Share News

గౌతు లచ్చన్న స్ఫూర్తితో కూటమి పాలన

ABN , Publish Date - Aug 17 , 2026 | 05:00 AM

సర్దార్‌ గౌతు లచ్చన్న స్ఫూర్తితో కూటమి ప్రభుత్వం పాలన సాగిస్తోందని.., బీసీలను రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా అన్నింటా ముందంజలో..

గౌతు లచ్చన్న స్ఫూర్తితో  కూటమి పాలన

విజయవాడ అర్బన్‌, ఆగస్టు 16 (ఆంధ్రజ్యోతి): సర్దార్‌ గౌతు లచ్చన్న స్ఫూర్తితో కూటమి ప్రభుత్వం పాలన సాగిస్తోందని.., బీసీలను రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా అన్నింటా ముందంజలో నిలబెట్టేలా సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని రాష్ట్ర మంత్రులు సవిత, అనగాని సత్యప్రసాద్‌, కొల్లు రవీంద్ర, కొలుసు పార్థసారథి, అచ్చెన్నాయుడు అన్నారు. గౌతు లచ్చన్న పోరాట స్ఫూర్తిని భావితరాలకు తెలియజేయాలన్న ఉద్దేశంతోనే ఆయన జయంతిని రాష్ట్ర పండుగగా నిర్వహిస్తున్నామన్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో బీసీలను వేధిస్తే, సీఎం చంద్రబాబు బీసీలను అక్కున చేర్చుకున్నారని తెలిపారు. సర్దార్‌ గౌతు లచ్చన్న రాష్ట్రస్థాయి జయంత్యుత్సవాన్ని బీసీ కార్పొరేషన్‌ ఆధ్వర్యంలో విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. మంత్రులు తొలుత గౌతు లచ్చన్న విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మంత్రి సవిత మాట్లాడుతూ గౌతు లచ్చన్న జయంతి జరగకుండా జగన్‌ తన హయాంలో అడ్డంకులు సృష్టించారని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే రాష్ట్ర పండుగగా నిర్వహించేలా జీవో జారీ చేశామని పేర్కొన్నారు. మంత్రి అనగాని సత్యప్రసాద్‌ మాట్లాడుతూ బీసీల హక్కుల కోసం, వారి అభ్యున్నతి కోసం గౌతు లచ్చన్న ఎన్నో ఉద్యమాలు చేశారని తెలిపారు. రైతుల కోసం మొదటిసారి పాదయాత్ర చేసిన ఘనత ఆయనదే అన్నారు. మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ గౌతు లచ్చన్న స్ఫూర్తితో సీఎం చంద్రబాబు అన్నింటా బీసీలకు పెద్దపీట వేస్తున్నారని, త్వరలో బీసీ రక్షణ చట్టం తీసుకొస్తున్నారని తెలిపారు.


మంత్రి పార్థసారథి మాట్లాడుతూ బీసీల పేరుతో కొందరు వైసీపీ నాయకులు నేరాలకు పాల్పడుతున్నారని, తప్పులు చేసినవారు ఎంతటి వారైనా శిక్ష తప్పదని హెచ్చరించారు. ఎమ్మెల్యే గౌతు శిరీష మాట్లాడుతూ సర్దార్‌ గౌతు లచ్చన్న కుటుంబాన్ని జగన్‌ అవమానానికి, వేధింపులకు గురిచేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం అనగాని సత్యప్రసాద్‌ చారిటబుల్‌ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో గౌడ సామాజికవర్గానికి చెందిన 125 మంది విద్యార్థులకు రూ.25 లక్షలు పురస్కారాల రూపంలో అందజేశారు. ఎమ్మెల్యేలు గద్దె రామ్మోహన్‌, వర్ల కుమార్‌ రాజా, ఆర్టీసీ చైర్మన్‌ కొనకళ్ల నారాయణరావు, బీసీ సంక్షేమ శాఖ కార్యదర్శి సత్యనారాయణ, డైరెక్టర్‌ మల్లికార్జున తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Aug 17 , 2026 | 05:01 AM