Share News

హోటళ్లపై గ్యాస్‌ ‘బండ’!

ABN , Publish Date - Mar 13 , 2026 | 04:43 AM

యుద్ధ ప్రభావం వంటింటిపై పడుతోంది. యుద్ధం కారణంగా వంట గ్యాస్‌ సంక్షోభం నానాటికీ ముదురుతోంది...! రాష్ట్రంలో వాణిజ్య సిలిండర్ల సరఫరాను దాదాపు నిలిపివేయడంతో ముఖ్యంగా..

హోటళ్లపై గ్యాస్‌ ‘బండ’!

  • రాష్ట్రంలో ముదురుతున్న వంట గ్యాస్‌ సంక్షోభం

  • వాణిజ్య సిలిండర్ల నిలిపివేతతో పలు హోటళ్ల మూత

  • కట్టెల పొయ్యితో నెట్టుకొస్తున్న కొందరు వ్యాపారులు

  • ప్యానిక్‌ బుకింగ్స్‌తోనే సమస్యలు.. సర్వర్లు క్రాష్‌

  • బుధవారం ఒక్కరోజే మూడు రెట్లు అధిక బుకింగ్స్‌

  • గృహావసరాలకు ఇబ్బంది లేదని ప్రభుత్వం ప్రకటన

అమరావతి, విజయవాడ సిటీ, విశాఖపట్నం, మార్చి 12 (ఆంధ్రజ్యోతి): యుద్ధ ప్రభావం వంటింటిపై పడుతోంది. యుద్ధం కారణంగా వంట గ్యాస్‌ సంక్షోభం నానాటికీ ముదురుతోంది...! రాష్ట్రంలో వాణిజ్య సిలిండర్ల సరఫరాను దాదాపు నిలిపివేయడంతో ముఖ్యంగా హోటళ్లు, రెస్టారెంట్లు, క్యాటరింగ్‌ సెంటర్లు, టీ, టిఫిన్‌, ఫాస్ట్‌ఫుడ్‌ సెంటర్లు నడిపే చిరువ్యాపారులు ఇబ్బందులు పడుతున్నారు. విజయవాడలో సగానికి పైగా హోటళ్లు మూతపడ్డాయి. గ్యాస్‌ సరఫరా తగ్గడంతో ఇదే అదనుగా కొందరు అక్రమార్కులు వాణిజ్య సిలిండర్లను బ్లాక్‌లో విక్రయిస్తున్నారు. వాటి ధర రూ.2,050 లోపే ఉండగా.. రూ.3 వేల నుంచి రూ.5 వేల వరకు అమ్ముతున్నారని వ్యాపారులు వాపోతున్నారు. ఈ అదనపు భారాన్ని భరించలేక చిన్న చిన్న వ్యాపారులు కట్టెల పొయ్యి, బొగ్గులను ఆశ్రయిస్తున్నారు. కొంతమంది వ్యాపారాలను తాత్కాలికంగా మూసివేస్తున్నారు. ఈ నేపథ్యంలో రెస్టారెంట్లు, హోటళ్లు, ఇతర వాణిజ్య అవసరాలకు గ్యాస్‌ సరఫరాపై సమీక్షించడానికి ప్రభుత్వం ముగ్గురు సభ్యుల కమిటీని ఏర్పాటు చేసింది.


