Share News

బెంగళూరు కేంద్రంగా ఏం చేశారు?

ABN , Publish Date - Jul 19 , 2026 | 04:00 AM

‘బెంగళూరు కేంద్రంగా మీరు ఏం చేశారు? తక్కువ సమయంలో ఎక్కువ ఆదాయం ఎలా సంపాదించారు? రావణ్‌తో పాటు మాజీ ఐపీఎస్‌,ఐపీఎస్‌తో మీరెందుకు మాట్లాడాల్సి వచ్చింది?’..

బెంగళూరు కేంద్రంగా ఏం చేశారు?

  • మాజీ ఐఏఎస్‌, ఐపీఎస్‌తో మీరెందుకు మాట్లాడారు

  • రావణ్‌ ఎన్నిసార్లు వచ్చాడు.. ఎవరెవరిని కలిశాడు

  • అతడి చానల్‌లో పెట్టుబడులు పెట్టించాల్సిన అవసరం ఏంటి

  • గమన, ఇంద్రసేనకు గన్నవరం పోలీసుల ప్రశ్నలు

  • డొంకతిరుగుడు సమాధానాలు.. మౌనం.. అబద్ధాలు

  • 21న విచారణకు హాజరు కావాలని నోటీసులు

విజయవాడ, జూలై 18 (ఆంధ్రజ్యోతి): ‘బెంగళూరు కేంద్రంగా మీరు ఏం చేశారు? తక్కువ సమయంలో ఎక్కువ ఆదాయం ఎలా సంపాదించారు? రావణ్‌తో పాటు మాజీ ఐపీఎస్‌,ఐపీఎస్‌తో మీరెందుకు మాట్లాడాల్సి వచ్చింది?’.. ప్రశ్న రావణ్‌ కేసులో పోలీసులు గమన, ఇంద్రసేనా చౌదరిలకు విచారణలో వేసిన ప్రశ్నలు ఇవీ. ఇద్దరూ డొంకతిరుగుడు సమాధానం చెప్పగా, మరికొన్ని ప్రశ్నలకు అబద్ధాలు చెప్పారు. గమన, ఇంద్రసేనలను గన్నవరం పోలీసులు మూడోసారి విచారించారు. గన్నవరంలోని డీఎస్పీ కార్యాలయంలో శనివారం ఉదయం నుంచి సాయంత్రం వరకు ఈ విచారణ సాగింది. కొన్ని ప్రశ్నల విషయంలో ఇద్దరినీ కలిపి కొంతసేపు, మరికొన్ని ప్రశ్నలకు వేర్వేరుగా విచారణ సాగించారు. ఈ సారి విచారణ మొత్తం బెంగళూరులో కార్యకలాపాల కేంద్రంగా సాగింది. గమన బెంగళూరులో ఉంటూ రీల్స్‌ చేసింది. హైదరాబాద్‌ నుంచి రావణ్‌ ఎన్నిసార్లు బెంగళూరు వచ్చాడని అడిగిన ప్రశ్నకు గమన డొంకతిరుగుడుగా సమాధానం చెప్పింది. బెంగళూరు వచ్చినప్పుడు ఎవరెవరిని కలిశాడని అడగగా, ఆమె నోరు విప్పలేదని సమాచారం. రావణ్‌కు సంబంధించిన ప్రశ్న యూట్యూబ్‌ చానల్‌ ఆధునికీకరణకు కొంతమందితో గమన పెట్టుబడులు పెట్టించినట్టు తెలిసింది.


ఆర్థిక వనరులపై దర్యాప్తు చేస్తున్న క్రమంలో ఈ విషయాన్ని పోలీసులు గుర్తించారని సమాచారం. అసలు రావణ్‌ చానల్‌కు పెట్టుబడుల ప్రవాహాన్ని పంపించాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. దీనికి ఆమె నుంచి సమాధానం రాలేదు. ఇంద్రసేన బంధువైనప్పటికీ రావణ్‌తో బంధం బలపడడానికి కారణాలు ఏమిటన్న ప్రశ్నకు జవాబు ఇవ్వలేదు. ఇంద్రసేన కొన్ని ప్రశ్నలకే నోరు విప్పాడు. బెంగళూరులో ఎన్ని వీడియోలు చేశారని అడిగితే మౌనం వహించాడు. యూట్యూబ్‌ ద్వారా వచ్చిన ఆదాయంతోనే చానల్‌ను ఆధునికీకరించారని ఇద్దరూ చెప్పారు. యూట్యూబ్‌ నుంచి నెలకు ఎంత ఆదాయం వస్తుందని ప్రశ్నించినప్పుడు తెల్లముఖం వేశారు. ఆ వివరాలు రావణ్‌కు మాత్రమే తెలుసని జవాబిచ్చారు. తిరిగి 21వ తేదీన విచారణకు హాజరు కావాలని గమన, ఇంద్రసేనలకు పోలీసులు నోటీసులు ఇచ్చారు.


31 వరకు రావణ్‌కు రిమాండ్‌ పొడిగింపు

ప్రశ్న యూట్యూబ్‌ చానల్‌ అధినేత బచ్చలకూరి జోసెఫ్‌ అలియాస్‌ ప్రశ్న రావణ్‌కు గన్నవరంలోని 12వ అదనపు జ్యుడిషియల్‌ ఫస్ట్‌క్లాస్‌ మేజిస్ట్రేట్‌ కోర్టు 31వ తేదీ వరకు రిమాండ్‌ పొడిగించింది. చట్టవిరుద్ధ కార్యకలాపాల నిరోధక చట్టం(ఉపా) కేసులో రావణ్‌ ప్రస్తుతం నెల్లూరు కేంద్ర కారాగారంలో ఉన్నాడు. ఆయన రిమాండ్‌ గడువు శనివారంతో ముగియడంతో జైలు అధికారులు వర్చువల్‌గా కోర్టులో హాజరు పరిచారు. రిమాండ్‌ పొడిగిస్తూ న్యాయాధికారి ఎన్‌.గాయత్రి ఉత్తర్వులు జారీ చేశారు.

Updated Date - Jul 19 , 2026 | 04:03 AM