బందరు తీరానికి జెయింట్ డ్రెడ్జర్!
ABN , Publish Date - Feb 05 , 2026 | 12:27 AM
బందరు పోర్టు డ్రెడ్జింగ్ పనుల్లో కీలక ముందడుగు పడనుంది. నత్తనడకన సాగుతున్న పనులను పరుగులు పెట్టించడానికి నెదర్లాండ్స్ నుంచి జెయింట్ డ్రెడ్జర్‌ను తీసుకొచ్చేందుకు కాంట్రాక్టు సంస్థ కేంద్ర ప్రభుత్వానికి దరఖాస్తు చేసింది. విదేశీ ఫ్లాగ్‌తో కూడిన షిప్ కమ్ డ్రెడ్జర్ బందరు తీరానికి చేరాలంటే కేంద్ర హోంమంత్రిత్వశాఖ, విదేశాంగ మంత్రిత్వశాఖల అనుమతి అవసరం. కాంట్రాక్టు సంస్థ ఇచ్చిన ప్రతిపాదనను కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తోంది. అనుమతులు ఇవ్వటమే ఆలస్యం. ఈ జెయింట్ డ్రెడ్జర్ (టీఎస్‌హెచ్‌డీ) కనుక బందరు తీరానికి వస్తే శరవేగంగా డ్రెడ్జింగ్ పనులను చేపట్టడానికి వీలు కలుగుతుంది.
- బందరు పోర్టు పనుల్లో కీలక ముందడుగు
- నెదర్లాండ్ దేశం నుంచి జెయింట్ డ్రెడ్జర్ తెప్పించేందుకు సన్నాహాలు
- అనుమతి కోసం కేంద్ర ప్రభుత్వానికి దరఖాస్తు చేసిన కాంట్రాక్టు సంస్థ
- ప్రస్తుతం దేశీయంగా ఐదు చిన్న డ్రెడ్జర్లతో జరుగుతున్న పని
- ఇవీ నెలకు 25 వేల క్యూబిక్ మీటర్ల ఇసుక తోడేందుకు పరిమితం
- జెయింట్ డ్రెడ్జర్ అయితే నెలకు లక్ష క్యూబిక్ మీటర్ల ఇసుక డ్రెడ్జింగ్
బందరు పోర్టు డ్రెడ్జింగ్ పనుల్లో కీలక ముందడుగు పడనుంది. నత్తనడకన సాగుతున్న పనులను పరుగులు పెట్టించడానికి నెదర్లాండ్స్ నుంచి జెయింట్ డ్రెడ్జర్‌ను తీసుకొచ్చేందుకు కాంట్రాక్టు సంస్థ కేంద్ర ప్రభుత్వానికి దరఖాస్తు చేసింది. విదేశీ ఫ్లాగ్‌తో కూడిన షిప్ కమ్ డ్రెడ్జర్ బందరు తీరానికి చేరాలంటే కేంద్ర హోంమంత్రిత్వశాఖ, విదేశాంగ మంత్రిత్వశాఖల అనుమతి అవసరం. కాంట్రాక్టు సంస్థ ఇచ్చిన ప్రతిపాదనను కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తోంది. అనుమతులు ఇవ్వటమే ఆలస్యం. ఈ జెయింట్ డ్రెడ్జర్ (టీఎస్‌హెచ్‌డీ) కనుక బందరు తీరానికి వస్తే శరవేగంగా డ్రెడ్జింగ్ పనులను చేపట్టడానికి వీలు కలుగుతుంది.
(ఆంధ్రజ్యోతి, విజయవాడ):
బందరు పోర్టు నిర్మాణానికి సంబంధించి సౌత వాటర్ బ్రేక్స్, నార్త్ వాటర్ బ్రేక్స్ పనులు దాదాపుగా పూర్తయ్యాయి. తుది దశలో ఉన్నాయి. భవనాల నిర్మాణానికి సంబంధించి డీ వాటరింగ్ పనులు పూర్తయ్యాయి. నిర్మాణాల పనులు జరుగుతున్నాయి. ఇవన్నీ ఒక ఎత్తు అయితే ప్రాజెక్టు వ్యయంలో 1/3 పనులు డ్రెడ్జింగ్‌తో కూడుకున్నవి ఉన్నాయి. దాదాపుగా రూ. 1200 కోట్ల వ్యయంతో డ్రెడ్జింగ్ పనులు చేపట్టాల్సి ఉంది. బందరు పోర్టు పనులు ప్రస్తుతానికి 51 శాతం మేర పూర్తయ్యాయి. మరో 49 శాతం పనులు పూర్తి కావాల్సి ఉంది. ఎట్టి పరిస్థితుల్లో ఈ ఏడాది డిసెంబరు నాటికి బందరు పోర్టు పనులు పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం గడువును నిర్దేశించింది.