భయంతో బుకింగ్స్‌ పెరుగుతున్నాయి

గృహావసరాలకు గ్యాస్‌ సిలిండర్ల సరఫరాలో ప్రస్తుతానికి ఎలాంటి ఇబ్బంది లేదని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెబుతున్నా.. వినియోగదారులు ముందు జాగ్రత్తగా బుకింగ్స్‌ చేస్తున్నారు. సిలిండర్లు డెలివరీ అయ్యేవరకు వేచి చూడకుండా నేరుగా గ్యాస్‌ ఏజెన్సీలకు క్యూ కడుతున్నారు. ఆన్‌లైన్‌లో ఇబ్బడిముబ్బడిగా బుకింగ్స్‌ చేస్తుండటంతో ఒత్తిడి పెరిగిపోయి సర్వర్లు పనిచేయడం లేదని గ్యాస్‌ ఏజెన్సీల నిర్వాహకులు వాపోతున్నారు. రోజువారీ బుకింగ్‌ల కంటే బుధవారం ఒక్కరోజే మూడు రెట్లు అధికంగా బుకింగ్స్‌ జరిగాయని, ప్రజలు భయంతో చేస్తున్న ఈ బుకింగ్స్‌ వల్లే సమస్యలు ఎదురవుతున్నాయని అధికారులు కూడా చెబుతున్నారు. ఈ నేపథ్యంలో గృహ అవసరాలకు ఎల్పీజీ బుకింగ్స్‌కు గడువును కేంద్ర ప్రభుత్వం 21 రోజుల నుంచి 25 రోజులకు పెంచింది. ఇలాగైనా సర్వర్లపై కొంతవరకు ఒత్తిడి తగ్గుతుందని భావిస్తున్నారు.


పరిస్థితి అందుపులోనే ఉంది: ప్రభుత్వ ప్రకటన

వంట గ్యాస్‌ సరఫరాపై ప్రజల్లో భయాందోళనలు నెలకొంటున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం గురువారం ఒక ప్రకటన విడుదల చేసింది. గ్యాస్‌ సరఫరాలో ఎలాంటి సంక్షోభం లేదని.. పరిస్థితి పూర్తిగా అదుపులోనే ఉందని స్పష్టం చేసింది. ‘రాష్ట్రంలో 1.60 కోట్లకు పైగా గృహవినియోగ గ్యాస్‌ కనెక్షన్లు ఉండగా.. రోజుకు సగటున 4 వేల టన్నులకు పైగా గ్యాస్‌ సరఫరా అవుతోంది. గురువారం నాటికి రాష్ట్రంలో ఎల్పీజీ నిల్వలు 17,962 టన్నులు అందుబాటులో ఉన్నాయి. ఎల్పీజీ బాట్లింగ్‌ ప్లాంట్‌ నుంచి రోజువారీ సరఫరాలో కూడా ఎక్కడా అంతరాయం లేదు. హోర్ముజ్‌ జలసంధి ద్వారా భారత్‌ తన అవసరాల్లో 60 శాతం ఎల్పీజీని దిగుమతి చేసుకుంటుంది. యుద్ధం కారణంగా దిగుమతిలో ఇబ్బందులు ఎదురవుతున్న నేపథ్యంలో దేశంలో ఉన్న రిఫైనరీలలో ఎల్పీజీ ఉత్పత్తిని పెంచాలని ఆదేశిస్తూ కేంద్ర ప్రభుత్వం ఈనెల 8న ఉత్తర్వులు జారీచేసింది. దీంతో దేశీయంగా రిఫైనరీల్లో 25 శాతానికి పైగా ఉత్పత్తి పెరిగింది. పెరిగిన ఎల్పీజీ మొత్తాన్ని గృహ అవసరాలకే సరఫరా చేస్తారు. నాన్‌-డొమెస్టిక్‌ ఎల్పీజీ సిలిండర్లను ఆస్పత్రులు, విద్యాసంస్థలు, హాస్టళ్లు వంటి ముఖ్యమైన రంగాలకు ప్రాధాన్యం ఇస్తున్నారు’ అని ప్రభుత్వం పేర్కొంది. వాహనాలకు దేశీ పీఎన్‌జీ, సీఎన్‌జీ సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు లేవని చెబుతున్నారు. ఎరువుల కర్మాగారాలు దాదాపు 70 శాతం సరఫరా అవుతుండగా.. శుద్ధి కర్మాగారాలు, పెట్రో కెమికల్‌ యూనిట్లకు మాత్రం 35 శాతం కోత విధిస్తున్నారు.


