కర్నూలు జీజీహెచ్‌లో ‘గ్యాస్’ కష్టాలు
ABN , Publish Date - Mar 17 , 2026 | 05:14 AM
పశ్చిమాసియా యుద్ధ ప్రభావం వంటింట్లోనే కాదు.. కర్నూలు ప్రభుత్వాసుపత్రి, వైద్య కళాశాలపైనా పడింది. ఆస్పత్రితో పాటు మెడికల్ కాలేజీ విద్యార్థుల హాస్టళ్లలో వంట గ్యాస్ కష్టాలు తీవ్రమయ్యాయి.
రోగులకు ఆహార సరఫరాలో ఇబ్బందులు
కేఎంసీ క్యాంటీన్‌లో భోజనం, టిఫిన్ బంద్
మెనూలో కోత.. కట్టెలతో నెట్టుకొస్తున్న వైనం
కర్నూలు హాస్పిటల్, మార్చి 16(ఆంధ్రజ్యోతి): పశ్చిమాసియా యుద్ధ ప్రభావం వంటింట్లోనే కాదు.. కర్నూలు ప్రభుత్వాసుపత్రి, వైద్య కళాశాలపైనా పడింది. ఆస్పత్రితో పాటు మెడికల్ కాలేజీ విద్యార్థుల హాస్టళ్లలో వంట గ్యాస్ కష్టాలు తీవ్రమయ్యాయి. స్థానిక జీజీహెచ్‌లో దాదాపు వందల మంది రోగులు చికిత్స పొందుతుంటారు. వీరితో పాటు స్టేట్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్, ప్రాంతీయ కంటి ఆస్పత్రి రోగులకు కూడా కలిపి కాంట్రాక్టర్ మొత్తంగా సుమారు 1,700 మందికి ఆహారం సరఫరా చేయాలి. అయితే జీజీహెచ్‌తో పాటు దాదాపు 1,500 మంది ఉండే వైద్య విద్యార్థుల హాస్టళ్లు, నర్సింగ్ కాలేజీ హాస్టళ్లకు వంట గ్యాస్ సరఫరా సరిపడినంత లేని కారణంగా రోగులు, విద్యార్థులు, వైద్యులకు ఆహారం అందించడం కష్టంగా మారింది. మెనూలో కోత పెట్టి కట్టెల పొయ్యిలపై వంట నెట్టుకొస్తున్నారు. ఇప్పటికే మెడికల్ కాలేజీ క్యాంటీన్‌లో నిర్వాహకులు భోజనం, టిఫిన్ సర్వీసును రెండు రోజుల నుంచి నిలిపివేశారు. గ్యాస్ సిలిండర్ల సరఫరా లేకపోవడంతో కాఫీ, టీ, కూల్‌డ్రింక్స్ మాత్రమే అందిస్తున్నారు. ఇలా ఎన్ని రోజులు ఉంటుందో తెలియక క్యాంటీన్ నిర్వాహకులు కట్టెల పొయ్యిని ఏర్పాటు చేసే పనిలో నిమగ్నమయ్యారు. రోగులకు ఆహారం అందించే డైట్ కేంద్రానికి సరిపడా సిలిండర్లు సరఫరా చేయాలని జాయింట్ కలెక్టర్ నూరుల్ ఖమర్‌కు జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ కె.వెంకటేశ్వర్లు లేఖ రాశారు. ఆహారం తయారీకి రోజుకి 6 నుంచి 10 సిలిండర్లు అవసరమవుతాయి. అయితే ఆ స్థాయిలో సిలిండర్ల సరఫరా లేదని డైట్ నిర్వాహకులు సోమవారం పీజీఆర్‌ఎస్‌లో జేసీకి వినతి పత్రం ఇచ్చారు. స్పందించిన జేసీ సివిల్ సప్లైస్ అధికారులతో మాట్లాడారు. అవసరమైన గ్యాస్ సిలిండర్లు అందుబాటులో ఉండేలా చూడాలని ఆదేశించారు. జీజీహెచ్‌కు రాత్రికి సిలిండర్లు సరఫరా చేశారు.
గ్యాస్ కొరతతో మెనూలోనూ మార్పు
గ్యాస్ కొరత వల్ల నిర్వాహకులు ఒకేసారి వండే పదార్థాలకు ప్రాధాన్యం ఇస్తున్నారు. చపాతి, దోశ, పూరి, వడ వంటివి చేయడం లేదు. కట్టెల పొయ్యిని ఉపయోగించడం వల్ల మెనూను తగ్గించారు. ఉప్మా, అన్నం, పప్పు, రసం, సాంబార్ వంటి వంటకాలకు ప్రాధాన్యత ఇస్తున్నారు.