ఆగని ‘అక్షరం’!
ABN , Publish Date - Feb 24 , 2026 | 04:11 AM
‘అక్షరం’ ఆగిపోకూడదన్న తపన.. అండగా నిలిచిన ‘ఆంధ్రజ్యోతి’ కథనం.. ఒక విద్యార్థిని జీవితాన్నే మార్చేశాయి.
ఆ ‘చిన్నారి’ ఇంటరూ రాస్తోంది..
నాడు ‘ఆంధ్రజ్యోతి’ కథనానికి స్పందించిన విద్యా మంత్రి
పదో తరగతి పరీక్షలు రాసేలా చర్యలు తీసుకున్న లోకేశ్
కోసిగి, ఫిబ్రవరి 23(ఆంధ్రజ్యోతి): ‘అక్షరం’ ఆగిపోకూడదన్న తపన.. అండగా నిలిచిన ‘ఆంధ్రజ్యోతి’ కథనం.. ఒక విద్యార్థిని జీవితాన్నే మార్చేశాయి. గతేడాది 10వ తరగతి పబ్లిక్ పరీక్షల సమయంలో కర్నూలు జిల్లా కోసిగి మండలం చింతకుంట గ్రామానికి చెందిన చిన్నారి అనే విద్యార్థిని తల్లిదండ్రులతో గుంటూరు జిల్లాకు వలస వెళ్లి మిర్చి పొలంలో కూలీగా మారాల్సి వచ్చింది. ఆమె స్థితిపై ‘ఆంధ్రజ్యోతి’ నాడు ‘పరీక్ష హాలులో కాదు.. మిర్చి పొలంలో’ అన్న శీర్షికతో ఓ కథనం ప్రచురించింది. దీనికి మంత్రి లోకేశ్ స్పందించి చిన్నారిని తిరిగి సొంత గ్రామానికి తీసుకువచ్చి పరీక్షలు రాసేలా చర్యలు తీసుకున్నారు. పదో తరగతి పాసైన అనంతరం చిన్నారి కోసిగి మోడల్ స్కూల్‌లో ఇంటర్ బైపీసీలో చేరింది. సోమవారం జరిగిన మొదటి సంవత్సరం తెలుగు పరీక్ష రాసింది. ఈ సందర్భంగా చిన్నారి ఆనందం వ్యక్తం చేస్తూ.. తాను తిరిగి చదువుకుంటానని అనుకోలేదని, ‘ఆంధ్రజ్యోతి’కి రుణపడి ఉంటానని భావోద్వేగానికి గురైంది. నాడు సహకరించిన మంత్రి లోకేశ్, అధికారులకు కృతజ్ఞతలు తెలిపింది.