగ్ర ప్రణాళిక రూపొందిస్తున్నాం’ అని మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు

గోదావరి డెల్టా ఆధునికీకరణకు సమగ్ర ప్రణాళిక
nimmala

  • శాశ్వత ముంపు పరిష్కారానికి లైడార్‌ సర్వేతో డీపీఆర్‌

  • కాలువలు, డ్రెయిన్లు, బండ్‌లు, లాకులపైనా దృష్టి: మంత్రి నిమ్మల

  • ఇరిగేషన్‌ ఉన్నతాధికారులతో విజయవాడలో సమీక్ష

అమరావతి, అక్టోబరు 7(ఆంధ్రజ్యోతి): ‘గోదావరి డెల్టాలో ముంపు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతూ, సాగునీటి పారుదల వ్యవస్థను మరింత సమర్థంగా తీర్చిదిద్దేలా సమగ్ర ప్రణాళిక రూపొందిస్తున్నాం’ అని మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. ఇందుకోసం రూ.13.4 కోట్ల వ్యయంతో నిర్వహించిన లైడార్‌ సర్వే ఆధారంగా డీపీఆర్‌ను సిద్ధం చేస్తున్నట్లు చెప్పారు. బుధవారం విజయవాడలోని ఇరిగేషన్‌ క్యాంపు కార్యాలయంలో గోదావరి డెల్టా ఆధునికీకరణపై ఆ శాఖ ఉన్నతాధికారులతో మంత్రి సమీక్షించారు. ఇరిగేషన్‌ సలహాదారు వెంకటేశ్వరరావు, గోదావరి డెల్టా చీఫ్‌ ఇంజనీర్‌, సూపరింటెండింగ్‌ ఇంజనీర్‌, ఐఐఎస్‌సీ టెక్నాలజీస్‌ ప్రతినిధులు పాల్గొన్నారు. ‘గోదావరి డెల్టా ఆధునికీకరణలో భాగంగా ఇప్పటికే ఈస్ట్రన్‌ డెల్టాకు రూ.1,137 కోట్లు, సెంట్రల్‌ డెల్టాకు రూ.1,268 కోట్లతో ప్రతిపాదనలు తయారు చేశాం. సంబంధిత ఏజెన్సీ ప్రతినిధులు వెస్ట్రన్‌ డెల్టాకు సంబంధించిన అంచనాలనూ త్వరితగతిన సిద్ధం చేయాలి. పూడికతో నీటి ప్రవాహానికి ఆటంకంగా మారిన సీ-మౌత్‌ల వద్ద డ్రెడ్జింగ్‌ పనులకు సమగ్ర ప్రణాళిక రూపొందించాలి. గోదావరి దిగువ ప్రాంతాల్లో సముద్రంలో కలిసే డ్రెయిన్లలో పేరుకుపోయిన పూడికను తొలగించడంపైనా ప్రత్యేక దృష్టి పెట్టాలి. బ్రిటిష్‌ కాలంలో నిర్మించిన పాత లాకులు, అవుట్‌ఫాల్‌ స్లూయిజ్‌లలో శిథిలావస్థకు చేరుకున్న వాటికి మరమ్మతులు, కొత్త నిర్మాణాలు చేపట్టాలి. ప్రతిపాదనలు, డీపీఆర్‌లు సిద్ధం చేసే సమయంలో స్థానిక సాగు నీటి సంఘాల ప్రతినిధులు, ప్రజాప్రతినిధుల ఆలోచనలనూ పరిగణనలోకి తీసుకోవాలి. సాంకేతిక సమాచారంతో సమన్వయం చేసి సమగ్ర డీపీఆర్‌లు రూపొందించాలి. వాటిని సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లి, నిధులు మంజూరుకు చర్యలు తీసుకుంటాం’ అని మంత్రి నిమ్మల పేర్కొన్నారు.

Updated Date - Oct 08 , 2026 | 05:23 AM