TTD EO Anil Kumar Singhal: బోర్డు నిర్ణయం మేరకే.. భోలేబాబా డెయిరీ నుంచి నెయ్యి
ABN , Publish Date - Jan 06 , 2026 | 04:42 AM
అప్పట్లో టీటీడీ పాలకమండలి తీసుకున్న నిర్ణయం మేరకే భోలేబాబా డెయిరీ నుంచి నెయ్యి కొనుగోలుకు ముందుకెళ్లాం.
పాలకమండలి చెప్పిందే అమలు చేశా
కల్తీ నెయ్యి కేసులో సింఘాల్ వాంగ్మూలం
అమరావతి, జనవరి 5(ఆంధ్రజ్యోతి): ‘‘అప్పట్లో టీటీడీ పాలకమండలి తీసుకున్న నిర్ణయం మేరకే భోలేబాబా డెయిరీ నుంచి నెయ్యి కొనుగోలుకు ముందుకెళ్లాం. ఈ విషయంలో నాపై వ్యక్తిగతంగా ఎవరూ ఒత్తిడి చేయలేదు.’’ అని టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ సీబీఐ ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) అధికారులకు స్పష్టం చేసినట్లు తెలిసింది. జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆయన బాబాయి వైవీ సుబ్బారెడ్డి టీటీడీ చైర్మన్‌గా ఉన్నారు. అప్పట్లో పాలకమండలి తీసుకున్న నిర్ణయం మేరకు లడ్డూ తయారీ సహా ఇతర అవసరాలకు భోలేబాబా డెయిరీ నుంచి నెయ్యి కొనుగోలు చేశారు. అయితే ఇది కల్తీదని తేలడంతో ఈ వ్యవహారంపై అప్పటి ఈవో(ప్రస్తుతం కూడా) సింఘాల్‌ను సిట్ అధికారులు రెండు రోజుల కిందట ప్రశ్నించారు. లీటరు పాలు కూడా కొనుగోలు చేయని భోలేబాబా డెయిరీకి కోట్ల కిలోల నెయ్యి సరఫరా టెండర్లు ఎలా ఇచ్చారని ప్రశ్నించగా.. అప్పట్లో బోర్డు నిర్ణయం తీసుకుందని, తాను ఎగ్జిక్యూటివ్ అధికారిగా ఆ నిర్ణయాన్ని అమలు చేశానని చెప్పినట్లు తెలిసింది. సింఘాల్‌తో పాటు మరో ముగ్గురిని ప్రశ్నించిన అధికారులు.. వారి వాంగ్మూలాలను రికార్డు చేశారు.