డ్రెడ్జింగ్ పనులే కీలకం
బందరు పోర్టు పనులలో కీలకమైన డ్రెడ్జింగ్ పనులలో తీవ్రంగా వెనుకబడిన పరిస్థితి ఉంది. భారీ షిప్పులు రావటానికి 16 - 17 మీటర్ల లోతున 5.6 కోట్ల క్యూబిక్ మీటర్ల మేర ఇసుకను డ్రెడ్జింగ్ చేయాల్సి ఉంది. డ్రెడ్జింగ్ పనులలో ఇప్పటి వరకు చూస్తే 25 శాతం మేర మాత్రమే జరిగింది. దేశీయంగా ఉన్న ఐదు చిన్న డ్రెడ్జర్ల ద్వారా ఇసుక తోడివేత పనులు జరుగుతున్నాయి. వీటి కెపాసిటీ చాలా తక్కువ. ఇవి ఐదు కూడా పనిచేసినా నెలకు ఒక్కోటి 5 వేల క్యూబిక్ మీటర్ల మేర మొత్తంగా 25 వేల క్యూబిక్ మీటర్ల కూడా డ్రెడ్జింగ్ చేయలేకపోతున్నాయి. దేశీయంగా ఉన్న ఐదు డ్రెడ్జర్లు కూడా ఇసుకను మరోచోటకు పైపులైన్ల ద్వారా పంపింగ్ చేస్తుంటాయి. పంపింగ్ చేసిన చోట నుంచి మళ్లీ ఆ ఇసుకను తరలించాల్సి ఉంటుంది. ఈ డ్రెడ్జింగ్ పనులు ఎంత త్వరగా పూర్తి చేస్తే.. అంత త్వరగా పనులు పూర్తవుతాయి. బందరు పోర్టుపై ఇటీవల సీఎం చంద్రబాబు సమీక్షించిన నేపథ్యంలో పోర్టు పనులను ఈ ఏడాదిలోనే పూర్తి చేయాలని నిర్దేశించారు. గడువు ఈ ఏడాది డిసెంబరుకు నిర్దేశించారు. దీంతో పనులను వేగవంతం చేయాలంటే.. డ్రెడ్జింగ్ పనులను స్పీడ్ పెంచాల్సిన అవసరం ఉంది. డ్రెడ్జింగ్ స్పీడ్ పెంచటానికి కాంట్రాక్టు సంస్థ నెదర్లాండ్స్ నుంచి జెయింట్ డ్రెడ్జర్‌ను బందరు తీరానికి తీసుకురావాలని నిర్ణయించింది. ప్రపంచంలోనే జెయింట్ డ్రెడ్జర్స్ (టీఎస్‌హెచ్‌డీ)లు నెదర్లాండ్ ్స, బెల్జియం దేశాలలో ఉంటాయి. నెదర్లాండ్స్‌లో నాలుగు ప్రముఖ కంపెనీలు ఉన్నాయి. వీటిలో ఏదో ఒక కంపెనీకి చెందిన డ్రెడ్జర్‌ను రప్పించాలని నిర్ణయించటం జరిగింది. విదేశాల నుంచి బందరు తీరానికి రావాలంటే.. కేంద్ర హోంమంత్రిత్వశాఖ అనుమతులు తప్పనిసరి. దీంతో కాంట్రాక్టు సంస్థ కేంద్ర హోం మంత్రిత్వశాఖకు అనుమతుల కోసం లేఖ రాయటం జరిగింది. ప్రస్తుతం ఈ లేఖ కేంద్ర పరిశీలనలో ఉంది. మరికొద్ది రోజులలో అనుమతులు వచ్చే అవకాశం ఉంది.
ప్రయోజనాలు ఇవే..
ఇది అత్యంత భారీగా, చాలా పొడవున ఉంటుంది. షిప్ కమ్ డ్రెడ్జర్ ఇది. నెదర్లాండ్స్ నుంచి సముద్ర మార్గాన బందరు తీరానికి వస్తుంది. నెలకు లక్ష క్యూబిక్ మీటర్ల ఇసుకను డ్రెడ్జింగ్ చేయగలదు. షిప్ కమ్ డ్రెడ్జర్‌లోనే భారీ ట్యాంక్ ఉంటుంది. డ్రెడ్జింగ్ చేసిన ఇసుకను అందులోనే నింపుకుంటుంది. ట్యాంక్ నిండిన తర్వాత సముద్రంలోనే మరో ప్రాంతానికి తీసుకు వెళ్లి అక్కడ డంప్ చేస్తుంది. సాధారణ డ్రెడ్జర్లు మూడు మీటర్ల మేర ఇసుకన ప్రొక్లెయినింగ్ చేసి డ్రెడ్జింగ్ చేస్తాయి. జెయింట్ డ్రెడ్జర్ అలా కాదు. నేరుగా డ్రెడ్జింగ్ చేస్తుంది. సముద్రంలో చాలా లోతుగా డ్రెడ్జింగ్ చేస్తుంది. బందరు పోర్టుకు 16 - 17 మీటర్ల వరకు డ్రెడ్జింగ్ చేస్తే సరిపోతుంది.