Konaseema Gas Blowout: పచ్చని కోనసీమలో ‘అగ్ని’కీలలు
ABN , Publish Date - Jan 06 , 2026 | 05:28 AM
కృష్ణా-గోదావరి బేసిన్‌లో చమురు, సహజ వాయువుల నిక్షేపాలు పుష్కలంగా ఉండే కోనసీమ ప్రాంతంలో మరో గ్యాస్ బ్లోఔట్ ఆందోళనలు రేపింది.
జిల్లా ప్రజలకు గ్యాస్ బ్లోఔట్‌ల కలవరం
గత మూడు దశాబ్దాల్లో పలు ఘటనలు
అమలాపురం/అల్లవరం, జనవరి 5 (ఆంధ్రజ్యోతి): కృష్ణా-గోదావరి బేసిన్‌లో చమురు, సహజ వాయువుల నిక్షేపాలు పుష్కలంగా ఉండే కోనసీమ ప్రాంతంలో మరో గ్యాస్ బ్లోఔట్ ఆందోళనలు రేపింది. భూగర్భ గ్యాస్ పైపులైన్లు తరచూ పేలుతున్న ఘటనలతో ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. 1995లో అల్లవరం మండలం బోడసకుర్రు పంచాయతీ పరిధిలోని పాశర్లపూడి 19ఏ ఓఎన్జీసీ గ్యాస్ బ్లోఔట్ దేశంలోనే అతిపెద్దదిగా నిలిచింది. 2014 జూన్‌లో మామిడికుదురు మండలం నగరం గ్రామంలోని గెయిల్ కంపెనీ పైపులైను విస్ఫోటనం ఘట నలో 22 మంది ప్రాణాలు కోల్పోగా.. 18 మందికి తీవ్ర గాయాలయ్యాయి. తాజాగా మలికిపురం మండలం ఇరుసుమండ ఘట న నేపథ్యంలో గతంలో కోనసీమ ప్రాంతంలో జరిగిన ప్రమాదాలను ఒకసారి అవలోకనం చేసుకుందాం..
పాశర్లపూడి.. అతిపెద్ద బ్లోఔట్: కోనసీమ జిల్లా అల్లవరం మండలం బోడసకుర్రు పంచాయతీ పరిధిలోని పాశర్లపూడి 19ఏ ఓఎన్జీసీ గ్యాస్ బ్లోఔట్ సంభవించి 30 ఏళ్లు అయింది. అతిపెద్ద బ్లోఔట్‌గా దీన్ని గుర్తించారు. 1995 జనవరి 8 రాత్రి పాశర్లపూడి 19ఏ బావిలో డ్రిల్లింగ్ జరుగుతుండగా గ్యాస్ లీక్ ఏర్పడి పేలుడు సంభవించింది. 65 రోజులపాటు మంటలు కొనసాగాయి. 1,500 మందిని సురక్షిత ప్రాంతానికి తరలించారు. కోటిపల్లి సత్యనారాయణ బృందం వాటర్ అంబ్రెల్లా సాయంతో మంటల వద్దకు వెళ్లి అగ్నికీలల్లో ఉన్న పైపులైను పైభాగాన్ని కట్ చేసి పూర్తి నియంత్రణలోకి తెచ్చారు. 1995 మార్చి 15 నాటికి మంటలను పూర్తిగా నియంత్రించారు.
కొమరాడ బ్లోఔట్..: మామిడికుదురు మండలం కొమరాడ-1 (ఇ14-17 రిగ్) ఓఎన్జీసీ సైట్‌లో బ్లోఔట్ సంభవించింది. అధిక పీడనంతో గ్యాస్ ఎగసిపడడంతో ప్రమాదం సంభవించింది. 6 వేల కుటుంబాలను వేరేచోటకు తరలించారు.
దేవరపల్లిలో 20 రోజుల పాటు..
1997 ఫిబ్రవరి 19న రావులపాలెం మండలం దేవరపల్లి శివారు పితానివారిపాలెం మరో బ్లోఔట్ సంభవించింది. ఓఎన్జీసీ డ్రిల్లింగ్ సైట్‌లో ఎగసిపడిన మంటలు 20 రోజులు కొనసాగాయి. చెల్లూరు వరకు పైపులైన్లు వేసి.. క్రాస్ డ్రిల్లింగ్ చేసి పూర్తిగా మంటలు అదుపులోకి తెచ్చారు. అమలాపురం రూరల్ మండలం తాండవపల్లిలోని ఓఎన్జీసీ డ్రిల్లింగ్ సైట్ వద్ద 2006 సెప్టెంబరు 19న భారీ విస్ఫోటనంతో బ్లోఔట్ సంభవించి, మంటలు ఎగసిపడ్డాయి. 2014 జూన్ 27న మామిడికుదురు మండలం నగరం గ్రామంలోని గెయిల్ కంపెనీ పైపులైను విస్ఫోటనం జరిగింది. ఈ ఘటనలో 22 మంది ప్రాణాలు కోల్పోగా, 18 మందికి తీవ్రంగా గాయపడ్డారు. వందల సంఖ్యలో మూగజీవాలు ప్రాణాలు కోల్పోయాయి. నగరంలో తరచూ గ్యాస్ పైపులైన్ లీకేజీలు సంభవించడంతో స్థానిక ప్రజలు భయాందోళన మధ్య జీవనం సాగిస్తున్నారు.