Share News

Konaseema District: కోనసీమలో బ్లో ఔట్‌.. ఎగిసిపడుతున్న మంటలు..

ABN , Publish Date - Jan 06 , 2026 | 04:15 AM

పచ్చని కోనసీమలో మరోసారి ‘బ్లో ఔట్‌’ మంటలు చెలరేగాయి. డ్రిల్లింగ్‌ చేస్తున్న రిగ్‌ వద్ద గ్యాస్‌ లీకై... ఒక్కసారిగా మంటలు పుట్టాయి.

Konaseema District: కోనసీమలో బ్లో ఔట్‌.. ఎగిసిపడుతున్న మంటలు..

  • 100 అడుగుల ఎత్తుకు ఎగసిపడుతున్న అగ్నికీలలు

  • కాలి బూడిదైన కొబ్బరి చెట్లు, పంట పొలాలు

  • ఇరుసుమండ గ్యాస్‌ లీక్‌తో భయాందోళన

  • మూసివేసిన బావిలో మరింత లోతుకు డ్రిల్లింగ్‌

  • తొలుత అధిక పీడనంతో లీకైన గ్యాస్‌.. తర్వాత

  • మరో విస్ఫోటం.. ప్రాణ భయంతో జనం పరుగులు

  • జనావాసాలకు దూరంగా ఉండడంతో తప్పిన ప్రాణనష్టం.. 2 గ్రామాల ప్రజల తరలింపు

అమలాపురం/మలికిపురం, రాజమహేంద్రవరం, జనవరి 5 (ఆంధ్రజ్యోతి): పచ్చని కోనసీమలో మరోసారి ‘బ్లో ఔట్‌’ మంటలు చెలరేగాయి. డ్రిల్లింగ్‌ చేస్తున్న రిగ్‌ వద్ద గ్యాస్‌ లీకై... ఒక్కసారిగా మంటలు పుట్టాయి. అధిక పీడనంతో కూడిన గ్యాస్‌ తీవ్రతకు వంద అడుగుల ఎత్తు వరకు అగ్నికీలలు ఎగసి పడుతున్నాయి. తొలుత గ్యాస్‌ లీకై... అరగంటలోనే పెద్ద శబ్దంతో మంటలు వ్యాపించాయి. 25 మీటర్ల వ్యాసార్థంలో విస్తరించి విరుచుకుపడుతున్నాయి. డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా మలికిపురం మండలం ఇరుసుమండ గ్రామ సమీపంలోని ‘మోరి ఫీల్డ్‌-5’లో సోమవారం మధ్యాహ్నం మొదలైన ఈ బ్లో ఔట్‌... ఒకప్పటి పాశర్లపూడి ‘బ్లోఔట్‌’ను గుర్తుకు తెస్తోంది. దీంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఇళ్లకు తాళాలు వేసి పిల్లాపాపలతో పరుగులు తీశారు. జిల్లా అధికార యంత్రాంగం హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని సహాయక, పునరావాస చర్యలు చేపట్టింది.

అసలేం జరిగిందంటే..

