బాలికలదే పైచేయి
ABN , Publish Date - Apr 30 , 2026 | 11:47 PM
పదో తరగతి ఫలితాలు గురువారం వెలువడగా బాలికలదే హవా కొనసాగింది. విద్యారంగంలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన మార్పులతో సత్ఫలితాలు వెలువడ్డాయి.
పది ఫలితాల్లో జిల్లాలో 84.73శాతం ఉత్తీర్ణత
బాలికలు 87.5 ఉత్తీర్ణత శాతం
82.18 శాతం ఉత్తీర్ణత సాధించిన బాలురు
రాష్ట్రస్థాయిలో 19వ స్థానంలో జిల్లా
నంద్యాల ఎడ్యుకేషన, ఏప్రిల్ 30 (ఆంధ్రజ్యోతి): పదో తరగతి ఫలితాలు గురువారం వెలువడగా బాలికలదే హవా కొనసాగింది. విద్యారంగంలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన మార్పులతో సత్ఫలితాలు వెలువడ్డాయి. కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాల్లో కూడా మెరుగైన ఫలితాలు సాధించారు. జిల్లాలో 24,529 మంది విద్యార్థులు పది పరీక్షలు రాయగా అందులో 20,784 మంది విద్యార్థులు పరీక్షల్లో ఉత్తీర్ణులై 84.73 శాతం సాధించారు. అందులో 12,754 మంది బాలురు పరీక్షలు రాయగా 10,481 మంది ఉత్తీర్ణులై 82.18 శాతం ఫలితాలను సాధించారు. 11,775 మంది బాలికలు పరీక్షలు రాయగా 10,303 మంది ఉత్తీర్ణులై 87.5 శాతం ఫలితాన్ని పొందారు. దీంతో బాలికలదే హవా కొనసాగింది. గత ఏడాది 81.85 ఉత్తీర్ణతతో 17వ స్థానంలో ఉన్న జిల్లా నేడు 84.73 శాతం ఉత్తీర్ణతతో 19వ స్థానానికి చేరుకుంది. గత ఏడాది కంటే ఈ ఏడాది ఉత్తీర్ణతా శాతం పెరిగినా విద్యార్థుల సంఖ్య, ఫలితాల ఆధారంగా 19వ స్థానానికి పడిపోయింది.
వంద శాతం ఫలితాలు సాధించిన బీసీ వెల్ఫేర్ పాఠశాలలు
నంద్యాల జిల్లాలో ఆరు బీసీ వెల్ఫేర్ రెసిడెన్సియల్ పాఠశాలలుండగా 474 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా అందరూ ఉత్తీర్ణులయ్యారు. జిల్లాలో వందకు వంద శాతం ఫలితాలు సాధించి రికార్డు సృష్టించారు. సాయి శ్రీ 596 మార్కులు, రీతాసాహితి 593 మార్కులు, యశస్వినీ 589 మార్కులతో జిల్లాలోనే ప్రభుత్వ పాఠశాలల్లో టాపర్‌లుగా నిలిచారు. జిల్లాలోని 16 ఎయిడెడ్ పాఠశాలల్లో 604 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా 426 మంది ఉత్తీర్ణులై 70.53శాతం ఫలితాలను సాధించారు. 12 ప్రభుత్వ ఉన్నత పాఠశాలలకు చెందిన 1322 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా 824 మంది ఉత్తీర్ణులై 62.33 శాతం ఫలితాన్ని సాధించారు. జిల్లాలో ఐదు ప్రభుత్వ ఆశ్రమ పాఠశాలల్లో 97 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా 75మంది ఉత్తీర్ణులై 65.79శాతం ఫలితాన్ని రాబట్టారు. 27 కేజీబీవీల్లో 1038 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా 936 మంది బాలికలు ఉత్తీర్ణులై 90.17శాతం ఫలితాలను సాధించారు. 210 మున్సిపల్ పాఠశాలల్లో 374 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా 233 మంది ఉత్తీర్ణులై 62.30శాతం ఫలితాన్ని సాధించారు. 20 ఏపీ మోడల్‌స్కూల్స్‌లో 1775 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా 1600 మంది ఉత్తీర్ణులై 90.14శాతం ఫలితాలను సాధించారు. ఆరు సోషల్ వెల్ఫేర్ పాఠశాలల్లో 462 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా 435 మంది ఉత్తీర్ణులై 94.16శాతం ఫలితాన్ని సాధించారు. ఏడు ట్రైబెల్ వెల్ఫేర్ పాఠశాలల్లో 232 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా 183 మంది విద్యార్థులు ఉత్తీర్ణులై 78.88శాతం ఫలితాన్ని రాబట్టారు. 181 జిల్లా పరిషత ఉన్నత పాఠశాలల్లో 9148 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా 6968 మంది విద్యార్థులు ఉత్తీర్ణులై 76.17శాతం, 172 ప్రైవేట్ పాఠశాలలకు చెందిన 9001 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా 8637 మంది ఉత్తీర్ణులై 95.96శాతం ఫలితాలను సాధించారు.
మెరుగ్గా ఫలితాలు
రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారాలోకేశ చొరవతో విద్యావ్యవస్థల్లో ఎన్నో సంస్కరణలు చేపట్టారు. అందుకు అనుగుణంగా ఫలితాలను అదేవిధంగా రాబట్టారు. ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో ఫలితాలు మెరుగుపడ్డాయి.