గ్యాస్ కష్టాలు!
ABN , Publish Date - Mar 16 , 2026 | 12:02 AM
గ్యాస్ సమస్య జిల్లాలో రోజురోజుకు తీవ్రమవుతోంది. కమర్షియల్ సిలిండర్‌ల సరఫరా లేకపోవడంతో నగరంలో చాలా వరకు హోటళ్లు మూతపడిన విషయం తెలిసిందే. తాజాగా ఈ సమస్య ప్రైవేటు హాస్టళ్లు, దేవాలయాలను తాకింది. సీఎనజీ బంకుల్లోనూ గ్యాస్ నిల్వలు అడుగంటుతున్న నేపథ్యంలో వందలాది ఆటోలు నిలిచిపోతున్నాయి.
- ఆలయాల్లో దేవుళ్లకు చిలిచిపోయిన నైవేద్యాలు
- కడుపు నిండా అన్నం పెట్టలేమని చేతులెత్తేసిన ప్రైవేటు హాస్టళ్లు
- మెను గురించి ప్రశ్నిచొద్దని నోటీసు బోర్డులు
- ఆగిపోయిన సీఎనజీ ఆటోలు
గ్యాస్ సమస్య జిల్లాలో రోజురోజుకు తీవ్రమవుతోంది. కమర్షియల్ సిలిండర్‌ల సరఫరా లేకపోవడంతో నగరంలో చాలా వరకు హోటళ్లు మూతపడిన విషయం తెలిసిందే. తాజాగా ఈ సమస్య ప్రైవేటు హాస్టళ్లు, దేవాలయాలను తాకింది. సీఎనజీ బంకుల్లోనూ గ్యాస్ నిల్వలు అడుగంటుతున్న నేపథ్యంలో వందలాది ఆటోలు నిలిచిపోతున్నాయి.
(ఆంధ్రజ్యోతి, విజయవా సిటీ):
వంట గ్యాస్ సమస్యను అధిగమించేందుకు కమర్షియల్ సిలిండర్‌ల సరఫరాను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిలిపివేసిన విషయం తెలిసిందే. దీని ప్రభావం కొన్ని వర్గాల ప్రజల జీవనంపై ప్రత్యక్షంగా, పరోక్షంగా పడుతోంది. పేద, మధ్య తరగతి ప్రజలు ఇబ్బందులు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి.
విఘ్నేశ్వరుడికి ప్రసాదం నిల్
కోటి విఘ్నాలు తొలగించే లంబోదరుడు సైతం గ్యాస్ ఇబ్బందులను ఎదుర్కొంటున్నాడు. వనటౌన కెనాల్ రోడ్డులో, దుర్గమ్మ దేవస్థానానికి దిగువన ఉండే వినాయక స్వామి గుడిలో ఆదివారం ప్రత్యక్షమైన బోర్డు భక్తులను ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ‘గ్యాస్ సరఫరా కొరత కారణంగా ప్రసాదాలు తయారు చేయడం తాత్కాలికంగా నిలిపివేశామని, భక్తులు సహకరించాలని’ సదరు బోర్డు సారాంశం. ఈ బోర్డు గ్యాస్ సమస్య తీవ్రతను ప్రస్ఫుటం చేస్తోందని ప్రజలు అభిప్రాయపడుతున్నారు.
ప్రైవేటు హాస్టళ్లలో మెను కట్
ప్రైవేటు హాస్టళ్లలో సైతం గ్యాస్ సమస్యపై బోర్డులు వెలిశాయి. సిలిండర్ లభ్యత లేని కారణంగా మెను ప్రకారం భోజనం పెట్టలేమని, చేతనైనంత వరకు మాత్రమే ఆహారం అందిస్తామని, దీనిపై ఎవరూ ప్రశ్నించొద్దంటూ అక్కడ ఆశ్రయం పొందే వారిని నిర్వాహకులు కోరుతున్నారు. విజయవాడ నగరం, శివారు ప్రాంతాల్లో 100కుపైగా ప్రైవేటు హాస్టల్స్‌లో వేలాది మంది ఆశ్రయం పొందుతున్నారు. కొన్ని హాస్టల్స్‌లో కట్టెల పొయ్యిలపై అన్నం, చారు మాత్రమే వండి వడ్డిస్తున్నారు. అయితే ఈ సమస్య దేశ వ్యాప్తంగా ఉంది. ఉమ్మడి కృష్ణాజిల్లా నుంచి ఇతర ప్రాంతాల్లో చదువు, ఉద్యోగం నిమిత్తం ప్రైవేటు హాస్టల్స్‌లో ఉంటున్న వారు ఇబ్బందులు పడుతున్నారు. బెంగళూరు, ఢిల్లీ, హైదరాబాద్, ముంబై, చెన్నై వంటి ప్రధాన నగరాల్లో ఉంటున్న ఇక్కడి వాళ్లు భోజనానికి ఇబ్బందులు పడుతున్నట్లు వారి కుటుంబీకులకు ఫోన ద్వారా తెలియజేస్తున్నారు. దీంతో వారి కుటుంబ సభ్యులు కొన్ని రకాల నిల్వ ఉండే ఆహార పదార్థాలను తయారు చేసి యుద్ధ ప్రాతిపదికన పంపిస్తున్న ఘటనలు చోటు చేసుకుంటున్నాయి.
