పశువులకూ ముఖ ఆధారిత గుర్తింపు!
ABN , Publish Date - Feb 17 , 2026 | 04:24 AM
మనుషులకు ఆధార్ నంబరు, ఫింగర్ ప్రింట్, కంటి ఐరిస్ ఉన్నట్లే.. పశువులకూ ముఖ ఆధారిత (ముక్కు మీద చర్మం ముడతల ఆధారంగా) గుర్తింపు సంఖ్య ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది.
ముక్కు మీద చర్మం ముడతల వివరాల నమోదు
అక్రమంగా రవాణా అయ్యేవాటిని గుర్తించే అవకాశం
అమరావతి, ఫిబ్రవరి 16(ఆంధ్రజ్యోతి): మనుషులకు ఆధార్ నంబరు, ఫింగర్ ప్రింట్, కంటి ఐరిస్ ఉన్నట్లే.. పశువులకూ ముఖ ఆధారిత (ముక్కు మీద చర్మం ముడతల ఆధారంగా) గుర్తింపు సంఖ్య ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ’గో-ఆధార్’ పేరుతో తిరుపతి జిల్లాలో ప్రయోగాత్మకంగా ఈ ప్రక్రియను పశుసంవర్ధక శాఖ ఇప్పటికే చేపట్టింది. ఆ జిల్లాలో దాదాపు 4లక్షల పశువులు ఉండగా, 1.02 లక్షల పశువులకు ముఖ ఆధారిత గుర్తింపును నమోదు చేశారు. అక్కడ ఈ విధానం సక్సెస్ కావడంతో ఈ ఏడాది రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇదే విషయాన్ని 2026-27 వ్యవసాయ బడ్జెట్ ప్రసంగంలో మంత్రి అచ్చెన్నాయుడు వెల్లడించారు. రాష్ట్రంలో దాదాపు కోటి పశువులు ఉండగా, ప్రతి పశువుకు ముఖ ఆధారిత గుర్తింపు నమోదు చేయనున్నట్లు పశుసంవర్ధక శాఖ డైరెక్టర్ దామోదర్‌నాయుడు ‘ఆంధ్రజ్యోతి’కి తెలిపారు. మనుషుల మాదిరిగానే ఏ పశువుకైనా ముక్కు మీద చర్మపు ముడతలు ఒకేలా ఉండవని చెప్పారు. గతంలో పశువుల చెవులకు వేసే ట్యాగ్ నంబరునే పశువుకు ఆధార్‌గా పరిగణించారు. అయితే అక్రమ రవాణా సమయంలో ట్యాగ్‌ను పీకేస్తున్నారు. దీనివల్ల అక్రమ రవాణా జరిగే పశువుల్ని పట్టుకున్నా.. ఏ పశువు ఎవరిదో గుర్తించడం కష్టంగా ఉంటోంది. ముఖ ఆధారిత గుర్తింపు వల్ల పశువుని గుర్తించడం చాలా తేలికని అంటున్నారు. ఈ విధానాన్ని త్వరలో కుప్పంలోనూ ప్రవేశపెట్టడానికి పశు సంవర్ధక శాఖ చర్యలు తీసుకుంటోంది. ఇదే విధానాన్ని పశుసంవర్ధక శాఖ సహకారంతో ప్రయోగాత్మకంగా అమలు చేయడానికి ప్రముఖ బీమా కంపెనీ కూడా ముందుకొచ్చిందని అధికారులు తెలిపారు.