‘అదానీ పవర్’ పనులు పరిశీలించిన గౌతమ్
ABN , Publish Date - Feb 02 , 2026 | 05:35 AM
ప్రముఖ దిగ్గజ పారిశ్రామికవేత్త, అదానీ సంస్థల చైర్మన్ గౌతమ్ అదానీ ఆదివారం రాయలసీమలో పర్యటించారు.
సత్యసాయి, కడప జిల్లాల్లో పర్యటన
కొండాపురం/లింగాల/తాడిమర్రి, ఫిబ్రవరి 1(ఆంధ్రజ్యోతి): ప్రముఖ దిగ్గజ పారిశ్రామికవేత్త, అదానీ సంస్థల చైర్మన్ గౌతమ్ అదానీ ఆదివారం రాయలసీమలో పర్యటించారు. అహ్మదాబాద్ నుంచి కడపకు విమానంలో వచ్చిన ఆయన అక్కడి నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో బయలుదేరి పులివెందుల నియోజకవర్గంలోని లింగాల మండలం చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ (సీబీఆర్) వద్దకు ఉదయం 9.30 గంటలకు చేరుకున్నారు. ఇక్కడి నుంచి రోడ్డుమార్గం ద్వారా సత్యసాయి జిల్లా తాడిమర్రి మండలం దాడితోట గ్రామం వద్ద 407 ఎకరాల్లో రూ. 2 వేల కోట్లతో నిర్మితమవుతున్న హైడ్రో పవర్ ప్లాంట్ వద్దకు చేరుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాక్‌ఫిల్ డ్యాం పనుల వద్ద 20 నిమిషాలపాటు ఉండి నాణ్యత గురించి ఆరాతీశారు. విద్యుదుత్పత్తి తరువాత తిరిగి నీరు డ్యాంలో కలిసే టన్నెల్‌లోకి వెళ్లి సంబంధిత అధికారులతో వివరాలు అడిగితెలుసుకున్నారు. ప్రాజెక్టు పైభాగంలో నిర్మిస్తున్న ట్యాంకు ఇతర పనులను పరిశీలించారు. కడప జిల్లా, కొండాపురం మండలం కె.బొమ్మేపల్లె దొంతికోన వద్ద గండికోట ప్రాజెక్టు సమీపంలో అదానీ సంస్థ నిర్మిస్తున్న హైడ్రో పవర్ ప్రాజెక్టు వద్దకు మధ్యాహ్నం 12.30 గంటలకు చేరుకున్నారు. మధ్యాహ్నం 1.30 గంటల వరకు సాగిన ఆయన పర్యటనలో సుమారు రూ. 10 వేల కోట్లతో 1,800 మెగావాట్ల సామర్థ్యంతో నిర్మిస్తున్న పవర్ ప్రాజెక్టు పనులను పరిశీలించారు. పవర్ ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా నిర్మిస్తున్న సొరంగం పనులను కూడా చూశారు. అనంతరం ప్రాజెక్టుకు సంబంధించిన పూర్తి వివరాలను కంపెనీ ఇంజనీర్లు ఆయనకు మ్యాప్ ద్వారా వివరించారు. అదానీతో పాటు ఆయన కుమారుడు, సంస్థ సీఈవో జీత్ అదానీ కూడా వచ్చారు. కార్యక్రమంలో అనకాపల్లి ఎంపీ సీఎం రమేశ్, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి సీఎం సురేశ్‌నాయుడు, అదానీ సంస్థల ఎండీలు వినీత్‌జైన్, అనిల్‌షర్దానా, టీఓఓ నరేశ్, ప్రాజెక్టు డైరెక్టర్ వికాస్ మండల్, మేనేజర్ రాంశంకర్‌రాయ్ తదితరులు పాల్గొన్నారు.