నిజాలు కప్పిపుచ్చి వైసీపీ అబద్ధాలు
ABN , Publish Date - Jul 20 , 2026 | 03:56 AM
వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు గిరిజనులకు ఎంతో ప్రయోజనం చేకూర్చామని ఆ పార్టీ నేతలు చేస్తున్న ప్రకటనల్లో డొల్లతనాన్ని టీడీపీ నేతలు బట్టబయలు చేశారు.
గిరిజనుల హక్కులను కాలరాసింది ఆ పార్టీయే
టీచర్ పోస్టుల విషయంలో జీవో 3ని తుంగలో తొక్కింది
దాని అమలు కోసం 2020లో నాటి సీఎం జగన్‌కు చంద్రబాబు లేఖ
టీడీపీ నేతల స్పష్టీకరణ
అమరావతి, జూలై 19 (ఆంధ్రజ్యోతి): వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు గిరిజనులకు ఎంతో ప్రయోజనం చేకూర్చామని ఆ పార్టీ నేతలు చేస్తున్న ప్రకటనల్లో డొల్లతనాన్ని టీడీపీ నేతలు బట్టబయలు చేశారు. గిరిజన ప్రాంతాల్లోని పాఠశాలల్లో ఉపాధ్యాయ పోస్టులను ఎస్టీలతోనే భర్తీ చేయాలన్న నిర్ణయం తమదేనంటూ వైసీపీ సొంత మీడియా, సోషల్ మీడియాలో చేస్తున్న ప్రచారం బూటకమేనని వారు మండిపడుతున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో అప్పటి సీఎం చంద్రబాబు ఈ జీవో తీసుకొచ్చారని.. దానిని జగన్ ప్రభుత్వం పక్కనపడేసిందని గుర్తుచేస్తున్నారు. 2020లో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు గిరిజనుల హక్కులను ఎలా కాలరాసిందో వివరిస్తూ నాటి ప్రతిపక్ష నేత చంద్రబాబు అప్పటి సీఎం జగన్‌కు రాసిన లేఖను టీడీపీ ఆదివారం విడుదల చేసింది. గిరిజన హక్కుల రక్షణలో వైసీపీ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లోపించిందని ఆ ఏడాది జూన్ 19న ఈ లేఖ రాశారు. ‘టీడీపీ ప్రభుత్వం 2000లో జీవో 3ని తీసుకొచ్చింది. దాని ద్వారా ఉమ్మడి ఏపీలోని షెడ్యూల్ ప్రాంతాల్లో ఉన్న పాఠశాలల్లో అన్ని ఉపాధ్యాయ పోస్టులను ఎస్టీ అభ్యర్థులతోనే భర్తీ చేయాలని వారిలో 33 శాతం మహిళలు ఉండాలని నిర్దేశించింది. వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ జీవోను తుంగలో తొక్కారు. ఇది గిరిజనుల అభివృద్ధిపై తిరోగమన ప్రభావం చూపుతుంది’ అని చంద్రబాబు అందులో పేర్కొన్నారు. తక్షణం జీవో 3ని అమలు చేసేందుకు తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. రికార్డుల్లో ఉన్న ఈ వాస్తవాలను కప్పిపుచ్చి వైసీపీ నేతలు తాము గిరిజనోద్ధారకుల్లా ప్రకటనలు చేయడం దారుణమని టీడీపీ నేతలు పేర్కొంటున్నారు.