రేపటి గోదావరి బోర్డు భేటీ వాయిదా
ABN , Publish Date - Aug 17 , 2026 | 04:20 AM
గోదావరి నదీ యాజమాన్య బోర్డు (జీఆర్‌ఎంబీ) సమావేశం ఊహించినట్లుగానే వాయిదా పడింది. కేంద్ర జల సంఘం ఆధ్వర్యంలోని సాంకేతిక సలహా కమిటీ (టీఏసీ) ఇచ్చిన క్లియరెన్సులకు..
అమరావతి, ఆగస్టు 16(ఆంధ్రజ్యోతి): గోదావరి నదీ యాజమాన్య బోర్డు (జీఆర్‌ఎంబీ) సమావేశం ఊహించినట్లుగానే వాయిదా పడింది. కేంద్ర జల సంఘం ఆధ్వర్యంలోని సాంకేతిక సలహా కమిటీ (టీఏసీ) ఇచ్చిన క్లియరెన్సులకు భిన్నంగా గోదావరి నదిపై అనుమతుల్లేకుండా తెలంగాణ చేపడుతున్న ప్రాజెక్టులపై మంగళవారం (ఈనెల 18 తేదీ)నాటి చర్చల అజెండాలో చేర్చాలని ఆంధ్రప్రదేశ్ పట్టుబట్టింది. ప్రధానంగా గోదావరి నదిపై సీతారామ ఎత్తిపోతల, తుపాకులగూడెం వద్ద సమ్మక్క సాగర్ ప్రాజెక్టు, కాళేశ్వరం ఎత్తిపోతల నుంచి అదనంగా ఇంకో టీఎంసీ జలాలను వినియోగించుకునేందుకు తెలంగాణ చేస్తున్న ప్రయత్నాలు, తుమ్మిడిహట్టి బ్యారేజీ ద్వారా 20 టీఎంసీల నుంచి 80 టీఎంసీలు, వార్థా ప్రాజెక్టు ద్వారా 20 టీఎంసీలు తరలించుకునేందుకు ఆ రాష్ట్రం చేస్తున్న ప్రయత్నాలపైనా భేటీలో చర్చించాలని స్పష్టం చేసింది. దరిమిలా చర్చల అజెండాలో ఈ ప్రాజెక్టులను గోదావరి బోర్డు చేర్చింది. దీనిపై తెలంగాణ అభ్యంతరం వ్యక్తం చేసింది. తాము చేపట్టిన ప్రాజెక్టులపై చర్చించే అధికారం జీఆర్‌ఎంబీకి లేదని వాదించింది. దీంతో బోర్డు ఏకంగాసమావేశాన్నే వాయిదా వేసుకుంది.