Share News

ఏకాభిప్రాయం కుదిరాకే.. గోదావరి-కావేరిపై ముందుకు!

ABN , Publish Date - Jul 16 , 2026 | 05:25 AM

గత నెలలో తుంగభద్ర డ్యాం గేట్ల ప్రారంభోత్సవ సమయంలో ఆంధ్రప్రదేశ్‌, కర్ణాటక, తెలంగాణ ముఖ్యమంత్రులు చంద్రబాబు, డీకే శివకుమార్‌, రేవంత్‌రెడ్డి మధ్య జరిగిన చర్చల్లో భాగంగా..

ఏకాభిప్రాయం కుదిరాకే.. గోదావరి-కావేరిపై ముందుకు!

  • ఏపీకి కేంద్ర జలశక్తి మంత్రి స్పష్టీకరణ

  • నదుల అనుసంధానంపై రాష్ట్రాలతో వీడియో కాన్ఫరెన్స్‌

అమరావతి, జూలై 15 (ఆంధ్రజ్యోతి): గత నెలలో తుంగభద్ర డ్యాం గేట్ల ప్రారంభోత్సవ సమయంలో ఆంధ్రప్రదేశ్‌, కర్ణాటక, తెలంగాణ ముఖ్యమంత్రులు చంద్రబాబు, డీకే శివకుమార్‌, రేవంత్‌రెడ్డి మధ్య జరిగిన చర్చల్లో భాగంగా సంప్రదింపుల్లో ఏకాభిప్రాయం కుదిరాకే గోదావరి-కావేరి అనుసంధానంపై ముందుకు వెళ్తామని కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్‌ పాటిల్‌ స్పష్టం చేశారు. నదుల అనుసంధాన ప్రక్రియపై బుధవారం ఆయన నేతృత్వంలో జాతీయ జల అభివృద్ధి సంస్థ (ఎన్‌డబ్ల్యూడీఏ) సమావేశం వీడియో కాన్ఫరెన్సింగ్‌ విధానంలో జరిగింది. ఈ భేటీలో ఎన్‌డబ్ల్యూడీఏ చైర్మన్‌ బాలేశ్వర్‌ ఠాకూర్‌, ఆంధ్ర తరఫున జలవనరుల శాఖ ఈఎన్‌సీ నరసింహమూర్తి, సలహాదారు ఎం.వెంకటేశ్వరరావు, కర్ణాటక, పుదుచ్చేరి, తమిళనాడు అధికారులు పాల్గొన్నారు. పోలవరం-బనకచర్ల ప్రాజెక్టు ద్వారా గోదావరి-కావేరి అనుసంధాన ప్రక్రియ చేపట్టాలని నరసింహమూర్తి సూచిస్తుండగా.. కేంద్ర మంత్రి జోక్యం చేసుకున్నారు. మూడు రాష్ట్రాల నడుమ ఏకాభిప్రాయం కుదిరాకే.. ఈ అనుసంధాన పథకంపై అడుగులు ముందుకు వేద్దామని చెప్పారు. అనుసంధాన ప్రక్రియలో భాగంగా తమిళనాడు, పుదుచ్చేరిలకు చెరో 45 టీఎంసీలు కేటాయించి.. తమకు 16 టీఎంసీలు మాత్రమే ఇస్తాననడంపై కర్ణాటక అభ్యంతరం వ్యక్తం చేసింది. తమిళనాడు, పుదుచ్చేరి మాత్రం గోదావరి-కావేరి అనుసంధాన ప్రక్రియను స్వాగతించాయి.

Updated Date - Jul 16 , 2026 | 05:26 AM