ఆటో కార్మికులకు కష్టకాలమే..
గ్యాస్ సమస్య రవాణా రంగంపైనా తీవ్రంగా పడుతోంది. సీఎనజీ బంకుల్లో నిల్వలు తగ్గుముఖం పడుతుండటంతో గ్యాస్‌తో నడిచే ఆటోలు నిలిచిపోతున్నాయి. ప్రస్తుతం విజయవాడ నగర శివారు ప్రాంతాల్లోని బంకుల వద్ద సీఎనజీ ఆటోలు బారులు తీరుతున్నాయి. ఉమ్మడి కృష్ణాజిల్లాలో సుమారు 10 వేలకు పైగా సీఎనజీ ఆటోలపై ఆధారపడిన కుటుంబాలు ఉన్నాయి. గ్యాస్ దొరక్క ఆటో నిలిచిపోవడంతో ఆ కుటుంబాలను ఆర్థిక కష్టాలు వెంటాడుతున్నాయి. ఈ పరిస్థితి మరో వారం కొనసాగితే అప్పుల్లో కూరుకుపోతామని ఆటో కార్మికులు వాపోతున్నారు. ప్రతి నెలా ఆటోకు చెల్లించాల్సిన ఈఎంఐల భారం పెరిగిపోతుందనే ఆందోళన వారిని వెంటాడుతోంది.
సూపర్ మార్కెట్‌లలో వంట నూనె కొరత
విజయవాడ నగరంలోని ప్రముఖ సూపర్ మార్కెట్ బ్రాంచలలో ఆదివారం ఒక్కొక్కరికి రెండు వంట నూనె ప్యాకెట్‌లను మాత్రమే విక్రయించిన ఘటన చోటుచేసుకుంది. రాబోయే రోజుల్లో వంట నూనెల కొరతకు సంకేతమనే అపోహ ప్రజల్లో నాటుకుంటుంది. దేశీయంగా అనేక బ్రాంచలను విస్తరించిన సదరు సూపర్‌మార్కెట్ గోదాముల్లో నిల్వలు తగ్గుముఖం పట్టినట్లు తెలుస్తోంది. పశ్చిమా ఆసియా యుద్ధం నేపథ్యంలో యూరోప్ ప్రాంతాల నుంచి రావాల్సిన కంటైనర్‌లు నిలిచిపోవడంతో ఈ సమస్య ఉత్పన్నమైనట్లు కష్టమర్లకు సూపర్ మార్కెట్‌లో పని చేసే ఉద్యోగులు వివరిస్తున్నారు. అయితే మార్కెట్‌లోని ఇతర హోల్‌సేల్, రిటైల్ దుకాణాల్లో వంట నూనెల నిల్వలు సమృద్ధిగానే ఉన్నాయి. కేవలం ఆ ఒక్క సూపర్‌మార్కెట్‌కు చెందిన గోదాముల్లోనే నిల్వలు లేవు. ఉన్న వాటినే తన కష్టమర్‌లు అందరికీ అందించాలనే ఉద్ధేశంతో విక్రయ జాగ్రత్తలు పాటిస్తోంది. మిగిలిన మార్కెట్ అంతా వంట నూనెలు సమృద్ధిగా ఉన్న నేపధ్యంలో కొరత వచ్చే అవకాశం లేదని ఎన్టీఆర్ జిల్లా ఇనచార్జ్ డీఎస్‌వో పి.వాణి ఆంధ్రజ్యోతికి వివరించారు. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, వంట నూనెల ధరల పైనా నిత్యం పర్యవేక్షణ చేస్తున్నామని తెలిపారు.