‘ఆరోగ్యం’లో గేట్స్ టెక్నాలజీ!
ABN , Publish Date - Feb 16 , 2026 | 03:26 AM
ఆరోగ్య రంగంలో సాంకేతిక విప్లవం ద్వారా సామాన్యులకు మెరుగైన, సత్వర వైద్యసేవలందించడమే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అడుగులు వేస్తోంది.
సామాన్యుడి చెంతకు అంతర్జాతీయ వైద్యసేవలు
‘గేట్స్’ సహకారంలో ఏపీలో డిజిటల్ హెల్త్
ఇప్పటికే కుప్పంలో పైలట్ ప్రాజెక్టుగా ‘సంజీవని’
రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించేందుకు ప్రణాళికలు
మరింత సహకారం కోరనున్న సీఎం చంద్రబాబు
ప్రజారోగ్యంపైనే ఫోకస్
అమరావతి, ఫిబ్రవరి 15(ఆంధ్రజ్యోతి): ఆరోగ్య రంగంలో సాంకేతిక విప్లవం ద్వారా సామాన్యులకు మెరుగైన, సత్వర వైద్యసేవలందించడమే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా ప్రపంచ ప్రఖ్యాత గేట్స్ ఫౌండేషన్ సహకారంతో రాష్ట్రంలోని ఆరోగ్యవ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు ప్రణాళికలు సిద్ధంచేసింది. రాష్ట్రంలో విద్య,వైద్య, వ్యవసాయరంగాల్లో గేట్స్ ఫౌండేషన్ ఇప్పటికే ఇస్తున్నసహకారంతోపాటు టెక్నాలజీ పరంగా మరింత సహకారం అందించేక్రమంలో సీఎం చంద్రబాబు ఆహ్వానం మేరకు నేడు గేట్స్ ఫౌండేషన్ చైర్మన్ బిల్ గేట్స్ ఏపీ వస్తున్నారు. ఈసందర్భంగా ఆయన విద్య, వైద్యం, వ్యవసాయ రంగాల్లో అమలవుతున్న ఆధునిక పద్ధతులు, పాటించాల్సినవిధానాలపై ప్రభుత్వానికి కీలకసూచనలు చేయనున్నారు. ముఖ్యంగా జబ్బుల బారినపడిన వారికి వైద్యం అందించే సంప్రదాయ విధానానికి భిన్నంగా.. వ్యాధులు సోకడాన్ని ముందుగానే పసిగట్టి, వాటి నివారణా చర్యలతో పాటు ప్రజల ప్రస్తుత ఆరోగ్య స్థితిగతుల్ని వ్యక్తిగతంగా సమగ్రంగా పరీక్షించి, వారికి జబ్బులొచ్చే అవకాశాన్ని ముందుగానే హెచ్చరికలు చేయడం, వ్యక్తిగత హెల్త్ కార్డుల్ని రూపొందించడం, డిజిటల్ ఆరోగ్య సేవలు (టెలిమెడిసిన్) అందించే దిశగా వైద్య ఆరోగ్య వ్యవస్థను ప్రక్షళన చేయాలన్న అంశాలపై కీలకమైన నిర్ణయాలు తీసుకోనున్నారు. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం ప్రజారోగ్య సంరక్షణకు ఉన్న విధానాలు, పద్ధతులను సమగ్రంగా సమీక్షించి ఆరోగ్యాంధ్ర సాధనకు చేపట్టాల్సిన విధానాలపై నివేదించేందుకు గేట్స్ ఫౌండేషన్ సూచనల మేరకు 10 మంది అంతర్జాతీయ నిపుణులతో ఒక ఉన్నత స్థాయి నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది. దీనిపై సీఎం చంద్రబాబు బిల్‌గేట్స్‌కు వివరించనున్నారు. అంతేకాకుండా గేట్స్ ఫౌండేషన్ సూచించిన మేరకు వివిధ పథకాల అమలుకు భాగస్వామ్యుల ద్వారా కార్యాచరణను ప్రారంభించడంతో పాటు ఇంటిగ్రేటేడ్ విధానంలో సాంకేతిక సహకారంతో వివిధ ఆరోగ్య కేంద్రాల సమన్వయంతో రియల్ టైమ్‌లో ప్రజల ఆరోగ్య భద్రత కోసమే ప్రత్యేకంగా సంజీవని పథకాన్ని ప్రారంభించింది. చిత్తూరు జిల్లా కుప్పంలో పైలట్ ప్రాజెక్టును అమలు చేసి, ఇప్పుడు చిత్తూరు జిల్లాకు విస్తరించింది. త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేసేందుకు సిద్ధమైంది. దీనికి గేట్స్ ఫౌండేషన్ సహకారం మరింత కావాలని ప్రభుత్వం కోరనుంది.
ఆపై ఆరోగ్యశాఖను ఆర్టీజీఎ్‌సలోని అవేర్ ప్లాట్‌ఫామ్‌తో అనుసంధానం చేసి వ్యాధులు ప్రబలటాన్ని ముందుగానే పసిగట్టే దిశగా ప్రభుత్వం చర్యలు చేపడుతుంది. స్థూలంగా డేటా ఆధారిత ముందస్తు వ్యూహాలు, విధానాల రూపకల్పనకు గేట్స్ ఫౌండేషన్‌తో భాగస్వామ్యం తోడ్పడుతుంది. ఏఐ ఆధారిత డయగ్నోస్టిక్ పరీక్షలు, సంచార పరీక్షా కేంద్రాల్లో సులువుగా నిరంతరం వాడే పరికరాలు, దూర ప్రాంతాల్లో వైద్యం, టెలిమెడిసిన్‌కు సంబంధించిన ఉపకరించే పరికరాల ఎంపికకు గేట్స్ ఫౌండేషన్ టెక్నికల్ సపోర్టు అందిస్తుంది.
వైద్య రంగంలో టెక్నాలజీ అవసరం: సత్యకుమార్
వైద్య రంగంలో ఆశించిన మార్పులను సాధించడానికి, వైద్యం అందరికీ సులువుగా అందించడానికి టెక్నాలజీ సహకారం ఎంతో అవసరం. ఈ దిశగా గేట్స్ ఫౌండేషన్ సహకారంతో ముందుకు సాగుతున్నాం. ఇందులో భాగంగాఏఐ ఆధారిత జాతీయ విధాన రూపకల్పన దిశగా గేట్స్ ఫౌండేషన్ సహకారంతో విజయవాడలో వివిధ రాష్ట్రాలతో మొదటి విడత చర్చల జరిపాం. ఆరోగ్యశాఖకు టెక్నాలజీ అనుసంధానంపై ఫౌండేషన్ సహకారం తీసుకుంటాం.