ఇరుసుమండ గ్రామంలోని ఈ ప్రదేశంలో 1993లో ఓఎన్జీసీ డ్రిల్లింగ్‌ నిర్వహించింది. ఆ తర్వాత ఈ బావిని వదిలేసింది. అయితే ఈ బావిని ఓఎన్జీసీ సంస్థ 2024లో డీప్‌ ఇండస్ర్టీస్‌ ప్రైవేటు లిమిటెడ్‌కు సబ్‌లీజుకు ఇచ్చింది. ఇక్కడ ‘వర్క్‌ ఓవర్‌ రిగ్‌తో’ ఆ సంస్థ అన్వేషణ చేపట్టి.. ఈ బావిలో అపార చమురు, గ్యాస్‌ నిక్షేపాలున్నట్టు గుర్తించించింది. ఈ క్రమంలో గతంలోనే డ్రిల్లింగ్‌ పూర్తయిన ఈ బావిలో సోమవారం మరింత లోతుగా 2.7 కిలోమీటర్లు వెళ్లేందుకు ప్రయత్నించారు. ఈ సమయంలో అధిక ఒత్తిడితో గ్యాస్‌ విస్ఫోటం సంభవించింది. సుమారు అరగంట తర్వాత మరో విస్ఫోటంతో భారీ శబ్ధాలతో మంటలు చెలరేగాయి. ఈ మంటలు వంద అడుగుల ఎత్తు వరకు ఎగసిపడ్డాయి. దీంతో సమీప ప్రాంతాల ప్రజలు భయకంపితులై ఇళ్లను ఖాళీ చేసి ప్రాణభయంతో పరుగులు తీశారు. భూగర్భ పొరల్లో 30 నుంచి 40 మిలియన్‌ టన్నుల గ్యాస్‌, చమురు నిల్వలు ఉన్నట్టు అధికారులు అంచనా వేసినట్టు సమాచారం. ప్రస్తుతం డ్రిల్లింగ్‌ సైట్‌ వద్ద మంటలు వంద అడుగుల ఎత్తు, 25 మీటర్ల వ్యాసార్థంతో ఎగసిపడుతున్నాయి. దీంతో సైట్‌ వద్ద ఉన్న వాహనాలు, రిగ్‌ పరికరాలు కాలి బూడిదవుతున్నాయి. కొబ్బరిచెట్లు, పంటపొలాలు బుగ్గిపాలవుతున్నాయి. బావిలో భారీగా చమురు, సహజవాయు నిక్షేపాలు ఉన్నందున ప్రస్తుతం ఈ భారీ బ్లో ఔట్‌ను అదుపు చేయడం కష్టమేనని ఓఎన్జీసీ భావిస్తోంది. పైపులైను వ్యవస్థ కూలిపోవాలి లేదంటే మొత్తం గ్యాస్‌ రిజర్వాయర్‌ మండి పీడనం తగ్గితే తప్ప దీన్ని అరికట్టలేమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కాగా.. మంటలను అదుపు చేసేందుకు ఘటనా స్థలానికి సమీపంలో ఉన్న ప్రధాన పంట కాల్వ నుంచి నీటిని వెదజల్లే ప్రక్రియను అధికారులు చేపట్టారు.

24 గంటల్లో స్పష్టత..: కలెక్టర్‌ మహేశ్‌కుమార్‌

మరో 24 గంటల్లో ఈ బ్లో ఔట్‌ అదుపుపై స్పష్టత వచ్చే అవకాశం ఉందని కోనసీమ జిల్లా కలెక్టర్‌ మహేశ్‌కుమార్‌ మీడియాకు వెల్లడించారు. బ్లో ఔట్‌ సమాచారం తెలిసిన వెంటనే కలెక్టర్‌తోపాటు ఎస్పీ రాహుల్‌ మీనా, డీఆర్వో మాధవి, ఎంపీ గంటి హరీశ్‌ బాలయోగి, స్థానిక ఎమ్మెల్యే దేవవరప్రసాద్‌, ఆ ప్రాంతానికి చెందిన ప్రజాప్రతినిధులు లక్కవరంలో మకాం వేసి పరిస్థితులను సమీక్షించారు. ముందు జాగ్రత్తగా కిలోమీటరు పరిధిలోని ఇరుసుమండతోపాటు సరిహద్దు గ్రామమైన లక్కవరం ప్రాంతంలోని కొన్ని కుటుంబాలను ఖాళీ చేయించాలని కలెక్టర్‌ అధికారులకు సూచించారు. ఇరుసుమండ పూర్తిగా లక్కవరంలోని కొన్ని ప్రాంతాల్లో ప్రజలు తమ ఇళ్లను ఖాళీ చేశారు. బ్లో ఔట్‌ భయంతో పశువులను వదిలివేసి వెళ్లిపోయారు. కొందరు బంధువుల ఇళ్లకు వెళ్లిపోగా.. మిగిలిన వారిలో 150 మంది లక్కవరం ఎంజీ గార్డెన్స్‌లోను, 400 మంది గుబ్బలపాలెంలోను పునరావాసం పొందుతున్నారు. వీరికి సోమవారం రాత్రి భోజన సదుపాయం ఏర్పాటు చేశారు. బ్లో ఔట్‌ కారణంగా సోమవారం ఉదయం మలికిపురం మండలంలో విద్యుత్‌ సరఫరాను నిలిపివేశారు. ఇరుసుమండ, లక్కవరం, పోతుమట్ల, చింతలపల్లి, గుబ్బలపాలెం గ్రామాల్లో రాత్రి కూడా విద్యుత్‌ను నిలిపివేశారు. కాగా, ఘటనాస్థలి వద్ద జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన అగ్నిమాపక శకటాలు, వాటర్‌ ట్యాంకులను అగ్నిమాపక సిబ్బంది మోహరించింది.

