Share News

పేరు.. పోరు!

ABN , Publish Date - Mar 03 , 2026 | 04:44 AM

ఆంధ్రప్రదేశ్‌ను తెలుగునాడుగా మార్చాలంటూ ప్రముఖ ప్రవచనకర్త గరికిపాటి నరసింహరావు చేసిన వ్యాఖ్యలతో రాష్ట్రంలో కొత్త చర్చ మొదలైంది.

పేరు.. పోరు!

  • ఏపీని తెలుగు నాడుగా మార్చాలన్న గరికిపాటి

  • ఆంధ్రప్రదేశ్‌ తెలుగు పదమే కాదని వాదన

  • రాష్ట్రం పేరు మారితేనే తెలుగువారి బతుకులు మారతాయంటూ వ్యాఖ్యలు

  • ప్రవచనకర్త ప్రతిపాదనపై మిశ్రమ స్పందన

  • అడిగే వారు లేరనుకున్నారా?

  • తెలివి ఎక్కువై అధిక ప్రసంగాలు

  • ఎందుకీ వింత పోకడలు, ఆలోచనలు?

  • భువనేశ్వరి పీఠాధిపతి కమలానంద భారతీ ఆగ్రహం

అమరావతి, అమలాపురం, మార్చి 2 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్‌ను తెలుగునాడుగా మార్చాలంటూ ప్రముఖ ప్రవచనకర్త గరికిపాటి నరసింహరావు చేసిన వ్యాఖ్యలతో రాష్ట్రంలో కొత్త చర్చ మొదలైంది. ఆయన ప్రతిపాదనపై మిశ్రమ స్పందన వ్యక్తం అవుతోంది. ఇలాంటి వింత పోకడలు, వింత ఆలోచనలు ఎందుకు వస్తున్నాయో తెలియడం లేదంటూ భువనేశ్వరి పీఠాధిపతి కమలానంద భారతీ సోమవారం తీవ్రంగా స్పందించారు. ఆంధ్రప్రదేశ్‌ అనే పదం తెలుగు మాట కాదన్న గరికిపాటి వ్యాఖ్యలను ఆయన ఖండిస్తూ..రామాయణ కాలం నుంచీ ఇక్కడ ఒక జాతి ఉందని, దానికి ఆంధ్రా అనే పేరు ఉందని, అది తెలుగు కాకుండా ఎలా పోతుందంటూ ప్రశ్నించారు. అసలేం జరిగిందంటే.. డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా కేంద్రం అమలాపురంలో ఇటీవల మూడో ప్రపంచ తెలుగు మహాసభలు జరిగాయి. తొలిరోజు సభకు గరికిపాటి నరసింహారావు ముఖ్యఅతిథిగా హాజరై, కీలక ప్రసంగం చేశారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌ పేరు గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘‘మనకు రాష్ట్రాభిమానం లేదు. నిన్ననే కేరళవాసులు తమ రాష్ట్రం పేరును కేరళంగా మార్చుకున్నారు. మన రాష్ట్రం పేరును కూడా మాజీ సీఎం ఎన్టీ రామారావు ఆశయానికి అనుగుణంగా తెలుగునాడుగా మార్చాలి. అప్పుడే మనకు రాష్ట్రాభిమానం ఉన్నట్టు.. ఆంధ్రప్రదేశ్‌ అనే పదం తెలుగు మాట కాదు. ఉత్తరప్రదేశ్‌, మధ్యప్రదేశ్‌, హిమాచల్‌ప్రదేశ్‌ ఎంతో ఆంధ్రప్రదేశ్‌ కూడా అంతే. తెలుగుదనమే అందులో లేదు. ఎన్టీ రామారావు తెలుగునాడుగా ఏపీ పేరు మార్చడం కోసం ఎంతో ప్రయత్నం చేశారు. నానా యాతన పడ్డారు. ఒక సున్నా లేకపోతే ఏం అయిందిలే అని కేరళ వాళ్లు ఊరుకోలేదు. కేరళం అని మార్చుకున్నారు. వారి పట్టుదల మనలో కూడా వస్తే రాష్ట్రం పేరే కాదు, తెలుగువారి బతుకులు కూడా మారుతాయి’’ అని గరికపాటి నరసింహరావు వ్యాఖ్యానించారు.


ఆంధ్రాను తెలుగునాడుగా ఎలా మారుస్తారు? : కమలానంద భారతీ

ఆంధ్రప్రదేశ్‌ పేరును తెలుగునాడుగా ఎలా మారుస్తారని భువనేశ్వరి పీఠాధిపతి కమలానంద భారతీ..గరికిపాటిని ఉద్దేశించి ప్రశ్నించారు. దీనిపై సోమవారం ఒక వీడియో విడుదల చేశారు.‘‘మహా సంకల్పంతో అంగ, వంగ, కళింగ, సౌరాష్ట్ర అని చెప్పుకొనే క్రమంలో కేరళ, ద్రవిడ, ఆంధ్రా అనే పదాలు వస్తాయి. ఇక్కడ ఆంధ్ర మహాభారతం, ఆంధ్ర భాగవతం జనించాయి. అడిగే వారు లేరని, తెలివి, పాండిత్యం ఎక్కువై అధిక ప్రసంగాలు చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీని స్థాపించినప్పుడు ఎన్టీఆర్‌ ఆంధ్రుల ఆత్మగౌరవం కోసం నినదించారు. సంస్కృతాంధ్ర అనాలని, సంస్కృత తెలుగు అనడం దుష్ట సమాసం అవుతుందని నన్నయ సెలవిచ్చారు.’’ అని కమలానంద భారతీ తెలిపారు.

Updated Date - Mar 03 , 2026 | 04:45 AM