Share News

ఆదోనిలో ‘గ్యాస్‌’ దందా

ABN , Publish Date - Apr 21 , 2026 | 11:34 PM

వంట గ్యాస్‌ సిలిండర్‌.. ఇప్పుడు సామాన్యుడికి అందని ద్రాక్ష... బుక్‌ చేస్తే చాలు.. ఏజెన్సీల నుంచి నిబంధనల వెల్లువ మొదలవుతుంది.

 ఆదోనిలో ‘గ్యాస్‌’ దందా
ఆదోని పట్టణంలో ఓ హోటల్‌లో వినియోగిస్తున్న డొమెస్టిక్‌ గ్యాస్‌

ఏజెన్సీలదే ఇష్టారాజ్యం

సామాన్యుడి కోటా.. హోటళ్ల పాలు

పట్టించుకోని

పౌర సరఫరాల శాఖ అధికారులు

ఆదోని, ఏప్రిల్‌ 21 (ఆంధ్రజ్యోతి): వంట గ్యాస్‌ సిలిండర్‌.. ఇప్పుడు సామాన్యుడికి అందని ద్రాక్ష... బుక్‌ చేస్తే చాలు.. ఏజెన్సీల నుంచి నిబంధనల వెల్లువ మొదలవుతుంది. కానీ అదే సిలిండర్‌ బ్లాక్‌ మార్కెట్‌లో మాత్రం బారులు తీరుతోంది. పట్టణంలో గ్యాస్‌ ఏజెన్సీ నిర్వాహకులు సృష్టిస్తున్న కృత్రిమ కొరత సామాన్య గృహిణి కళ్లల్లో నీళ్లు తెప్పిస్తోంది. గ్యాస్‌ సరఫరాలో పారదర్శకత కోసం ప్రవేశపెట్టిన నిబంధనలను ఏజెన్సీలు తమ వసూళ్ల దందాకు ఆయుధాలుగా మార్చుకుంటున్నాయి.

హోటళ్లే.. ’హోల్‌ సేల్‌’ కేంద్రాలు..

నియమ, నిబంధనల ప్రకారం గృహ అవసరాలకు వాడే (డొమెస్టిక్‌) సిలిండర్లను వ్యాపార సంస్థలకు వాడకూడదు. కానీ ఆదోనిలో సీన్‌ రివర్స్‌... కమర్షియల్‌ సిలిండర్ల ధరలు అధికంగా ఉండడంతో హోటల్‌ నిర్వాహకులు ఏజెన్సీతో చేతులు కలుపుతున్నారు. సాధారణ వినియోగదారుడికి రావాల్సిన సిలిండర్లను సరఫరా లేదని సాకు చెప్పి వాటిని నేరుగా హోటళ్లకు మళ్లిస్తున్నారు. సిలిండర్‌ అసలు ధర రూ.976 ఉంటే హోటల్‌ యజమానుల నుంచి రూ.1600 నుంచి రూ.2 వేల వరకు వసూలు చేస్తున్నారు. అంటే ఒక్కో సిలిండర్‌పై ఏజెన్సీ నిర్వాహకులు దాదాపు రూ.700 నుంచి రూ.1000 అదనంగా జేబులో వేసుకుంటున్నారు.

నిమ్మకు నీరెత్తినట్లుగా..

పట్టణంలో ఇంత బహిరంగంగా గ్యాస్‌ మాఫియా రాజ్యమేలుతున్నా పౌర సరఫరాల శాఖ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. ఏజెన్సీల గోడౌన్లను, డెలివరీ రికార్డులను తనిఖీ చేస్తే అసలు రంగు బయటపడుతుంది. బుకింగ్‌ అయిన సిలిండర్లు ఎక్కడికి వెళ్తున్నాయి..? హోటళ్లకు డొమెస్టిక్‌ సిలిండర్లు ఎలా వస్తున్నాయి..? అనే అంశాలపై విచారణ జరపాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి ఆదోనిలో గ్యాస్‌ బ్లాక్‌ మార్కెట్‌ దందాపై దృష్టి పెట్టాలని ప్రజలు డిమాండ్‌ చేస్తున్నారు.

బుక్‌ చేసి నెలరోజులైనా అందని సిలిండర్‌

హొళగుంద: బుక్‌ చేసి నెలరోజులైన గ్యాస్‌ రావడం లేదని వినియోగదారులు ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం మండలంలోని గ్యాస్‌ ఏజెన్సీ వద్ద నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వినియోగదారులు మాట్లాడుతూ గ్యాస్‌ బుక్‌ చేసి నెల రోజులు గడిచినా ఇంతవరకు సిలిండర్‌ రాలేదన్నారు. ప్రతిరోజూ ఖాళీ సిలిండర్‌ తెచ్చి ఏజెన్సీ వద్ద ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఎదురు చూడాల్సిన పరిస్థితి నెలకొందన్నారు. నిర్వాహకులను అడిగితే ఆదోని నుంచి రావడం లేదని చెబుతున్నారని అన్నారు. అధికారుల పర్యవేక్షణ లోపంతోనే గ్యాస్‌ ఏజెన్సీల ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయని ఆరోపించారు. ఈ విషయంపై తహసీల్దార్‌ లక్ష్మిరాజును వివరణ కోరగా, గ్యాస్‌ ఏజెన్సీ వారితో మాట్లాడి లబ్ధిదారులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తామన్నారు.

కూలీ పనులు వదిలి వస్తున్నాం

కూలీ పనులు చేసుకుని జీవనం గడిపేవారం. నెల రోజులుగా గ్యాస్‌ కోసం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఇక్కడే ఎదురుచూస్తూ కూర్చుంటున్నాం. చాలా ఇబ్బందిగా ఉంది. నిర్వా హకులు ఎప్పుడు వస్తుందో సమాధానం ఇవ్వడం లేదు.

- ఉలిగమ్మ, దివ్యాంగురాలు, హొళగుంద

Updated Date - Apr 21 , 2026 | 11:34 PM