గాయత్రిని నేను చంపలేదు!
ABN , Publish Date - Jun 21 , 2026 | 04:45 AM
రాధాగాయత్రి తాను ఎంతగానో ప్రేమించే భార్య అని, ఆమెను తాను చంపలేదని భర్త శ్రీచరణ్ పేర్కొన్నారు. పోస్టుమార్టం నివేదిక వస్తే.. అన్ని వాస్తవాలు వెలుగులోకి వస్తాయన్నారు.
ఆమె నేను ఎంతగానో ప్రేమించే భార్య
గాయత్రి బ్యాగ్‌లో ట్రాకర్ నేను పెట్టలేదు
పోస్టుమార్టం నివేదికతో వాస్తవాలు తెలుస్తాయి: భర్త శ్రీచరణ్
విశాఖపట్నం, జూన్ 20(ఆంధ్రజ్యోతి): రాధాగాయత్రి తాను ఎంతగానో ప్రేమించే భార్య అని, ఆమెను తాను చంపలేదని భర్త శ్రీచరణ్ పేర్కొన్నారు. పోస్టుమార్టం నివేదిక వస్తే.. అన్ని వాస్తవాలు వెలుగులోకి వస్తాయన్నారు. ‘27 ఏళ్లు పెంచుకున్న కన్నబిడ్డ మరణించిందనే బాధలో ఆమె తల్లిదండ్రులు నన్ను అనుమానిస్తున్నారు. గాయత్రిని నేనే చంపి ఉంటే ఇక్కడ ఎందుకు ఉంటాను? ఆమె కర్మకాండల్లో ఎందుకు పాల్గొంటాను?’ అని ప్రశ్నించారు. ఇటీవల భర్తతో కలిసి ఉత్తరాఖండ్ టూర్‌కు వెళ్లిన గాయత్రి.. ముస్సోరిలోని ఓ హోమ్‌స్టేలో అనుమానాస్పదంగా మృతిచెందిన విషయం తెలిసిందే. ఈ విషయంలో భర్త శ్రీచరణ్‌పై ఆరోపణలు వస్తున్నాయి. దీనిపై ఆయన శనివారం సింహాచలంలో విలేకరులతో మాట్లాడారు. తాను బాధలో ఉన్నానని, ఎక్కువ ప్రశ్నలు వేయవద్దంటూ.. కొన్నింటికి మాత్రమే సమాధానం చెప్పారు. పెళ్లయిన కొత్తలో కొన్ని భేదాభిప్రాయాలు వచ్చినా, ఆ తర్వాతనుంచి ఇద్దరం అన్యోన్యంగా ఉంటున్నామని చెప్పారు. గాయత్రి బ్యాగులో జీపీఎస్ ట్రాకర్ తాను పెట్టలేదన్నారు. ‘ఆషాఢం కోసం 2నెలలు విశాఖపట్నం పుట్టింటికి వెళతానని గాయత్రి చెప్పింది.
దాంతో షార్ట్ ట్రిప్ ప్లాన్‌చేసుకున్నాం. మా మధ్య విభేదాలు ఉంటే ఆమె టూర్‌కు రాదు కదా? ఈ నెల 13న రిషికేశ్ వెళ్లాం. రాత్రి 11.30 గంటలకు ముస్సోరిలోని హోమ్‌స్టేకి చేరాం. అక్కడ ఇచ్చిన రెడ్ వైన్ తాగి నిద్రపోయాం. ఉదయం 6 గంటలకు లేచిచూస్తే, ఆమె నాపై పడుకొని ఉంది. ముక్కు నుంచి రక్తం కారుతోంది. దీంతో అంబులెన్స్‌కు ఫోన్‌చేసి, హోటల్ సిబ్బందికి సమాచారం ఇచ్చాను. పోలీసులు ఫోరెన్సిక్ సిబ్బంది ఆధారాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టానికి తీసుకెళ్లారు. తర్వాత మృతదేహాన్ని విశాఖపట్నం, ఇక్కడి నుంచి మామిడిపల్లి వెళ్లాం’ అని చెప్పారు. తాను ఓ మంచి భార్యను కోల్పోయానన్నారు. తన గురించి, తమ కుటుంబాల గురించి మీడియాలో చెడుగా వస్తున్నాయని, వాస్తవాలు తెలిసేవరకూ ఆగాలని కోరారు. ఈ క్రమంలో ఓ మీడియా ప్రతినిధి వద్ద మైక్ లాక్కొని ‘నేను అడిగే ప్రశ్నలకు సమాధానం చెబుతారా?’ అంటూ దూకుడు ప్రదర్శించారు. ఇంతమంది తలా ఒక ప్రశ్న వేస్తే, బాధలో ఏమి చెబుతాను అంటూ ఎదురు ప్రశ్నించారు. ఇకపై తనను విలేకరులు ఎవరూ సంప్రదించవద్దని, ఉత్తరాఖండ్ పోలీసులే అన్నీ తేలుస్తారని పేర్కొన్నారు.