అవసరమైతే బావిని మూసివేస్తాం: ఓఎన్జీసీ

బ్లో ఔట్‌ నియంత్రణకు చర్యలు చేపట్టినట్టు ఓఎన్జీసీ సోమవారం ప్రకటించింది. అవసరమైతే ఈ బావిని మూసివేస్తామని స్పష్టం చేసింది. మోరి-5 జీసీఎస్‌ పరిధిలో డీప్‌ ఇండస్ర్టీస్‌ లిమిటెడ్‌ పీఈసీ ఆపరేటర్‌గా ఉన్నారని, వాళ్లే ఇక్కడ గ్యాస్‌ లీకేజీ సమాచారం తమకు తెలియజేశారని పేర్కొంది. ఇరుసుమండ బావి రిమోట్‌ ఏరియాలో, జనావాసాలకు సుమారు 500-600 మీటర్ల దూరంలో ఉందని, దీనివల్ల ప్రాణనష్టం జరగలేదని, ఎవరూ గాయపడలేదని తెలిపింది. గ్యాస్‌ లీకైన ప్రాంతంలో కూలింగ్‌ ఆపరేషన్లు ప్రారంభించినట్టు చెప్పింది. సంక్షోభ నిర్వహణ బృందాలను (సీఎంటీ) రంగంలోకి దించామని, పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని వెల్లడించింది. అవసరమైతే బావికి క్యాప్‌ (మూత) వేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయని పేర్కొంది. అంతర్జాతీయ నిపుణులను సంప్రదిస్తున్నట్టు వివరించింది. తమ సీనియర్‌ మేనేజ్‌మెంట్‌, సాంకేతిక నిపుణులు పరిస్థితిని నిశితంగా పర్యవేక్షిస్తున్నారని, నరసాపురం తదితర సమీప ప్రాంతాల నుంచి అదనపు పరికరాలు రప్పిస్తున్నామని తెలిపింది. పరిస్థితిని బట్టి మరింత మెరుగైన నిర్ణయాలు తీసుకుంటామని వివరించింది.

బ్లోఅవుట్‌ ఘటనపై సీఎం చంద్రబాబు ఆరా

అమలాపురం, జనవరి 5(ఆంధ్రజ్యోతి): ఓఎన్జీసీ డ్రిల్లింగ్‌ సైట్‌ వద్ద బ్లో ఔట్‌ ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఆరా తీశారు. జిల్లాకు చెందిన ఇన్‌చార్జి మంత్రి అచ్చెన్నాయుడు, కార్మికశాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ లతో ఫోన్‌లో మాట్లాడారు. ఓఎన్జీసీ ప్రతినిధులతో మాట్లాడి మంటలను అదుపులోకి తెచ్చేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు నివేదించాలన్నారు.

