Share News

చిరు వ్యాపారులపై ‘గ్యాస్‌’భారం

ABN , Publish Date - Apr 07 , 2026 | 12:07 AM

జంక్షన్‌లు, క్యాటరింగ్‌ పాయింట్లు, భోజన హోటళ్లు ఉన్నాయి. వీటికితోడు టిఫిన్‌ హోటల్స్‌, బిర్యానీ పాయింట్లు, ప్రతి సెంటర్లోనూ అనేక టిఫిన్‌ సెంటర్లు ఉన్నాయి. వీరిలో 90శాతం మంది గ్యాస్‌పై ఆధారపడి హోటల్‌ వ్యాపారం చేస్తుండగా ఒకరిద్దరు మాత్రమే ఊకపొయ్యలపై ఆధారపడి ఉన్నారు. అయితే పెద్దహోటళ్లు పూర్తిగా క మర్షియల్‌ గ్యాస్‌ సిలిండర్లనే వినియోగిస్తుండగా, కొందరు మాత్రం కమర్షియల్‌తోపాటు డొమెస్టిక్‌ గ్యాస్‌ వినియోగమూ చేస్తుంటారు. గ్యాస్‌ పంపిణీలో సబ్సిడీ లేకపోవటం, గ్యాస్‌ నిల్వలు సమృద్ధిగా ఉండటం, అధికారుల ఆంక్షలు లేకపోవటం, ప్రతి వినియోగదారుకీ ప్రతినెలా గ్యాస్‌ సిలిండర్లు పంపిణీ చేస్తుండటంతో డొమెస్టిక్‌ వినియోగం జరిగిపోతోంది.

చిరు వ్యాపారులపై ‘గ్యాస్‌’భారం

-డొమెస్టిక్‌ సిలిండర్లకు ధర పెంచి అమ్ముతున్న వినియోగదారులు

-రూ.1300 నుంచి రూ.2000 వరకు డిమాండ్‌

- అత్యవసరమనుకుంటేనే తీసుకుంటున్న వ్యాపారులు

- ఎక్కువ చోట్ల కట్టెల పొయ్యితోనే నెట్టుకొస్తున్న వైనం

(ఆంధ్రజ్యోతి - చల్లపల్లి):

చల్లపల్లిలో ప్రధానంగా ఫుడ్‌ జంక్షన్‌లు, క్యాటరింగ్‌ పాయింట్లు, భోజన హోటళ్లు ఉన్నాయి. వీటికితోడు టిఫిన్‌ హోటల్స్‌, బిర్యానీ పాయింట్లు, ప్రతి సెంటర్లోనూ అనేక టిఫిన్‌ సెంటర్లు ఉన్నాయి. వీరిలో 90శాతం మంది గ్యాస్‌పై ఆధారపడి హోటల్‌ వ్యాపారం చేస్తుండగా ఒకరిద్దరు మాత్రమే ఊకపొయ్యలపై ఆధారపడి ఉన్నారు. అయితే పెద్దహోటళ్లు పూర్తిగా క మర్షియల్‌ గ్యాస్‌ సిలిండర్లనే వినియోగిస్తుండగా, కొందరు మాత్రం కమర్షియల్‌తోపాటు డొమెస్టిక్‌ గ్యాస్‌ వినియోగమూ చేస్తుంటారు. గ్యాస్‌ పంపిణీలో సబ్సిడీ లేకపోవటం, గ్యాస్‌ నిల్వలు సమృద్ధిగా ఉండటం, అధికారుల ఆంక్షలు లేకపోవటం, ప్రతి వినియోగదారుకీ ప్రతినెలా గ్యాస్‌ సిలిండర్లు పంపిణీ చేస్తుండటంతో డొమెస్టిక్‌ వినియోగం జరిగిపోతోంది. ప్రతి వినియోగదారుకీ రెండేసి గ్యాస్‌ సిలిండర్లు ఉండటం, ఎవరి కుటుంబానికి వారికి గ్యాస్‌ కనెక్షన్‌లు ఉండటంతో గ్యాస్‌ విరివిగా లభించే అవకాశం ఉండటంతో బంధుమిత్రుల గ్యాస్‌పుస్తకాల ద్వారానో కొద్దిపాటి మొత్తం ఎక్కువ ఇచ్చో డొమెస్టిక్‌ సిలిండర్లపైనే వ్యాపారాలు చేసుకోవటం అలవాటుచేసుకున్నారు.

