Share News

ఈ-గవర్నెన్స్‌పై ఏపీ సహకారం తీసుకుంటాం

ABN , Publish Date - Feb 23 , 2026 | 05:00 AM

ఈ-గవర్నెన్స్‌ను ఆంధ్రప్రదేశ్‌ ఉపయోగించుకుంటున్న తీరు అద్భుతమని, ఈ విషయంలో ఏపీ ప్రభుత్వ సహకారం తీసుకోవడంతో..

ఈ-గవర్నెన్స్‌పై ఏపీ సహకారం తీసుకుంటాం

  • అధ్యయనానికి రాష్ట్రానికి బృందాన్ని పంపిస్తాం

  • బాపట్ల కలెక్టర్‌తో గోవా ముఖ్యమంత్రి ప్రమోద్‌ సావంత్‌

బాపట్ల, ఫిబ్రవరి 22 (ఆంధ్రజ్యోతి) : ఈ-గవర్నెన్స్‌ను ఆంధ్రప్రదేశ్‌ ఉపయోగించుకుంటున్న తీరు అద్భుతమని, ఈ విషయంలో ఏపీ ప్రభుత్వ సహకారం తీసుకోవడంతో పాటు అధ్యయనం కోసం త్వరలోనే ఓ అధికారిక బృందాన్ని పంపిస్తామని గోవా ముఖ్యమంత్రి ప్రమోద్‌సావంత్‌ తెలిపారు. టూరిజం పాలసీ కసరత్తులో భాగంగా గోవా పర్యటనలో ఉన్న బాపట్ల జిల్లా కలెక్టర్‌ వినోద్‌కుమార్‌ సారథ్యంలోని బృందం గోవా ముఖ్యమంత్రిని శనివారం మర్యాద పూర్వకంగా కలిసింది. ఈ సందర్భంగా తమ పర్యటనకు సహకరించినందుకు ఏపీ ప్రభుత్వం తరపున కలెక్టర్‌ గోవా ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపారు. పర్యాటకంపై ఏపీ ప్రభుత్వం రూపొందించిన కాఫీటేబుల్‌ బుక్‌ను అందజేశారు. ఆతిథ్య రంగ అభివృద్ధికి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చేస్తున్న కృషిని గోవా సీఎం అభినందించారు. టూరిజం పాలసీలకు సంబంధించి పలు కీలక సూచనలను అందించారు. తీర ప్రాంతంలో సీఆర్‌జడ్‌ నిబంధనల అమలు విషయంలో పక్కాగా వ్యవహరించాలని, లేకుంటే భవిష్యత్‌లో న్యాయపరమైన చిక్కులు వచ్చే అవకాశం ఉందని సీఎం కలెక్టెర్‌కు సూచించారు. గోవా ముఖ్యమంత్రిని శాలువాతో సత్కరించి వేంకటేశ్వరస్వామి ప్రతిమను జ్ఞాపికగా కలెక్టర్‌ అందించారు.

Updated Date - Feb 23 , 2026 | 05:01 AM