గల్ఫ్‌లో ఉలిక్కిపడిన ప్రవాసీయులు కుటుంబసభ్యుల క్షేమంపై ఆందోళన

(ఆంధ్రజ్యోతి గల్ఫ్‌ ప్రతినిధి)

ఇరుసుమండలో బ్లో ఔట్‌ ఘటన గల్ఫ్‌ దేశాల్లోని ప్రవాసీయులను కలవరపాటుకు గురిచేసింది. ఇరుసుమండ, లక్కవరంతో పాటు పరిసర గ్రామాలకు చెందిన అనేక మంది సౌదీ అరేబియా, ఖతార్‌, కువైత్‌, యూఏఈ ల్లో పనిచేస్తున్నారు. గ్యాస్‌ లీకేజీ నేపథ్యంలో సౌదీ అరేబియాలో ఉంటున్న లక్కవరం గ్రామానికి చెందిన రమ్య.. తన తల్లి తోట అన్నపూర్ణమ్మ ఎలా ఉందోనని ఆందోళన చెందారు. అయితే తన తల్లి సురక్షిత ప్రాంతానికి చేరిందని తెలిశాక రమ్య ఊపిరి పీల్చుకున్నారు. దుబాయ్‌లో పనిచేస్తున్న గడ్డం నరేశ్‌ కూడా.. గ్రామంలోని తన తల్లిదండ్రులకు ఫోన్‌చేసి క్షేమ సమాచారం తెలుసుకున్నారు. దుబాయ్‌లో పనిచేస్తున్న అనేకమంది తమవారి గురించి ఆందోళన చెందారని నరేశ్‌ వెల్లడించారు. ఈ అగ్నిప్రమాదం వల్ల ఎలాంటి ప్రాణనష్టం సంభవించనప్పటికీ.. ఆర్థిక నష్టం సంభవించినట్టు ఖతార్‌లో పనిచేసే కోనసీమ జిల్లా వాసి దొండపాటి శశికిరణ్‌ తెలిపారు.

గుండె ఆగినంత పనైంది

‘‘మా ఇళ్లు రిగ్‌కు సమీపంలో ఉన్నాయి. నాకు కళ్లు సరిగా కనపడవు. ఓఎన్జీసీ రిగ్‌ నుంచి శబ్ధాలు రావడంతో ఏదో ప్రమాదం జరగనుందని భావించి కంగారుగా చేలల్లో నుంచి పరుగెత్తి లక్కవరం చేరాను. నా భార్య లక్ష్మి, అత్త శశిరేఖ, బావమరిది నాగరాజు కంగారుగా నన్ను వెతుక్కుంటూ వచ్చారు. ఉదయం జరిగిన భీభత్సానికి గుండె ఆగినంత పనైంది.’’

- లంక వసంతరావు, ఇరుసుమండ, మలికిపురం మండలం

బతుకుపై ఆశను వదులుకున్నాం

‘‘ఉదయం 10-11 గంటల సమయంలో భారీ శబ్ధాలు వచ్చాయి. తరువాత బ్లో ఔట్‌ జరుగుతుందని ఇళ్లన్నింటినీ ఖాళీ చేయమని చుట్టుపక్కల వాళ్లంతా హడావిడి చేశారు. దీంతో లక్కవరం ఎంజీ గార్డెన్స్‌లో తలదాచుకున్నాం. అప్పుడప్పుడూ చిన్నచిన్న గ్యాస్‌ లీకేజీలు వంటివి జరిగేవి. ఈరోజు జరిగిన బ్లోఅవుట్‌తో గుండె అదిరిపోయింది. బతుకుపై ఆశను వదులుకున్నాం.’’

- వలవల అమ్మాజీ, సర్పంచ్‌, ఇరుసుమండ,

మలికిపురం మండలం

Updated Date - Jan 06 , 2026 | 06:09 AM