Minister Durgesh: మన వారసత్వ సంపద.. గండికోట
ABN , Publish Date - Jan 12 , 2026 | 07:21 AM
గండికోట చారిత్రాత్మక కట్టడం.. మన వారసత్వ సంపద. సుందరమైన ప్రకృతి సోయగం గండికోట సొంతం.. మత సామరస్యానికి ప్రతీక అని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేశ్ అన్నారు.
78 కోట్లతో మరింత అభివృద్ధి: మంత్రి దుర్గేశ్
ఘనంగా ఉత్సవాలు ప్రారంభం
కడప, జనవరి 11(ఆంధ్రజ్యోతి): ‘గండికోట చారిత్రాత్మక కట్టడం.. మన వారసత్వ సంపద. సుందరమైన ప్రకృతి సోయగం గండికోట సొంతం.. మత సామరస్యానికి ప్రతీక’ అని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేశ్ అన్నారు. మూడు రోజుల పాటు జరిగే గండికోట ఉత్సవాలు ఆదివారం సాయంత్రం అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. ముఖ్యఅతిథిగా హాజరైన మంత్రి దుర్గేశ్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం రూ.78 కోట్ల నిధులతో గండికోటను అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు. పరిశ్రమలకిచ్చే రాయితీలను పర్యాటకరంగానికి ఇస్తుండడంతో ఇక్కడ త్వరలోనే ఒబెరాయ్ హోటల్ నిర్మాణం జరుగుతుందన్నారు. యునెస్కో సహకారంతో గండికోటను వారసత్వ సంపదగా గుర్తించేందుకు కృషి చేస్తున్నామని, పర్యాటక ప్రాంతాలను తిలకించే వారికి అవసరమైన అన్ని సదుపాయాలను, వసతులు కల్పిస్తున్నామని తెలిపారు. బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత మాట్లాడుతూ ప్రభుత్వం పర్యాటక రంగానికి అధిక ప్రాధాన్యమిస్తోందని, గండికోట ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. సీమ వంటకాలను, స్టాల్స్‌ను ఏర్పాటు చేశారు. సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. హెలికాప్టర్ విహారం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. పారాచ్యూట్ ఏర్పాటు చేశారు. మంత్రులు కందుల దుర్గేశ్, సవిత, ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి, కలెక్టర్ చెరుకూరి శ్రీధర్, టీడీపీ నేత భూపేశ్‌రెడ్డి హెలికాప్టర్ ద్వారా గండికోట అందాలను వీక్షించారు. గండికోట సాంస్కృతిక, చారిత్రక కళా వైభవం ఉట్టిపడేలా సాయంత్రం కన్నుల పండువగా శోభాయాత్ర జరిగింది. గాయని మంగ్లీ తన గీతాలతో పర్యాటకులను ఉర్రూతలూగించారు.