విశాఖ మెడ్‌టెక్‌ జోన్‌కు గ్యాస్‌ ఎఫెక్ట్‌

ఇరాన్‌ యుద్ధ ప్రభావం విశాఖపట్నంలోని ఏపీ మెడ్‌టెక్‌ జోన్‌పై పడింది. ఇక్కడ ‘వాడీ సర్జికల్స్‌’ అనే కంపెనీ నైట్రైల్‌ ఎగ్జామినేషన్‌ గ్లోవ్స్‌ను తయారు చేస్తుంది. వీటిని ఆస్పత్రులు, లేబొరేటరీలు, హెల్త్‌కేర్‌ సంస్థల్లో విస్తృతంగా ఉపయోగిస్తారు. అయితే ఈ గ్లోవ్స్‌ ఉత్పత్తి కోసం వాడీ సర్జికల్స్‌ కంపెనీ రోజుకు 4,500 కిలోల ఎల్పీజీని ఉపయోగిస్తుంది. యుద్ధం ప్రభావంతో కేంద్రం విధించిన ఆంక్షల వల్ల వాణిజ్య అవసరాలకు గ్యాస్‌ సరఫరాను ఆయిల్‌ కంపెనీలు నిలిపివేశాయి. దాంతో వీరికి గ్యాస్‌ అందించే హెచ్‌పీసీఎల్‌ నాలుగు రోజులుగా సరఫరా ఆపేసింది. అయితే తమది ఆరోగ్య రంగానికి సంబంధించిన సంస్థ అని, అత్యవసర విభాగంగా గుర్తించి గ్యాస్‌ సరఫరా పునరుద్ధరించాలని యాజమాన్యం కోరుతోంది.


విజయవాడలో సగం హోటళ్లు మూత..!

విజయవాడ నగరంలో వంట గ్యాస్‌ కష్టాలు తారస్థాయికి చేరాయి. గృహ వినియోగదారులకు ఇబ్బందులు లేనప్పటికీ.. కమర్షియల్‌ సిలిండర్ల కొరత వల్ల హోటల్‌ వ్యాపారాలు మూత పడుతున్నాయి. గ్యాస్‌ లభ్యత లేకపోవడంతో క్యాటరింగ్‌ నిర్వాహకులు చేతులెత్తేస్తున్నారు. శుభకార్యాలు, ఫంక్షన్లకు వంట చేసేందుకు తీసుకున్న అడ్వాన్స్‌లను సైతం కొందరు తిరిగి ఇచ్చేస్తున్నారు. అయితే కొంత మంది క్యాటరింగ్‌ నిర్వాహకులు మాత్రం కట్టెల పొయ్యిలపై కష్టాలు పడుతున్నారు. కమర్షియల్‌ సిలిండర్ల సరఫరాను ప్రభుత్వం పూర్తిగా నిలిపివేయడంతో విజయవాడలో సగానికి పైగా హోటళ్లు మూతపడ్డాయి. ఇప్పటికే కొంత గ్యాస్‌ నిల్వ ఉంచుకున్న అల్పాహార హోటళ్లు పొదుపు చర్యలు పాటిస్తున్నాయి. కేవలం ఇడ్లీ, టీ, పూరీ తయారీతోనే సరిపెడుతున్నాయి. కొన్ని భోజన హోటళ్లు కట్టెల పొయ్యిలను సిద్ధం చేసుకుని.. కూరల సంఖ్యను తగ్గించి నడుపుతున్నాయి. కొన్ని హోటళ్లు.. కస్టమర్లకు అన్నం, పప్పు, సాంబారు, పెరుగు, చట్నీ మాత్రమే అందిస్తున్నాయి. రంజాన్‌ నేపథ్యంలో బిర్యానీ హోటళ్ల ముందు కట్టెల పొయ్యిలు దర్శనమిస్తున్నాయి. బందరు రోడ్డులోని ఈట్‌స్ట్రీట్‌, బీఆర్‌టీఎస్‌ రోడ్డులోని ఫుడ్‌ కోర్టు, పంజా సెంటర్‌లోని రంజాన్‌ స్పెషల్‌ హలీం, బిర్యానీ స్టాల్స్‌ క్రమక్రమంగా తగ్గుతున్నాయి. రానున్న రోజుల్లో గ్యాస్‌ దొరకదనే భయం స్థానిక ప్రజలను వెంటాడుతోంది. దీంతో ఇండక్షన్‌ స్టవ్‌ల కొనుగోలుకు ఆసక్తి చూపుతున్నారు.

Updated Date - Mar 13 , 2026 | 04:46 AM