నగరానికి జీడీపీ నీరు
ABN , Publish Date - Sep 16 , 2026 | 11:29 PM
కర్నూలు నగరంలో తాగునీటి సమస్య తీవ్రమైంది. ఇరిగేషన అధికారులు బుధవారం నుంచి కర్నూలు నగరానికి రోజుకు 70 క్యూసెక్కుల ప్రకారం గాజులదిన్నె ప్రాజెక్టు ఎడమ కాలువ నుంచి నీరు విడుదల చేయడం ఆరంభించారు.
- కోడుమూరు, గోరంట్లకు కూడా
- మరో పది రోజుల్లో జీడీపీకి నిలిచిపోనున్న హంద్రీ నీవా నీరు
- జీడీపీ కింది తాగునీటి పథకాలకు ఇక్కట్లు తప్పవు
- జీడీపీలో కేవలం 1.5 టీఎంసీల నీరు మాత్రమే
గోనెగండ్ల, సెప్టెంబరు 16(ఆంధ్రజ్యోతి): కర్నూలు నగరంలో తాగునీటి సమస్య తీవ్రమైంది. ఇరిగేషన అధికారులు బుధవారం నుంచి కర్నూలు నగరానికి రోజుకు 70 క్యూసెక్కుల ప్రకారం గాజులదిన్నె ప్రాజెక్టు ఎడమ కాలువ నుంచి నీరు విడుదల చేయడం ఆరంభించారు. గాజులదిన్నె ప్రాజెక్టులో నీరు ఉన్నంత వరకు విడుదల చేస్తారని సమాచారం. జీడీపీ నుంచి విడుదల అయిన నీరు ఎల్లెల్సీ కాలువ 4/7 కర్నూలు బ్రాంచ కెనాల్ నుంచి ఉల్చాల వరకు వంకలో వెళ్లి అక్కడి నుంచి కేసీ కెనాల్‌లో కలిసి అక్కడి నుంచి నీటి ట్యాంకులకు జీడీపీ నీరు చేరనుంది. అలాగే కోడుమూరు, గోరంట్ల గ్రామాలకు కూడా రోజుకు 100 క్యూసెక్కుల ప్రకారం కుడి కాలువ నుంచి నీరు విడుదలవుతుంది. వచ్చే ఏడాది జూలై వరకు ఎల్‌నినో కొనసాగితే జీడీపీ కింద ఉన్న తాగునీటి పథకాలకు, ఇక ఈ ప్రాంతంలో ఉన్న గ్రామాలకు తాగునీటి ఇక్కట్లు తప్పవు.
మరో పది రోజులు మాత్రమే జీడీపీకి హంద్రీ నీవా నీరు:
హంద్రీ నీవా నీరు మరో పది రోజలు మాత్రమే గాజులదిన్నె ప్రాజెక్టుకు చేరనున్నట్లు తెలుస్తోంది. అటు తరువాత హంద్రీ నీవా నీటి విడుదల నిలిపోతున్నట్లు అధికారులు అనధికారికంగా తెలుపుతున్నారు. శ్రీశైలం డ్యామ్‌లో నీటి మట్టం రోజు రోజుకూ తగ్గి పోతుంది. ప్రస్తుతం శ్రీశైలం డ్యామ్‌లో 115 టీఎంసీలు ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ప్రతి రోజు 4 టీఎంసీ నీటిని ఆంధ్ర, తెలంగాణ రాషా్ట్రలు వాడుకోవడంతో డ్యామ్‌లో నీటి మట్టం త్వరగా తగ్గిపోతుంది. శ్రీశైలం డ్యామ్‌లో 70 టీఎంసీలకు చేరగానే ఇక ఎత్తిపోతల పథకాలకు అధికారులు నీరు నిలిపివే స్తారు. ఈ లెక్కన హంద్రీ నీవాకు మరో పది రోజుల కంటే ఎక్కువ రోజులు నీరు విడుదల జరగడం కష్టమని అధికారులు అంటున్నారు.
హంద్రీ నీవా నుంచి జీడీపీకి రోజుకు 230 క్యూసెక్కుల నీరు:
ప్రస్తుతం హంద్రీ నీవా నుంచి జీడీపీకి రోజుకు 230 క్యూసెక్కుల నీరు చేరుతోంది. ఆ నీరు ఇక పది రోజులలో నిలిచిపోనుంది. వర్షాలు కురియక పోవడం, ఎల్లెల్సీ నీరు జీడీపీలోకి మళ్లించక పోవడం హంద్రీనీవా నీరు నిలిచిపోవడంతో ఇక గాజులదిన్నె ప్రాజెక్టు పరిస్థితి ఎండి పోవడం తప్ప మరో మార్గం కనిపించదు. ప్రస్తుతం జీడీపీలో 1.5 టీఎంసీల నీరు మాత్రమే ఉంది. బుధవారం నుంచి ప్రతి రోజు 170 క్యూసెక్కుల ప్రకారం నీటి విడుదల జరుగుతూ ఉంటే జీడీపీలో ఉన్న నీరు ఎన్ని రోజులు వస్తుందనే ప్రశ్న ఎదురయ్యేదే.
రోజుకు 40- 50 క్యూసెక్కుల వరకు ఆవిరి:
గాజులదిన్నె ప్రాజెక్టులో ఉన్న నీరు ప్రతి రోజు దాదాపు 40- 50 క్యూసెక్కుల వరకు నీరు ఎండలకు ఆవిరైపోతోంది. ఎల్‌నినో ప్రభావంతో ఎండలు మండి పోతున్నాయి. ఇక కర్నూలు, కోడుమూరు ప్రాంతాలకు రోజుకు 170 క్యూసెక్కులు విడుదల మరి 40-50 క్యూసెక్కులు ఆవిరి.. ఈ లెక్కన ఎక్కువ రోజులకు నీరు రాకపోవచ్చని అంచనా.
డోన, క్రిష్టగిరి, బండగట్టు తాగునీటి పథకాలకు ఇబ్బందే మరి:
గాజులదిన్నె ప్రాజెక్ట్ కింద ఉన్న డోన, బండగట్టు, క్రిష్టగిరి తాగునీటి పథకాలకు ప్రాజెక్టు నుంచి రోజుకు 10 క్యూసెక్కులు వెళుతుంటాయి. ఇక ప్రస్తుతం జీడీపీ నుంచి ఇతర ప్రాంతాలకు విడుదల అవుతున్న నీరు, ప్రాజెక్టులో హంద్రీనీవా నుంచి వచ్చి చేరుతున్న నీటి లెక్కల ప్రకారం వచ్చే 2027 వేసవి కాలం వరకు తాగునీటి పథకాలకు నీటి వాడకం ఉంటుందని గ్యారెంటీ లేదు. ఏదైనా అక్టోబరు నెలలో అనుకోకుండా జీడీపీ ఎగువ ప్రాంతాలలో భారీవర్షాలు కురిసి వరద జీడీపీని చేరితే తప్ప తాగునీటి సమస్య తీరేలా లేదు.