ధర పెంచిన వినియోగదారులు

ఇన్నాళ్లూ డొమెస్టిక్‌ సిలిండర్లతో నెట్టుకొస్తున్న చిరు వ్యాపారులపై పెద్ద కష్టమొచ్చింది. చిన్న చిన్న హోటల్స్‌, రోడ్డు వెంబడి చిరువ్యాపారులు, టీ స్టాల్స్‌, జిలేబీ పాయింట్లు ఇలా పలు చిరు వ్యాపారులకు గ్యాస్‌ ఆధారంగా కాగా, కొందరు కట్టెలపై వంటలు చేస్తూ డొమెస్టిక్‌ సిలిండర్లను బ్లాక్‌లో కొనుక్కుని రోజులు నెట్టుకువస్తున్నారు. గ్యాస్‌ సిలిండర్ల బుకింగ్‌ గడువు 45 రోజులకు పెంచటంతో ఎవరికివారు జాగ్రత్త పడిపోతున్నారు. దీంతో గతంలో రూ.వందో.. రెండు వందలో అదనంగా తీసుకుని సిలిండర్లు ఇచ్చినవారు ఇప్పుడు ఏకంగా రూ.1300 నుంచి రూ.2000 వరకు డిమాండ్‌ చేసి మరీ డొమెస్టిక్‌ సిలిండర్లు అమ్ముకుంటున్నారు. డబ్బులు అదనంగా ఇచ్చి బ్లాక్‌లో తెచ్చుకోవాలన్నా చిరు వ్యాపారులు ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ఏర్పడింది. కమర్షియల్‌ గ్యాస్‌ సిలిండర్లు లేకపోవటంతో పూర్తిగా డొమెస్టిక్‌ సిలిండర్లే ఆధారంగా మారటంతో అధిక వ్యయం ఖర్చు చేసి గ్యాస్‌ సిలిండర్లు తెచ్చుకోవటం అదనపు భారంగా మారింది. చిన్న సిలిండర్లు అందుబాటులో ఉండటంతో వాటిని తీసుకుని కొన్ని రోజులు కాలక్షేపం చేసిన వ్యాపారులు ఇప్పుడు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు.

పెరిగిన కట్టెల ధరలు

గ్యాస్‌ ఇబ్బందులతో కట్టెల పొయ్యిలపై వంటలు పెరగటంతో కట్టెపుల్లల ధరలు సైతం పెరిగిపోయాయి. గతంలో 10 కిలో సరుకు పుల్లలు రూ.130 ఉండగా, ప్రస్తుతం రూ.150 నుంచి రూ.170 వరకు విక్రయిస్తున్నారు. కర్రతుమ్మ పుల్లలు గతంకంటే పది రూపాయలు పెరిగినట్లు చెబుతున్నారు.

ఓ వైపు మండుటెండ.. మరోవైపు కట్టెల సెగ

కట్టెల పొయ్యలపై వంటలు ఇబ్బందికరంగా మారాయి. వేసవి తీవ్రత ఎక్కువగా ఉండటంతో ఓ వైపు ఎండ వేడిమి, మరోవైపు కట్టెల పొయ్యి సెగలతో వంట మేసి్త్రలు ఇబ్బందిపడుతున్నారు. దీంతో పలు హోటళ్లలో వంట చేసేవారు సరిగా పనులకు రావటం లేదు. పూర్తిగా గ్యాస్‌ సిలిండర్ల వంటలకు, పొగతో ఇబ్బందులు సైతం లేకుండా ఎడ్జస్ట్‌ ఫ్యాన్లు, పొగపోయేందుకు ప్రత్యేక ఏర్పాట్లతో పెద్దపెద్ద హోటళ్లలో వంటలు చేస్తున్న దశలో ఆరుబయట షామియానాల కింద కట్టెల పొయ్యలతో వంటలు చేయాల్సిరావటంతో శ్రమకోర్చాల్సి వస్తోంది. మరికొందరు ఊకపొయ్యిలు ఏర్పాటు చేస్తుండగా, చిరువ్యాపారులు ఇనుప డ్రమ్ములలో కట్టెపొయ్యిల ఏర్పాట్లు చేసుకుంటున్నారు.

Updated Date - Apr 07 , 2026 | 12:07 AM