Melioidosis Fever: ‘మెలియోయిడోసిస్’లో జన్యు మార్పులు!
ABN , Publish Date - Jan 15 , 2026 | 03:24 AM
ఇటీవల గుంటూరు నగర శివార్లలోని తురకపాలెంలో వెలుగుచూసిన మెలియోయిడోసిస్ జ్వరాలకు కారణమైన బర్కోల్డేరియా సూడోమలీ బ్యాక్టీరియాలో....
బ్యాక్టీరియాలోని జెనెటిక్ కోడ్ మారినట్లు గుర్తింపు
జీనోమ్ సీక్వెన్సింగ్ పరీక్షల్లో బయటపడిన వైనం
తురకపాలెం కేసుల్లో మాత్రమే జన్యు రూపాంతరం
కీళ్ల నొప్పులు కలిగించే కొత్త లక్షణం బహిర్గతం
గుంటూరు మెడికల్, జనవరి 14 (ఆంధ్రజ్యోతి): ఇటీవల గుంటూరు నగర శివార్లలోని తురకపాలెంలో వెలుగుచూసిన మెలియోయిడోసిస్ జ్వరాలకు కారణమైన బర్కోల్డేరియా సూడోమలీ బ్యాక్టీరియాలో జన్యుమార్పులు (మ్యుటేషన్) చోటుచేసుకున్నాయని వైద్య పరిశోధనల్లో తేలింది. పలువురు రోగుల నుంచి సేకరించిన నమూనాలకు జీనోమ్ సీక్వెన్సింగ్ పరీక్షలు నిర్వహించగా.. బ్యాక్టీరియాలోని జెనెటిక్ కోడ్ (జీటీసీ 254టీ 55920) మారినట్లు గుర్తించారు. రూపాంతరం చెందిన ఈ బ్యాక్టీరియా రోగుల్లో మోకాళ్లు, మడమ నొప్పులకు కారణమవుతుందని గుర్తించారు. సాధాణంగా ఈ బ్యాక్టీరియా బాధితుల ఊపరితిత్తులపై దాడిచేయడం వల్ల విపరీతమైన దగ్గుతో పాటు నోటి వెంట రక్తం (హిమాప్టిసిస్) పడుతుంది. అయితే తురకపాలెం రోగుల్లో ఈ లక్షణాలు కనిపించలేదు. గతేడాది గుంటూరు నగర శివార్లలోని తురకపాలెంలో వెలుగుచూసిన మెలియోయిడోసిస్ జ్వరాలతో మూడు నెలల వ్యవధిలోనే గ్రామంలో 30 మంది మృతి చెందటం... అప్పట్లో తీవ్ర చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ యంత్రాంగం మూడు వారాల పాటు తురకపాలెంలో తిష్టవేసి గ్రామస్తులకు అన్ని రకాల పరీక్షలు నిర్వహించారు. చివరకు దీని వెనుక ఉన్న గుట్టును కనుగొన్నారు.
మారిన జెనెటిక్ కోడ్... వ్యాధి లక్షణాలు
గుంటూరుకు చెందిన అంటువ్యాధుల వైద్యనిపుణులు డాక్టర్ కే కల్యాణ్ చక్రవర్తి.. తురకపాలెంలో నలుగురు రోగుల మోకాళ్ల నుంచి సేకరించిన సైనోవియల్ ఫ్లూయిడ్‌ను జీనోమ్ సీక్వెన్సింగ్ పరీక్షల నిమిత్తం హైదరాబాద్‌కు పంపారు. అక్కడి నుంచి వచ్చిన ఫలితాలను అమెరికాకు చెందిన ఇఫ్సైటి అనే సంస్థ విశ్లేషించగా... సూడోమలీ బ్యాక్టీరియాలో మారిన కొత్త జెనెటిక్ కోడ్ వెలుగు చూసింది. అప్పట్లో వైద్యులు రోగుల నమూనాలు సేకరించి బ్లడ్ కల్చర్ పరీక్ష చేయించగా.. ఫలితాల్లో నెగె టివ్ రిపోర్ట్ వచ్చేది. దీంతో విభిన్నంగా ఆలోచించిన వైద్యులు మోకాళ్ల నుంచి సైనోవియల్ ఫ్లూయిడ్‌ను సేకరించి జీనోమ్ పరీక్షలు చేశారు. ఇందులో పాజిటివ్ రిపోర్ట్ వచ్చింది. దీన్ని ప్రామాణికంగా తీసుకొని సైనోవియల్ ఫ్లూయిడ్‌ను ఉపయోగించి పీసీఆర్ పరీక్షలు చేయగా.. మూడు గంటల్లోనే మెలియోయిడోసిస్ పాజిటివ్ రిపోర్ట్ రావడం విశేషం. మరోసారి ఈ శాంపిల్స్‌కు సంప్రదాయబద్దమైన కల్చర్ పరీక్షలు నిర్వహించగా.. మూడు రోజుల తర్వాత వెలువడిన ఫలితాల్లో సైతం మెలియోయిడోసిస్ ఫీవర్ పాజిటివ్ వచ్చింది. అయితే పల్నాడు జిల్లాకు చెందిన మెలియోయిడోసిస్ రోగి నుంచి సేకరించి చేసిన జీనోమ్ సీక్వెన్సింగ్ పరీక్షల్లో మాత్రం.. అక్కడి బ్యాక్టీరియాలో జన్యు రూపాంతరం కనిపించలేదు. ఊపిరితిత్తులపై దాడిచేసే బ్యాక్టీరియానే ఉన్నట్లు తేలింది. దీంతో తురకపాలెం గ్రామంలో మాత్రమే బ్యాక్టీరియా జెనెటిక్ కోడ్ మారినట్లు స్పష్టమైంది.
ఇకపై 3 గంటల్లోనే వ్యాధి నిర్ధారణ: డాక్టర్ కల్యాణ్ చక్రవర్తి
ఇకపై మెలియాయిడోసిస్ జ్వరాల నిర్ధారణ సులువుగా మారుతుందని అంటువ్యాధుల వైద్యనిపుణులు డాక్టర్ కే కల్యాణ్ చక్రవర్తి తెలిపారు. గురువారం ఆయన ‘ఆంధ్రజ్యోతి’తో మాట్లాడుతూ... జీనోమ్ సీక్వెన్సింగ్ పరీక్షల ద్వారా మారిన బ్యాక్టీరియా జెనెటిక్ కోడ్‌ను గుర్తించినట్లు చెప్పారు. ఇకపై రోగుల మోకాళ్ల నుంచి సేకరించిన సైనోవియల్ ఫ్లూయిడ్‌ను పీసీఆర్ పరీక్ష లు చేయిస్తే మూడు గంటల్లోనే కచ్చితమైన ఫలితాలు పొందవచ్చని ఆయన వెల్లడించారు. కీళ్ల నొప్పులు, మడమ నొప్పులు, జ్వరం, ఒంటిపై యాప్సిస్ ఉంటే మెలియోయిడోసి్‌సగా అనుమానించాలని కల్యాణ్ చక్రవర్తి ఆర్ధోపెడిక్ డాక్టర్లకు సూచించారు.